National identity
-
బాన్సువాడ ఎంసీహెచ్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ)‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1)‘లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్‌ను పలుమార్లు సందర్శించింది. అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధా రించుకొని అక్రెడిటేషన్ మంజూరు చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆసుపత్రులకే బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటేషన్ ఉంది. దీంతో భారత దేశ స్థాయిలో ఘనత సాధించిన ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సీఎం ఆదేశాలతో .. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్‘ను నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్‌లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. వైద్య సిబ్బందికి అభినందనలు: హరీశ్‌రావు బాన్సువాడ ఎంసీహెచ్‌కు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటే షన్ రావడం హర్షణీయమని హరీశ్‌రావు పేర్కొ న్నారు. హాస్పిటల్ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. -
మలేరియా నియంత్రణలో రాష్ట్రానికి జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మలేరియాను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015–21) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని, దీంతో తెలంగాణ కేటగిరీ–2 నుంచి కేటగిరీ–1లోకి చేరిందని కేంద్రం ప్రశంసించింది. ‘సత్కారాన్ని అందుకునేందుకు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపింది’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. -
ప్రధాని చొరవతోనే పైక్ తిరుగుబాటుకు జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: ఒడిశాలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పైక్ తిరుగుబాటుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే జాతీయ గుర్తింపు వచ్చిందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ఫిక్కీ భువనేశ్వర్ శాఖ శనివారం నిర్వహించిన వెబినార్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బుక్సీ జగబంధు నేతృత్వంలో పైక్ తిరుగుబాటుకు దారితీసిన కారణాలను వివరించారు. 1997లో ఒడిశాలో తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశానని చెప్పారు. ఎనిమిదేళ్లపాటు కొనసాగిన పైక్ తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర యుద్ధంగా గుర్తించడానికి చొరవ తీసుకున్నానని తెలిపారు. గజపతి మహారాజుకు కమాండర్–ఇన్–చీఫ్ అయిన బుక్సీ జగబంధు బ్రిటిష్ పాలకుల అణచివేత చర్యలను సహించలేకపోయారని వివరించారు. దీంతో ఆ రాష్ట్రంలోని పైకా అధిపతులందరినీ ఒకచోట చేర్చి ప్రజావిప్లవాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇలా 1817, మార్చి 29న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఒడిశాలో సాధారణ ప్రజలు చేసిన పోరు మొదటి స్వాతంత్య్ర యుద్ధానికి దారితీసిందని వివరించారు. వెబినార్‌లో మాజీ ఎంపీ డాక్టర్ దిలీప్ టిర్కీ ప్రారంభోపన్యాసం చేశారు. భువనేశ్వర్ ఫిక్కీ (ఎఫ్ఎల్వో) చైర్పర్సన్ సునీతా మొహంతి, వైస్ చైర్పర్సన్ నమృత చాహల్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్పీ సిసోడియా, వెబినార్‌లో పాల్గొన్నారు. -
పుట్లూరు పోలీస్‌స్టేషన్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, పుట్లూరు(అనంతపురం) : ప్రజలకు మెరుగైన సేవలందించిన పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ పోలీసు స్టేషన్ల జాబితాలో పుట్లూరు స్టేషన్ 23వ స్థానం దక్కించుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధిత సమస్యలు ఓపిగ్గా వినడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడం, స్టేషన్లో మెరుగైన సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పుట్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన విధానం పరిశీలించారు. సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల కోసం రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంతో పాటు పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అలాగే పోలీసులు తీరుపై మండలంలోని ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా మెజార్టీ శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం బృందం పుట్లూరు పోలీస్ స్టేషన్‌ను ఆదర్శ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేసింది. ఈమేరకు దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్లలో పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు 23వ స్థానం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అదనపు ఎస్పీ చౌడేశ్వరి మాట్లాడుతూ, పుట్లూరు పోలీసు స్టేషన్‌ను దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం అనేక సంస్కరణలు అమలు చేసినట్లు తెలిపారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లను ఆదర్శ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు. -
ఇక నుంచి పాకిస్థానీ కాదు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్లు ప్రధాని నసీర్ ఉల్ ముల్క్ ప్రకటించారు. ఈ మేరకు నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్టు డైరెక్టోరేట్ కార్యాలయాల నుంచి ప్రకటన వెలువడింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన జాతీయత గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కూడా ఆటోమేటిక్‌గా రద్దైపోతుంది. ముషర్రఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీల నిలుపుదల ఉద్దేశంతోనే కోర్టు ఇది వరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్‌కు.. తాజా ఆదేశాలు ఇబ్బందికరంగా మారొచ్చు. పాస్‌పోర్టు రద్దుతో దుబాయ్‌లో ఆయన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే కేసుల విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాక్‌కు రప్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక డాక్యుమెంట్ల ద్వారా ఆయన్ని పాక్‌కు రప్పించనున్నారు. ముషర్రఫ్ కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది కూడా. 2007లో అత్యవసర పరిస్థితి విధించటం, సుప్రీం కోర్టు జడ్జిల గృహనిర్భందం, రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా వ్యవహరించటం, తదితర ఆరోపణలపై ముషర్రఫ్ ‘దేశ ద్రోహం’ కేసును ఎదుర్కుంటున్నారు. 2016లో చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషర్రఫ్.. త్వరలో జరగబోయే పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. -
ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి జాతీయ గుర్తింపు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి జాతీయ గుర్తింపు లభించిందని ఆర్డీటీ ఫుట్‌బాల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయభాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీ స్థాపించి రాయలసీమ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ఫుట్‌బాల్ క్రీడలో వారిని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 24 మండల స్థాయి ఫుట్‌బాల్ అనుబంధ అకాడమీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్డీటీ చేస్తున్న కషికి ఫలితంగా ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) జాతీయ స్థాయిలో గుర్తింపును కల్పిస్తూ ఏఐఎప్‌ఎఫ్ కార్యదర్శి కుషల్దాస్, టెక్నికల్ డైరెక్టర్ స్కాట్ ఓ డోనెల్లు అక్రిడిటేషన్‌ను జారీ చేశారన్నారు. జాతీయస్థాయి గుర్తింపు లభించినందుకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఫుట్‌బాల్ ప్రాజెక్ట్ టెక్నికల్ డైరెక్టర్ మైఖెల్లిడో హర్షం వ్యక్తం చేశారు. -
‘గురురాజ’తో నంద్యాలకు జాతీయ గుర్తింపు
నంద్యాల: విద్యారంగంలో గురురాజ బ్యాంక్ కోచింగ్ సెంటర్ నిర్వహణతో నంద్యాల పట్టణానికి జాతీయస్థాయి గుర్తింపు వచ్చిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని బ్యాంక్ కోచింగ్ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నంద్యాలకు నీలం సంజీవరెడ్డి, పీవీ.