పుట్లూరులో దారుణం
- పాఠశాల తరగతి గదిలో కిరాతక చర్య
- యువకుడిని హతమార్చి, ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం
- హతుడు చోరీ, హత్య కేసులో నిందితుడు?
- బళ్లారిలో కాంట్రాక్టర్ హత్య కేసు విచారణ కోసం వస్తే.. వెలుగు చూసిన హత్య కేసు
పుట్లూరు (శింగనమల) : అనంతపురం జిల్లా పుట్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదిలో దారుణం వెలుగు చూసింది. పుట్లూరుకు చెందిన పెరవలి శేఖర్(27)ను బండరాయితో కొట్టి, హతమార్చారని పోలీసులు తెలిపారు. ఆపై గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చివేశారన్నారు. మూడ్రోజుల తరువాత ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది. హతుడు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... శేఖర్ చెడు వ్యసనాలకు బానిసై, ఒంటరిగా జీవిస్తున్నాడు.
2015లో తక్కళ్లపల్లిలోని ఆలయంలో హుండీని చోరీ చేసిన కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. గత నెల 29న కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ కాంట్రాక్టర్ హత్య కేసు విచారణలో భాగంగా అక్కడి పోలీసులు ఈ నెల 2న పుట్లూరుకు వచ్చారు. శేఖర్ గుర్తింపు కార్డుతో సిమ్‌కార్డు పొందిన అతని స్నేహితుడు జయరామ్‌కు బళ్లారిలో జరిగిన కాంట్రాక్టర్ హత్య కేసులో ప్రమేయం ఉంది. హత్యకు గురైన కాంట్రాక్టర్ కాల్‌డేటా ఆధారంగా అక్కడి పోలీసులు పుట్లూరుకు రాగా, ఈ విషయం తెలిసి జయరాంతో శేఖర్ ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. దీంతో విషయం బయటకు పొక్కుతుందనే కుట్రతో శేఖర్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
దుర్వాసన రావడంతో...
ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు వదిలారు. ఈ క్రమంలో తరగతి గది నుంచి భరించరాని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికెళ్లి పరిశీలిస్తే.. హత్య కేసు వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ సురేశ్‌బాబు తమ సిబ్బందితో నేర స్థలాన్ని పరిశీలించారు. శేఖర్‌ను హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జయరాం సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.