Honey bee
-
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు మానుకా తేనె.. ఎలా పని చేస్తుందంటే!
తేనె అనేది ప్రకృతిలో ఓ అద్భుతం. తేనెటీగలు తేనెను సేకరించి… దాచుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి… ప్యాక్ చేసి మనకు ఇవ్వడం… ఆ శుద్ధమైన తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నాం. మన చర్మ కణాల్ని తేనె కాపాడుతోంది. జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తోంది.తేనెలో చాలా రకాలు ఉంటాయి.. వీటిలో మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. దీనిని ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లలో తేనెటీగలు తయారు చేస్తాయి. మనుక చెట్టు మకరందంతో తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెట్టు సంవత్సరంలో 2 నుంచి 6 వారాలు మాత్రమే పువ్వులు పూస్తుంది. ఇది చాలా అరుదైన తేనెగా చెబుతున్నారు. మామూలు తేనే కన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. మామూలు తేనేలాగే మానుకా తేనేను కూడా రోజూ వాడొచ్చు. మానుకా తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, హీలింగ్ గుణాలు ఉన్నాయని అధికంగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మానుకా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు చర్మ మీద అయిన గాయాలను తగ్గించడంతో సాయపడతాయి. తాజాగా మానుకా తేనే ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించకుండా రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 84% తగ్గించినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ పరిశోధనలు సహజమైన, నాన్-టాక్సిక్ సప్లిమెంటరీ యాంటీకాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడనున్నాయి.ఇందులోని పోషకాహారం', 'ఫార్మాస్యూటికల్స్' కలయిక పోషక విలువలను అందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. తాజాగా యూసీఎల్ఏ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనాల ద్వారా ఈ న్యూట్రాస్యూటికల్ రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో సహాయపడతాయని కనుగొన్నారు.ఈ పరిశోధనలు సాంప్రదాయ కీమోథెరపీకి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడతాయని పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సలో సహజ సమ్మేళనాల ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ఈ అధ్యయనం మరింత అన్వేషణకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని చెప్పారు.ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 60% నుంచి 70% వరకు- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారే ఉన్నారు. క్యాన్సర్ కణాలలో గ్రాహకాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను వృద్ధి చేయడానికి ఉపయోగించుకునేలా చేస్తాయి. యాంటీ-ఈస్ట్రోజెన్ లేదా ఎండోక్రైన్తో చికిత్స చాలా మంది రోగులలో కణితి పెరుగుదలను నిరోధించవచ్చు.పరిశోధకులు మొదట తమ ప్రయోగంలో ఈఆర్ పాజిటివ్, ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలను పెంచారు, ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. మనుకా తేనె లేదాడీహైడ్రేటెడ్ మనుకా తేనె పొడితో చికిత్స చేసిన ఈఆర్ పాజిటివ్ కణాలలో.. నియంత్రణలతో చికిత్స చేయబడిన వాటితో పోలిస్తే క్యాన్సర్ కణాల విస్తరణ గణనీయమైన మోతాదు-ఆధారిత నిరోధాన్ని వారు గమనించారు. ట్రిపుల్-నెగటివ్ కణాల కోసం మనుక తేనెను టామోక్సిఫెన్తో కలిపినప్పుడు యాంటిట్యూమర్ ప్రభావం మరింత తక్కువగా ఉంటుంది.కణాలను మరింత నిశితంగా పరిశీలిస్తే, తేనె రక్తంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలు, కణితుల్లో ఈస్ట్రోజెన్ గ్రాహకాలలో తగ్గుదలకు కారణమైందని తేలింది. కణితి కణాలలో అపోప్టోసిస్ లేదా సెల్ డెత్‌ను ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ పురోగతిని మరింత దెబ్బతీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.మనుకా తేనెను జంతు నమూనాలలో పరిశోధకులు పరీక్షించారు. మానవ ఈఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో అమర్చబడి కణితిని అభివృద్ధి చేసిన ఎలుకలకు మనుకా తేనెను నోటి ద్వారా అందించారు. తేనెతో చికిత్స చేయబడిన ఎలుకలు నియంత్రణలతో పోలిస్తే కణితి పెరుగుదలను గణనీయంగా అణిచివేసాయి. మొత్తంమీద ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా మానవ రొమ్ము క్యాన్సర్ కణితి పెరుగుదల, పురోగతిని 84% నిరోధించింది. -
ఆరోగ్య రక్షణలో తేనె అత్యంత ప్రయోజనకారి..!