నరసింహరావుల ద్వారా జాతీయస్థాయి గుర్తింపు లభిస్తే దస్తగిరి రెడ్డిద్వారా గురురాజ కోచింగ్ సెంటరులో శిక్షణ పొందడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. పాతికేళ్లలో 13వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక బ్యాంకులో నంద్యాలకు చెందిన ఉద్యోగి పనిచేయడం దస్తగిరి రెడ్డి కఠోర దీక్షకు కారణమన్నారు. తాను హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాలకు తరచూ వెళ్తుంటానని అక్కడ తనను కలిసే వీఐపీలకు గురురాజ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ప్రాధాన్యతను గుర్తుచేస్తుంటానని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి పట్టుపడితే వదలడు అన్న దీక్షతో ముందుకు సాగుతున్నారన్నారు. బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధినేత దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ప్రారంభించానని బ్యాంక్ కోచింగ్ సెంటరు ఇపుడు అది మహా సముద్రంగా మారిందన్నారు.. ప్రస్తుతం ఏడాది 4 వేల మందికి ఉద్యోగాలు లభించే విధంగా శిక్షణలో ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలిపారు. భూమా, ఏవీ సినీనటుడు తనికెళ్ల భరణితో కలిసి రజతోత్సవ సంచికను విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఎస్పీవెరైడ్డి అనారోగ్య కారణాలతోనే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. లఘుచిత్రం పోస్టర్ విడుదల: రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చైతన్యపరచే లఘుచిత్రంను యోగా వెంకటేశ్వర్లు దర్శకత్వం వహించి రూపొందించారని తనికెళ్ల భరణి తెలిపారు. ఆయనకు సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పదివేల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారిలో రైతు కుటుంబాల నుంచి వచ్చినవారు ఎంతమందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. 90శాతం మంది చేతులు ఎత్తారు. అయితే తిరిగి వ్యవ సాయ ఎంతమంది చేస్తారని ప్రశ్నిస్తే 5,6మందికి మించి చేతులు ఎత్తకపోవడంతో సమావేశం విస్మయానికి గురైంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ విజయభాస్కర్‌రెడ్డి, అమృతరాజు, కొండారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, ఏవీఆర్ ప్రసాద్, విద్యాసంస్థల డెరైక్టర్లు మౌలాలిరెడ్డి, షేక్షావలిరెడ్డి పాల్గొన్నారు. -
కమ్మని కాఫీ
=మన్యంలో పంటకు జాతీయ గుర్తింపు =వచ్చే జనవరిలో పురస్కారం బహూకరణ =ఘనత సాధించిన చుట్టుమెట్ట ఎస్టేట్ సిబ్బంది చింతపల్లి, న్యూస్‌లైన్: మన్యంలో కాఫీ సాగు చేపడుతున్న అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్డీసీ)కి కమ్మని కబురు అందింది. ఈ సంస్థ పరిధిలో సాగవుతున్న కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పెదబయలు మండలం చుట్టుమెట్ట ఎస్టేట్‌లో పండించిన అరబిక్ కాఫీ గింజలకు అవార్డు దక్కింది. 2003 నుంచి 2012 వరకు పదేళ్లలో ఏడు సార్లు రీజినల్‌స్థాయి అవార్డులు పొందిన ఏజెన్సీ కాఫీకి ఇప్పుడు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. గతేడాది జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, మినుములూరు, అనంతగిరి, అరకులోయ తోటల్లో సాగయిన కాఫీ గింజల శాంపిళ్లను ఏపీఎఫ్డీసీ అధికారులు కేంద్ర కాఫీ బోర్డు ద్వారా బెంగళూరులోని అవార్డుల పరిశీలన కమిటీకి పంపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండించిన కాఫీ కంటే విశాఖ మన్యంలోని కాఫీ గింజలే నాణ్యమైనవిగా అక్కడి అధికారులు గుర్తించారు. ఉత్తమ కాఫీగా పెదబయలు కాఫీ గింజలకు పురస్కారం లభించింది. కాఫీ సాగు చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది మన్యంలోని అరబిక కాఫీకి జాతీయ స్థాయి పురస్కారంతోపాటు రీజనల్ స్థాయి ప్రథమ, ద్వితీయ అవార్డులను దక్కాయని ఏపీఎఫ్డీసీ జీఎం గురుమూర్తి గురువారం తెలిపారు. అనంతగిరి కాఫీకి ద్వితీయ స్థానం దక్కింది. ఈ అవార్డులను వచ్చే జనవరిలో కేంద్ర కాఫీ బోర్డు ద్వారా ఏపీఎఫ్‌డీసీకి అందజేస్తారు. దేశంలో కాఫీ సాగు చేస్తున్న ప్రాంతాలను 12 జోన్లుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో సాగవుతున్న ప్రాంతాన్ని అరకు జోన్‌గా గుర్తించారు. ఏటా కాఫీ శాంపిళ్లను ఇక్కడి కాఫీ బోర్డు అధికారులు కేంద్ర కాఫీ బోర్టుకు పంపుతారు. రంగు, రుచి, నాణ్యతను బట్టి రీజనల్, జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికైన కాఫీని అంతర్జాతీయ అవార్డుల పరిశీలనకు వారు పంపుతారు. ఏపీఎఫ్‌డీసీలో పండిస్తున్న కాఫీని మరింత నాణ్యమైనదిగా తయారీకి కొన్నేళ్లుగా ఆ శాఖ అధికారులు శ్రమిస్తున్నారు. అధునాతన పల్పింగ్ యంత్రాలు, నూతన యార్డులు సమకూరుస్తున్నారు. వారి కృషి ఫలితంగా మన్యం కాఫీకి తొలిసారిగా జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఏపీఎఫ్డీసీ పరిధిలోని కాఫీకి నాణ్యతా ప్రమాణాల్లో జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషకరంగా ఉందని సంస్థ జీఎం గురుమూర్తి గురువారం విలేకరులకు తెలిపారు.