-
తేనెటీగలు సంచార జాతికి చెందినవి
-
తేనెటీగల పెంపకం రైతులకు అత్యంత లాభసాటి
-
తేనెటీగల పెంపకంతో తెలివైన ఆదాయం
-
తేనెటీగల పెంపకం ఇలా చేయండి.. లాభాలు గడించండి
-
తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. 5 రకాల రుచుల్లో తేనె
బీటెక్, డిగ్రీ లేదంటే ఎంబీఏ, కుదిరితే ఎంటెక్ పూర్తిచేసి ఏదో ఓ కంపెనీలో ప్లేస్మెంట్ సంపాదించాలి. లేదంటే పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రభుత్వ కొలువు కొట్టాలి. ఇదీ ప్రస్తుతం యువత ఆలోచన ధోరణి. వ్యవసాయం, కొత్త వ్యాపారం చేయాలని వందలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా వినూత్నంగా ఆలోచించిన వారిలో వరంగల్ మట్టెవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్ ఒకరు. రిస్క్‌తో కూడిన తేనె ఉత్పత్తి పంటను ఎంచుకుని రాణిస్తున్నాడు. హర్షవర్ధన్ పై సాక్షి ప్రత్యేక కథనం. తల్లిపై ప్రేమతో.. హర్షవర్ధన్ స్కేటింగ్ కోచ్. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తున్నాడు. అతడి తల్లి ప్రతిభ పింగళి కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్. అందరి యువకుల మాదిరిగానే ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. కానీ తల్లిపై ప్రేమ కొత్త ఆలోచనకు తెరలేపింది. కరోనా వేవ్‌లో హర్షవర్ధన్ తల్లి ప్రతిభకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రతి రోజూ ఉదయం నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. మార్కెట్లో తెచ్చిన తేనె స్వచ్ఛతపై హర్షవర్ధన్‌కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో స్వచ్ఛమైన తేనె గురించి యూట్యూబ్‌లో అన్వేషించాడు. ఎక్కడ లభిస్తుంది.. ఎలా ఉత్పత్తి చేస్తారని వెతికాడు. చివరికి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ సంస్థలో తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై ఐదు రోజుల శిక్షణ తీసుకున్నాడు. చేనులో ఏర్పాటు చేసిన తేనెటీగల బాక్సులు మొదట రెండు బాక్సులతో.. శిక్షణ అనంతరం హైదరాబాద్‌లోనే తేనెటీగలు పెంచే బాక్సులను ఒక్కో బాక్స్ రూ.12వేలతో రెండింటిని కొనుగోలు చేశాడు. ఎఫీస్ మెలిఫెరా అనే ఇటాలియన్ తేనెటీగలు ఒక్కో బాక్సులో 50 వేల నుంచి లక్ష వరకు నివాసం ఉంటాయి. ఆ బాక్సులను మట్టెవాడలో తాను శిక్షణ ఇచ్చే స్కేటింగ్ రింక్ వద్ద చెట్లపై ఉంచాడు. సుమారు 45 రోజుల్లో పంట చేతికొచ్చింది. రెండు బాక్సుల నుంచి తేనె వేరు చేయడం సాధ్యం కాదని మరో 10 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వరంగల్ శివారు స్తంభంపెల్లిలో స్థానిక రైతు సాయంతో పొలంలో ఉంచాడు. దీంతో మొదటిసారి 11 కేజీల స్వచ్ఛమైన తేనే వచ్చింది. సెకండ్ లాక్డౌన్ సమయంలో తేనెను బంధువులు, స్నేహితులకు అందజేశాడు. ఆ తర్వాత ధైర్యం చేసి 100 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వర్ధన్నపేట శివారులో పంట చేన్ల వద్ద ఉంచి తేనెటీగల పెంపకాన్ని కొనసాగించాడు. మంచి లాభం వచ్చింది. దీంతో 200 బాక్సులు తెప్పించి కోరుట్ల, అమ్మవారిపేటలోని పొద్దుతిరుగుడు, ఆవాల పంటల వద్ద ఉంచాడు. అవి జన్యుమార్పిడి పంటలు కావడంతో 50 బాక్సుల్లోని తేనేటీగలు మృత్యువాత పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాడు. తేనెటీగల బాక్సుల వద్ద హర్షవర్ధన్ 450 బాక్సుల్లో.. ఐదు రకాల తేనె.. నష్టపోయిన అనంతరం నిపుణుల వద్ద హర్షవర్ధన్ మరింత శిక్షణ తీసుకున్నాడు. ఏడాదిన్నర కాలంలో తేనె ఉత్పత్తిపై మంచి అనుభవం సంపాధించాడు. పూర్తి పరిజ్ఞానంతో తేనెలో సైతం వివిధ రకాల రుచులు ఉంటాయని తెలుసుకుని సిద్దిపేట, నల్గొండ శివారు గ్రామాల్లో పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, అల్లనేరేడు, ఓమ, తులసి పంటల రైతులతో మాట్లాడి పొలాల్లో 162 బాక్సులను ఉంచాడు. ఈసారి ఆ బాక్సుల నుంచి 200 కేజీల తేనె దిగుమతిగా వచ్చింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో 450 బాక్సుల ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నాడు. హర్షవర్ధన్ వద్ద ప్రస్తుతం ఆవాలు, నువ్వులు, ఓమ, అల్లనేరేడు, తులసి రుచులలో తేనె వేర్వేరుగా లభిస్తోంది. ప్రత్యేక స్టోర్.. కార్పొరేట్ కంపెనీల మాదిరిగా పబ్లిసిటి చేసుకోలేని హర్షవర్ధన్ ప్రస్తుతం హనుమకొండలోని డీఐజీ బంగ్లా ఎదురుగా షెటర్ అద్దెకు తీసుకుని ‘హర్ష నేచురల్ హనీ’ పేరుతో స్టోర్ ఏర్పాటు చేశాడు. మొదట్లో మార్కెటింగ్ కోసం ఇబ్బందిపడినా ప్రస్తుతం ఆన్లైన్, పరిచయాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాడు. రుణం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి తేనెటీగల పెంపకం ఖర్చు, రిస్క్‌తో కూడుకున్నది. వ్యయప్రయసలకు ఓర్చి తేనె ఉత్పత్తి చేస్తున్న తనలాంటి వారికి ప్రభుత్వం రాయితీపై రుణంతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. – మాడిశెట్టి హర్షవర్ధన్ -
కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్‌లో కర్ణాటకలో నిర్వహించిన అమృత భారతికి కన్నడ హారతి కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే తేనె ఉత్పత్తిలో కరావళి, మలెనాడు, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో రైతులు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి తాలూకాలోని తేనె రైతు మధుకేశ్వర హెగ్డేను ఆయన ప్రస్తావించారు. హెగ్డే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది 50 పెట్టెల తేనెటీగల పెంపకం ప్రారంభించారు. నేడు 800కు పైగా పెట్టెల్లో తేనెపట్లను పెంచుతున్నారు. మధు అంటే తేనె, ఆ పనిలో సాధన చేసి పేరును సార్థకం చేసుకొన్నారని మోదీ ప్రశంసించారు. -
తేనెలూరుతున్న ఉపాధి
రాజానగరం: ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి పరిసరాల్లో ఇటువంటి ఔత్సాహికులు కనిపిస్తున్నారు. పండ్ల తోటల్లో వీటిని ఏర్పాటు చేయడం వలన పరపరాగ సంపర్కం జరిగి, దిగుబడులు పెరగడానికి దోహపడుతున్నాయని రైతులు కూడా సహకరిస్తున్నారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (ఎన్బీహెచ్ఎం) పథకం ద్వారా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజు బీఎస్సీ (కంప్యూటర్స్) చదివాడు. స్వతహాగా ఫొటోగ్రాఫర్. అప్పుడప్పుడూ రంపచోడవరం, అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అరకొరగా జరిగే తేనెటీగల పెంపకంపై కాస్తోకూస్తో తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానళ్లలో చూసి స్వయం ఉపాధికి అదే సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. గుంటూరులో కొన్ని రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడు. వివిధ రకాల పండ్ల తోటలకు నిలయంగా పేరొందిన రాజానగరం మండలం తేనెటీగల పెంపకానికి అనుకూలమని భావించాడు. శ్రీకృష్ణపట్నంలో ఏడాది క్రితం ఐదు పెట్టెలతో తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. ఎంఏ చదివిన స్నేహితుడు నల్లమిల్లి వెంకటేష్(వాసు)ను కూడా కలుపుకొన్నాడు. ఏడాది తిరక్కుండానే వంద పెట్టెల్లో తేనెటీగలను పెంచుతూ తేనె తీసే ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ‘విశిష్ట’ బ్రాండ్ పేరుతో వ్యాపారం శ్రీకృష్ణపట్నంలో మామిడి, జీడిమామిడి, నిమ్మ, నారింజ, పనస, సపోటా, జామ, నేరేడు, సీతాఫలం, తదితర పండ్ల చెట్లు విస్తారంగా ఉంటాయి. తేనె ఉత్పత్తికి అవసరమైన పుప్పొడికి ఇక్కడ కొదవుండదు. తేనెటీగలు ఆయా పూవులపై వాలి, పుప్పొడి నుంచి తేనె సంగ్రహించి, తోటల్లో అమర్చిన పెట్టెల్లో నిక్షిప్తం చేస్తుంటాయి. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా జరిగేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడి నుంచే తేనె సేకరించి విక్రయించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల సహకారంతో తేనెను ప్రత్యేక యంత్రం (హనీ ఎక్స్ట్రాక్టర్) ద్వారా శుద్ధి చేసి, సీసాల్లో ప్యాక్ చేస్తున్నారు. దానికి ‘విశిష్ట’ పేరు పెట్టి ఉన్నచోటనే అమ్మకాలు సాగిస్తున్నారు. 40 రోజులు పడుతుంది పెట్టెల ద్వారా తేనె సేకరణకు 40 రోజులు పడుతుంది. స్వచ్ఛత, చిక్కదనం కలిగి ఉండటంతో దీని కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకృష్ణపట్నంతో పాటు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో కూడా మరో తేనెటీగల పెంపకం యూనిట్‌ను వీరు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావంతో జనం రోగ నిరోధక శక్తి పెంపుపై దృష్టి పెట్టారు. దీంతో తేనె వాడకంకూడా పెరిగింది. ఇద్దరే కాదు.. ఇంకా ఉన్నారు తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అనపర్తికి చెందిన శ్రీరామరాజు ఎంబీఏ చదివి, నాలుగేళ్ల క్రితమే తేనెటీగల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పీరా రామచంద్రపురం ప్రధాన కేంద్రంగా చేసుకుని గుంటూరు, రాజవొమ్మంగిల్లో కూడా ఈ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ‘గోల్డెన్ బీస్’ పేరుతో సొంతంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఐటీడీఏ, ఉద్యాన శాఖ, డీఆర్డీఏలద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు చేస్తూ, ఔత్సాహికులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. రాజానగరం మండలం రఘుదేవపురంలో నక్కిన కృష్ణ అనే రైతు సుమారు 20 సంవత్సరాల నుంచి తేనెటీగల పెంపకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదివిన ఆయన కుమారుడు శ్రీను ఈ యూనిట్‌ను కొనసాగిస్తున్నారు. దివాన్‌చెరువులో మార్ని గంగరాజు, కానవరంలో నాగేశ్వరరావు, చక్రద్వారబంధంలో కన్నబాబు కూడా దీనిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. రాయితీతో ప్రోత్సహిస్తున్నాం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్బీహెచ్ఎం)లో తేనెటీగల పెంపకం యూనిట్లపై ప్రభుత్వం 50 నుంచి 75 శాతం రాయితీ అందజేస్తుంది. ఒక యూనిట్(8 పెట్టెలు)కు ఒక తేనెటీగల పెట్టె, అవసరమైన తేనెటీగలు, రక్షణ దుస్తులు కూడా సమకూర్చి, రంపచోడవరంలో అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అనంతరం యూనిట్లు పెట్టి, మంచి ప్రగతి చూపించిన వారి వివరాలను ‘మధుక్రాంతి’ యాప్‌లో అప్లోడ్ చేసి, మరింత ప్రోత్సాహం అందించేలా కృషి చేస్తున్నాం. – టి.రిని, ఉద్యాన శాఖాధికారి, రాజానగరం -
వెరైటీ దొంగలు.. డబ్బు, బంగారం వద్దు.. అవే కావాలి..పట్టుకుంటే 10 వేల డాలర్లు!
సాధారణంగా దొంగలంటే డబ్బో లేక బంగారమో దోచుకుంటుంటారు. దాదాపుగా ఎక్కడైనా జేబులు కొట్టే వాళ్లు మొదలు.. ఇళ్లను కొల్లగొట్టే వాళ్ల వరకు రకరకాల చోరశిఖామణులు ఉంటారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మాత్రం వెరైటీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రికిరాత్రే ‘సొత్తు’ను కొల్లగొడుతూ స్థానికులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకీ వాళ్లు చేసే ‘కటింగ్’ ఏమిటో తెలుసా? తేనెటీగల చోరీ..!! వెంటాడి మరీ కుట్టికుట్టి పెట్టే తేనెటీగలను దొంగలు అమాంతం ఎత్తుకుపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..! అందుకే మరి దీన్ని వెరైటీ చోరీ అంటున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే.. కాలిఫోర్నియా రకం బాదంపప్పు గురించి మీకు తెలుసుగా.. వాణిజ్య స్థాయిలో యావత్ అమెరికాకు అవసరమయ్యే 100 శాతం బాదంపప్పును ఈ రాష్ట్రమే సరఫరా చేస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే బాదంలో 80 శాతం కాలిఫోర్నియా రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇంత భారీ స్థాయిలో బాదం సాగు జరగాలంటే అందుకు పరపరాగ సంపర్కం అవసరం. ఈ విషయంలో తేనెటీగలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే బాదం తోటల్లో తేనెటీగలు వేర్వేరు చెట్లపై వాలుతూ పుప్పొడిని తరలించే వాహకాలుగా మారి వాటి ఫలదీకరణకు దోహదపడుతుంటాయి. ఇందుకోసం ఏటా కాలిఫోర్నియాలోని బాదం రైతులు తేనెటీగల పెంపకందారుల నుంచి వాటిని అద్దెకు తెచ్చుకుంటుంటారు. తేనెటీగలతో కూడిన ఒక్కో కృత్రిమ తేనెతుట్టె అద్దె 210 డాలర్లు (సుమారు రూ. 15,800)గా ఉంటుంది. దీన్ని పసిగట్టిన చోరులు... ఈ సీజన్లో పెంపకందారులు కృత్రిమ తేనెతుట్టెల్లో సిద్ధంగా ఉంచే వేలాది డాలర్ల విలువైన తేనెటీగలను ఎత్తుకుపోతున్నారట! వాటిని అధిక ధరలకు బాదం రైతులకు అమ్ముకుంటూ లక్షాధికారులైపోతున్నారట!! పట్టుకుంటే 10 వేల డాలర్లు.. గత నెలలో ఇలాగే కొందరు దొంగలు ఓ ఫారంలోని లక్షలాది తేనెటీగలను రాత్రికిరాత్రే మాయం చేయడంతో అప్రమత్తమైన కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం దొంగలను పట్టిచ్చే వారికి ఏకంగా 10 వేల డాలర్ల (సుమారు రూ. 7,50,000) నజరానా ప్రకటించింది!! అయినా వాటిలో కొన్ని తుట్టెలే చివరకు దొరికాయట. కొందరు పెంపకందారులైతే ఒక అడుగు ముందుకేసి తమ కృత్రిమ తేనెతుట్టెలు చోరీకి గురైతే సులువుగా గుర్తించేందుకు వాటికి ముందుగానే జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను అమరుస్తున్నారట! కారణం ఏమిటి? అమెరికన్లు తినే మూడో వంతు ‘ఆహారం’తయారీ తేనెటీగలు, సీతాకోకచిలుకలు, గబ్బిలాల వంటి వాటిపైనే ఆధారపడి ఉందని అమెరికా వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే గత 50 ఏళ్లుగా అమెరికాలో తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతోందని పేర్కొంటోంది. ఒక్క 2006లోనే దేశంలోని ఏకంగా 30 శాతం తేనెటీగలు నశించాయని తెలిపింది. పంట రసాయనాల వాడకం అధికం కావడం, వ్యాధులు, పౌష్టికాహారలేమి ఇందుకు ప్రధాన కారణమని వివరిస్తోంది. మరోవైపు తేనెటీగల పెంపకం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేపట్టాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకసారి చోరీకి తేనెటీగలు చోరీకి గురైతే మళ్లీ నాణ్యమైన, కొత్త వాటిని పెంచేందుకు ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. అందుకే చోరుల కన్ను వీటిపై పడిందని అంటున్నారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
తేనె పూసిన 'కల్తీ'
సాక్షి, అమరావతి: మార్కెట్లో విక్రయిస్తున్న ప్రముఖ బ్రాండ్ల తేనెలో 77 శాతం కల్తీవేనని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చింది. చాలా కంపెనీలు తేనెలో చక్కెర పాకం కలిపి విక్రయిస్తున్నట్టు స్పష్టం చేసింది. 13 రకాల ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె నమూనాలను సేకరించిన సీఎస్ఈ జర్మనీలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించగా.. దిగ్భ్రాంతి కలిగించే ఈ మోసం బయటపడింది. అడవుల నుంచి పట్టు, పుట్ట తేనెను సేకరించామంటూ రోడ్లపక్కన తేనె పేరిట బెల్లం పాకాన్ని పిండి ఇస్తున్న దానికీ.. ప్రముఖ బ్రాండ్ల పేరిట అమ్మే తేనెకు ఏ మాత్రం తేడా కనిపించడం లేదని ప్రకటించింది. ఎన్ఎంఆర్ పరీక్షల్లో ఏం తేలిందంటే.. తేనెలో ఏయే రకాల చక్కెర పాకాలను కలుపుతున్నారనేది గుర్తించడానికి న్యూక్లియర్ మాగ్నటిక్ రెసోనాన్స్ (ఎన్ఎంఆర్) పరీక్ష నిర్వహిస్తారు. దేశంలో ఇటువంటి పరీక్షా కేంద్రాలు లేకపోవడం సీఎస్ఈ సేకరించిన నమూనాలను జర్మనీకి పంపింది. తేనెలో సీ–3 సుగర్‌ను ఎక్కువ కలుపుతున్నట్టు ఆ పరీక్షల్లో తేలింది. దీనిని చైనా నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారని సీఎస్ఈ ప్రకటించింది. ఆ సంస్థ నివేదిక ప్రకారం చైనా కంపెనీలు ఫ్రక్టోజ్ సిరప్ పేరిట చక్కెర పాకాన్ని భారత్‌కు పంపిస్తున్నాయి. ఏటా చైనా నుంచి సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల ఫ్రక్టోజ్ దిగుమతి అవుతోంది. దీనిని స్వల్ప మోతాదులో ఉండే తేనెతో కలిపి విక్రయిస్తున్నట్టు సీఎస్ఈ తేల్చింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో విక్రయిస్తున్న ప్రముఖ బ్రాండ్ల తేనెలన్నీ కల్తీవేనంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనికి మరికొన్ని సంస్థలు కూడా గొంతు కలిపాయి. కల్తీని గుర్తించడం ఎలా? తేనె సీసాల లేబుల్‌పై ముద్రించి ఉండే కాంపొనెంట్స్ ఏమిటనేది గుర్తించాలి. అందులో వాడిన ముడి పదార్థాలేమిటో పరిశీలించాలి. మూత తీసేప్పుడు చిన్నపాటి శబ్దం (సోడా బాటిల్ మూత తీసేప్పుడు వచ్చే శబ్దం మాదిరి) వస్తే అదిమంచిది కానట్టే. బాటిల్ లోపల పులియటం (ఫెర్మంటేషన్) జరిగితే ఈ శబ్దం వస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లలో తేనెను వేసినప్పుడు నురగ వస్తే అది మంచిది కాదు. తేనెను మరగబెట్టినా ఆవిరి కాదు. బొటన వేలిపై ఒక బొట్టు తేనె వేసుకున్నప్పుడు కొన్ని సెకన్ల పాటు అయినా కదలకుండా ఉండాలి. తేనెటీగల పెంపకందారుల జీవనోపాధికి గండి కల్తీ తేనె వల్ల తేనెటీగల పెంపకందారుల జీవనోపాధి దెబ్బతింటోంది. రాష్ట్రంలో గిరిజన కార్పొరేషన్ విక్రయించే తేనెకు మంచి పేరుంది. అయినా అమ్మకాలు మాత్రం తక్కువే. తేనెటీగల పెంపకందారులు కల్తీతో పోటీ పడలేకపోతున్నారు. కల్తీ తేనె ధర తక్కువ. తేనెటీగలు పెంచి ఉత్పత్తి చేసే తేనె ధర ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, చైర్మన్, రైతు నేస్తం ఫౌండేషన్ కల్తీని కట్టడి చేసే చట్టం రావాలి కరోనా నేపథ్యంలో తేనె వినియోగం పెరిగింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దానిలో భాగమే కల్తీ. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తోంది. వాస్తవానికి అది గత ఏడాది జూలైలో అమల్లోకి రావాల్సి ఉంది. త్వరలో ఆ చట్టం అమల్లోకి వస్తే కల్తీని కట్టడి చేయవచ్చు. చెరకు, వరి, మొక్కజొన్న, బీట్రూట్, గోధుమల నుంచి కూడా సుగర్ సిరప్ తయారు చేసి తేనెలో కలుపుతున్నట్టు తెలుస్తోంది. – జె.కుమారస్వామి, భారతీయ కిసాన్ సంఘ్ నేత -
తేనె పట్టుంచుకోండి!
అనుక్షణం శ్రమించే అన్నదాతకు దీటుగా అవిశ్రాంతంగా రెక్కలను ముక్కలు చేసుకునే జీవి ఏదైనా ఈ భూతలమ్మీద ఉన్నదీ అంటే అది తేనెటీగ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. తెల్లారింది మొదలు ప్రతి పువ్వునూ ముద్దాడే తేనెటీగ మకరందాన్ని, పుప్పొడినీ విసుగూ విరామం లేకుండా పోగేసి.. రైతు మాదిరిగా అమూల్యమైన అమృతాహారాన్ని (తేనెను) నిండుమనసుతో మన దోసిట్లో పోస్తుంది. అంతేకాదు.. పనిలో పనిగా పంట మొక్కల్లో, ఔషధ మొక్కల్లో పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తుంది. జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని జీవవంతం చేస్తుంటుంది. అయితే, పొలం అంతా ఏదో ఒకే రకం పంటల(మోనోకల్చర్)ను మాత్రమే సాగు చేస్తూ, అతి ప్రమాదకర రసాయనిక పురుగుమందులు (నియోనికుటినాయిడ్స్) వాడుతూ తేనెటీగల మనుగడను దెబ్బతీస్తున్నాం. ప్రకృతి, వ్యవసాయం పదికాలాల పాటు పచ్చగా పరిఢవిల్లాలంటే.. తేనెటీగలను కంటి రెప్పల్లా కాపాడుకోవాలి. ఇందుకు మనందరం దీక్షగా పనిగట్టుకోవాలని అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం (మే 20) పిలుపు ఇస్తోంది.. అందిపుచ్చుకుందాం రండి.. తేనెటీగల పెంపకం ఎలా? ఆధునిక పద్ధతుల్లో పెట్టెలను అమర్చి, వాటిలో తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పంటల్లో దిగుబడి పెంచేందుకు తేనెటీగలు ఉపయోగపడతాయి. నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేసి మంచి ఆదాయం పొందవచ్చు. తేనెతోపాటు మైనం, రాయల్ జెల్లీ (రాజాహారం), పుప్పొడి తదితర ఉప ఉత్పత్తులను పొందవచ్చు. తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణులు, ముఖ్యంగా మహిళలు, గ్రామాల్లోనే ఉపాధి పొందవచ్చు. శిక్షణ ఎవరిస్తారు? కేంద్ర లఘు పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో రాష్ట్ర స్థాయి తేనెటీగల పెంపకం విస్తరణ కేంద్రం ఉంది. రెండు పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంటారు. ఈ కేంద్రం ఆవరణలో 5 రోజుల పాటు తేనెటీగల పెంపకంలో రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. రుసుము రూ. 1,500. 18 ఏళ్లు వయసు నిండిన వారెవరైనా అర్హులే. ప్రతి నెలా ఒక బ్యాచ్‌కు ఈ విధంగా శిక్షణ ఇస్తుంటారు. దీనితోపాటు.. హనీ మిషన్ ప్రోగ్రామ్ కింద కెవిఐసి సిబ్బంది ఎంపిక చేసిన గ్రామాలకు తరలివెళ్లి అక్కడి వారికి తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 200 మందికి తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో 128 మందికి పదేసి చొప్పున తేనెటీగల పెట్టెలను సైతం అందించామని టీ వీ రావు (94410 51039) ‘సాక్షి’తో చెప్పారు. విజయరాయ్లోని కెవిఐసి తేనెటీగల పెంపకం శిక్షణ కేంద్రంలో ఆయన జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. 4 జాతులకు చెందిన ఐరోపా తేనెటీగలను మన దేశంలో పెంచుతున్నారు. వీటిని ఆధునిక పద్ధతుల్లో పెంచడంలో మెలకువలను నేర్పడంతోపాటు నాణ్యమైన తేనె సేకరణ, ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తున్నామని రావు వివరించారు. ఒక్కో పెట్టెలో 50 వేల నుంచి పది లక్షల వరకు తేనెటీగలు ఉంటాయి. ఒక్కో పెట్టె ద్వారా 20–30 రోజుల్లో 5–10 కిలోల తేనె దిగుబడి వస్తుంది. ముచ్చటగా మూడో ఏడాది! అంటన్ జన్స... ఆధునిక తేనెటీగల పెంపకం పితామహుడు. ఆయన పుట్టిన రోజు అయిన మే 20వ తేదీన వరల్డ్ బీస్ డే జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 2018 నుంచి అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. ఇది మూడో ఏడాది. స్లొవేనియా దేశస్థుడైన అంటన్ జన్సకు తేనెటీగలే పంచప్రాణాలు. క్రీ. శ. 1734 మే 20న జన్మించిన ఆయనే తొలి తేనెటీగల పెంపకందారుడు. చిత్రలేఖనంలో నిష్ణాతుడైనప్పటికీ తేనెటీగల పెంపక శాస్త్ర అధ్యాపకుడిగా సేవలందించాడు. 1771లో తేనెటీగలపై తొలి గ్రంథాన్ని రచించాడు. తేనెటీగల్లో 20 వేల జాతులున్నాయి. అయితే, ఐరోపాకు చెందిన 4 జాతుల తేనెటీగలను భారత్ సహా అనేక దేశాల్లో విరివిగా పెంచుతున్నారు. పంటల దిగుబడి పెంచుకోవడం ఎలా? పండ్ల తోటలు / వార్షిక పంటలు పూతకు వచ్చే దశలో తెనెటీగల పెట్టెలను పొలాలకు దగ్గరలో సుమారు 30 రోజులపాటు ఉంచితే.. ఆయా పంటల్లో పరపరాగ సంపర్కం బాగా జరిగి, దిగుబడి పెరుగుతుంది. తేనెటీగల పెంపకం దారులకు పెట్టెకు కొంత మొత్తం అద్దెగా చెల్లించి రైతులు తమ పొలాల వద్ద తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేయించుకుంటూ ఉంటారు. ఎకరానికి 3 నుంచి 5 పెట్టెలు అవసరం ఉంటుంది. పూత సీజన్ (సాధారణంగా 40 రోజులు) గడిచిన తర్వాత తేనెటీగలు సహా తమ పెట్టెలను తేనెటీగల పెంపకందారులు మరో ప్రాంతానికి తరలిస్తూ ఉంటారు. ఇటువంటి తేనె రైతులు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఉన్నారు. పూత లేని కాలాల్లో తేనెటీగలు ఆకలితో చనిపోకుండా పంచదార ద్రావణాన్ని ఆహారంగా ఇస్తూ కాపాడుకుంటూ ఉంటారు. సాధారణ తేనెటీగలు 50 రోజులు బతుకుతాయి. రాణి ఈగ 1–3 సంవత్సరాలు బతుకుతుంది. తేనెలూరే సంగతులు ► మనం ఆహారంగా తిసుకునే తిండి/నూనె గింజలు, పండ్లను అందించే ప్రతి నాలుగు రకాల పంటలు/తోటల్లో మూడు రకాలు పరాపరాగ సంపర్కం కోసం (ఎంతో కొంతవరకైనా) తేనెటీగలు, ఈగలు, సీతాకోకచిలుకలు తదితర ఎగిరే చిరు జీవులపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో తేనెటీగల పాత్ర 90% ఉంటుంది. ► ప్రపంచవ్యాప్తంగా 87 రకాల ఆహార పంటలు/తోటలు తెనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం చెంది చక్కని పంట దిగుబడులను అందిస్తున్నాయి. సాగు భూమి విస్తీర్ణపరంగా చూస్తే ఇది 35 శాతం. ► పంటలపై ఈ ఎగిరే చిరు జీవుల ప్రభావం ఎంత అనేది ఆయా ప్రాంతాల్లో వాటి సంఖ్యను బట్టి, వైవిధ్యాన్ని బట్టి ఉంటుంది. ► ఇవి మనకు అందించే ఆహారోత్పత్తులు ఆరోగ్యదాయకమైనవి, పౌష్టిక విలువలు కలిగినవీను. ► అమూల్య సేవలందించే ఈ చిరు జీవుల మనుగడకు రసాయనిక సాంద్ర వ్యవసాయం, ఒకే రకం పంటలు సాగు చేయడం ముప్పుగా పరిణమించాయి. ► అనేక రకాల పంటలతో, వ్యవసాయక జీవవైవిధ్యంతో తులతూగే రసాయన రహిత పంట పొలాలు మనుషుల మనుగడకు, భూసారం పెంపునకు, పర్యావరణ పరిరక్షణతో పాటు తేనెటీగలకూ జీవనావసరమే. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తేనెటీగల పరిరక్షణకు దోహదపడతాయి. ► తేనెటీగలు 20,000 జాతులు. అడవుల్లో ఎక్కువ జాతులు ఉంటాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకల జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. (మూలం : ఆహార, వ్యవసాయ సంస్థ– ఎఫ్.ఏ.ఓ. ) ఏయే పంటలకు ఉపయోగం? తేనెటీగల ద్వారా కొన్ని రకాల పంటల్లో పరపరాగ సంపర్కం మెరుగ్గా జరుగుతుంది. దాదాపు 75 శాతం పంటల్లో ఎంతో కొంత స్థాయిలో పరపరాగ సంపర్కానికి తేనెటీగలు దోహదపడుతున్నాయి. ప్రకృతిసిద్ధంగా తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో తేనెటీగల పెంపకందారుల నుంచి తేనెటీగల పెట్టెలను తెప్పించి పొలాల దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం వస్తున్నది. కొబ్బరి, నిమ్మ, బత్తాయి, జామ, పుచ్చ, గుమ్మడి, దానిమ్మ, జీడిమామిడి వంటి ఉద్యాన తోటలు.. పొద్దుతిరుగుడు, నువ్వులు, గడ్డి నువ్వులు / వెర్రి నువ్వులు, ఆవాలు వంటి నూనె గింజల పంటలు.. ధనియాలు, వాము వంటి సుగంధ ద్రవ్య పంటలతోపాటు కందులు వంటి పప్పు జాతి పంటల్లో తేనెటీగల ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చని విజయరాయి లోని కెవిఐసి తేనెటీగల శిక్షణా కేంద్రం జూనియర్ ఎగ్జిక్యూటివ్ టీ వీ రావు (94410 51039) ‘సాక్షి’తో చెప్పారు. నిజామాబాద్ ప్రాంతంలో ఆవాలు సాగు చేసే రైతులు ప్రతి ఏటా తేనెటీగల పెట్టెలను అద్దెకు తీసుకొని తమ పొలాల్లో పెట్టించుకుంటూ దిగుబడి పెంపొందించుకుంటున్నారు. 40 రోజుల పూత కాలానికి గాను పెట్టెకు రూ. 1,500 వరకు అద్దె చెల్లిస్తున్నారని రావు వివరించారు. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తేనెటీగల చిరకాల మిత్రుడు!
తేనెటీగల జీవన విధానాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని అత్యంత నాణ్యమైన తేనె సేకరించడంలో మాదు నాగేశ్వరరావుది అందెవేసిన చేయి. పరిసర ప్రాంతాల్లో పెట్టెలను ఏర్పాటు చేసి 67 ఏళ్లుగా తేనె సేకరించడమే ఆయన వ్యాపకం. నాణ్యత విషయంలో రాజీ పడరు. ఆయన వద్ద నుంచి ఇతర దేశాల్లోని తెలుగు వారు సైతం తేనెను కొనుగోలు చేస్తుంటారు. నాగేశ్వరరావు అనుభవాలు ఆయన మాటల్లోనే... మా స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. అత్తవారిది ఈడుపుగల్లు. మాది వ్యవసాయ కుటుంబం. మా ప్రాంతానికి చెందిన శేషాచలం, అప్పారావు, కొల్లి రాజారావు వంటి వారి వద్ద నుంచి మెలకువలు నేర్చుకున్నాను. 1950లో గాంధీజీ తేనె పరిశ్రమను స్థాపించాను. ప్రత్యేకంగా తయారు చేసుకున్న తేనె పెట్టెలు చెట్లు, పండ్లతోటలు, ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. డెల్టా ప్రాంతంలో కన్నా అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన తేనె ఉత్తమం. నవంబర్, డిసెంబర్ నెలల్లో తేనెటీగల సంతతి పెరుగుతుంటుంది. జనవరి నాటికి పెట్టెలు ఇరుకు అవుతాయి. ఈగలను మరో పెట్టెలోకి తరలించటం ద్వారా అవి మరో ప్రాంతానికి వలస వెళ్లకుండా కాపాడుకోవాలి. తద్వారా తేనె ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ ఉండొచ్చు. గతంలో తేనె పెట్టెలను ఖాదీ గ్రామోద్యోగ మిషన్ సబ్సిడీపై ఇస్తుండేది. ప్రస్తుతం బయటి మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. పంటలపై రసాయనిక పురుగు మందుల వాడకం పెరుగుతున్నందున తేనెటీగల సంఖ్య తగ్గుతున్నది. పుప్పొడి సేకరించే తరుణంలో తేనెటీగలు పురుగుమందుల ప్రభావంతో చనిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో వేప, తాటి గులకల మీది నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. కలప కోసం ఆ చెట్లను నరికేస్తున్నారు. ఆ సీజన్లో తేనె అనుకున్నంతగా రావటం లేదు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కొందరు సినిమాతారలకు కూడా తేనె ఇచ్చాను. తొలి రోజుల్లో వీసె తేనె రూ. 12కి విక్రయించటం తెలుసు. ప్రస్తుతం కిలో రూ.260కి ఇస్తున్నాం. తేనె సేకరణలో చాలా మందికి శిక్షణ ఇచ్చాను. మొబైల్: 99592 65559. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
నల్లమల వీరుడు ఈ బాలుడు
సాక్షి, అప్పాపూర్ : ప్రకృతి ఓ అద్భుతం.. అందులోకి అడుగుపెట్టాలేగానీ మనసు గాల్లో తేలుతుంది. ఎంతపెద్దవాళ్లయినా పసిపిల్లల మాదిరిగా మారిపోతారు.. ఆ కాసేపు కష్టాలు కనుమరుగువుతాయి.. ప్రతి చెట్టూ ప్రతి పుట్టా ప్రతి పువ్వు, పక్షులు ఇలా ఒక్కటేమిటి ప్రతి అణువూ పలకరిస్తుంది. దాంతో ఒళ్లు పులకరిస్తుంది. నాగరికత పేరుతో నగరాల్లో బతికేవారికి భౌతిక సుఖాలుంటేయేమోగానీ ప్రకృతిలో పెరిగే వారికి మాత్రం మానసిక ఆనందం టన్నుల్లో ఉంటుంది. భౌతిక నగరంలో ఉన్నోళ్లు డబ్బుతో, అధికారంతో, పదవులతో ధైర్యాన్ని అరవు తెచ్చుకుంటారేమోగానీ ప్రకృతిలో పెరిగే వారికి మాత్రం ఇది వారితోపాటే సహజంగా పెరిగి పెద్దదవుతుంది. చిన్నచీమను చూస్తే అమ్మో అని గోల చేస్తారు నేటి నగర పిల్లలు.. కానీ, ప్రకృతిలో ఉండే పిల్లలు మాత్రం దేన్ని లెక్కచేయరు.. సాహసం అనేది వారికి రోజువారి క్రీడ. తేనేటీగల సంగతి తెలిసే ఉంటుందిగా.. అవి కుడితే కందిపోవాల్సిందే.. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. అలాంటి తేనే తుట్టెను రాలగొట్టడం ఈ ప్రకృతితో మమేకమై జీవించే పిల్లలకు పెద్ద కష్టమేమీ కాదు.. అదే విషయాన్ని రుజువు చేస్తూ ఓ పిల్లాడు తన పొడవు ఉన్న తేనెతుట్టెను సునాయాసంగా తెంపేసి చక్కగా ఫొటోకి ఫోజుచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా తేనేను చూస్తే నోరు ఊరిపోతుంటుంది. అలాంటిది తన పొడవున్న తేనెతుట్టెను పట్టుకొని దర్జాగా నిల్చున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని అంబ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమల్ల అడవుల్లో అప్పాపూర్ అనే ఓ మారుమూల చెంచు గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన సురేష్ (టింకు) అనే చెంచు బాలుడు తనపొడవైన తేనెతుట్టెను పట్టుకొని కనిపించాడు. ఇదెక్కడిదని ప్రశ్నించగా తానే తీసుకొచ్చానని, అందులోని తేనెను పిండుతున్నానని తెలిపాడు. తాను ఖాళీ సమయాల్లో ఇలాంటి సాహసాలు ఇంకెన్నో చేయగలనంటూ వివరించాడు. ఈ మాటలు విన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో చెంచు సాహిత్యంపై పరిశోధన చేస్తున్న క్రిష్ణ గోపాల్ అనే పరిశోధకుడు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్ కెమెరాలో బందించి ఇలా పంచుకున్నారు. -
సో.. ’స్వీట్’
ఆదాయాన్నిస్తున్న తేనెటీగల పెంపకం ఆసక్తి చూపుతున్న రైతులు కేవీకేలో నేడు ప్రపంచ తేనెటీగల దినోత్సవం తాడేపల్లిగూడెం : తేనెటీగల పెంపకం రైతులకు ఆదాయాల తీపిని పంచుతోంది. గిరిజన ఉప ప్రణాళిక కింద వీటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యానశాఖ ద్వారా తేనెటీగల పెంపకానికి 50 శాతం రాయితీతో పెట్టెలను అందిస్తున్నారు. శనివారం ప్రపంచ తేనెటీగల దినోత్సవం నేపథ్యంలో వీటి పెంపకం, స్థితిగతులపై ఈ ప్రత్యేక కథనం. రైతుకు ఆదాయం చేకూర్చడంతో పాటు అదనపు ఉపాధి కలగడానికి తేనెటీగల పెంపకం ఉపకరిస్తుంది. మొక్కలలో పరపరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరగడం వల్ల వ్యవసాయం, ఉద్యాన పంటలలో దిగుబడులు పెరిగినట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జిల్లాలో గిరిజన ఉప ప్రణాళిక కింద ఆర్‌కెవీవై పథకంలో 300 మంది గిరిజనులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం ప్రాంతంలో తేనె టీగల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. గిరిధార ప్రొడ్యూసర్స్ సొసైటీ కింద వీరు ఏర్పాటై తేనెను తయారు చేస్తున్నారు. కిలో 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా వీటి పెంపకానికి ఒక్కొక్క రైతుకు ఎనిమిది బాక్సుల వంతున 50 శాతం రాయితీపై ఇస్తున్నారు. తేనెటీగలను బాధ పెట్టకుండా.. తేనెటీగలను దులపక్కర్లేదు. వాటిగుడ్లను పాడు చేయనక్కర్లేకుండానే చక్కని తేనెను తీసుకోవచ్చు. పాత తేనె సేకరణ ప్రక్రియకు మెరుగులు దిద్దుతూ ఆస్ట్రేలియా దేశంలో ఫ్లో...హనీ యంత్రాలు తయారయ్యాయి. ఈ ప్రక్రియలో కూలీ ఈగలు, రాణి ఈగలను బాధపెట్టక్కర్లేకుండానే తేనెను తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫ్లో హనీలో కింద అరలో తేనెను తయారు చేసే కూలీ ఈగలు ఉంటాయి. ఇవి ఇదే యంత్రంలో పైన అమర్చిన హనీ ఎక్స్‌ట్రాక్టర్‌లో తేనెను నింపుతాయి. తేనె ఆ అరలో నిండిన తర్వాత పైన మైనపు పూతలను కూలీ ఈగలే వేస్తాయి. పై అరలో తేనె నిండిన వెంటనే ఫ్లో హనీ యంత్రంలో ఉన్న ఇండికేటర్స్‌లో యంత్రంలో తేనె నిండినట్టుగా సంకేతాలు కనిపిస్తాయి. దీంతో పై అరలో ఉన్న మైనపు పూతతో కూడిన తెట్టును నెమ్మదిగా టచ్ చేస్తే ఆ యంత్రానికి అమర్చిన కుళాయి ద్వారా శుద్ధ తేనె వస్తుంది. తేనె సేకరణలో సాధారణ ప్రక్రియలో కూలీ ఈగలు పుప్పొడిని, మకరందాన్ని తీసుకొచ్చి తేనెటీగల బాక్స్‌లో గుడ్లను పెట్టి మైనపు తెట్టుగా తయారు చేస్తాయి. తేనె తయారైందని తెలిసిన తర్వాత పట్టుగూడుకున్న ఈగలను దులిపి మైనపు ముద్దలాంటి పట్టును ఎక్స్‌ట్రాక్టర్‌లో తిప్పితే గాని తేనె బయటకు రాదు. ఈ ప్రక్రియలో తేనె గుడ్లు పాడవ్వటంతో పాటు ఈగలు, పెద్ద సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రక్రియకు మెరుగులు దిద్ది ఫ్లో హనీని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా స్థానిక వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞానకేంద్రంలో శనివారం ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని జరపనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చిరంజీవి చౌదరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. -
తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు
డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ హెడ్ క్వార్టర్లో సోమవారం ముగ్గురు వ్యక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. పశువులు కాస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో గొల్లూరి విశ్వనాథం అనే వ్యక్తి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
విద్యార్థులపై తేనెటీగల దాడి
నెల్లూరు : స్థానిక వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రంపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. దాంతో కౌన్సెలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి కూడా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాలిటెక్నిక్ కళాశాలకు తరలి వచ్చారు. అయితే తేనెటీగల దాడితో విద్యార్థులంతా కౌన్సెలింగ్ కేంద్రం నుంచి దూరంగా పరుగులు తీశారు. -
తేనెటీగలను తప్పించుకోబోయి.. చెరువులో దూకాడు
విశాఖపట్నం : తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి చెరువులోకి దూకాడు ఓ యువకుడు. అయితే అతనికి ఈత రాకపోవడంతో నీళ్లలో ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... పెదగమనూరు గ్రామానికి చెందిన కె.ప్రసాద్(35) గురువారం పొలం పనులుకు వెళ్లి వస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు అతను చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. -
భక్తులపై తేనెటీగల దాడి
కర్నూలు : కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కొలను భరతి క్షేత్రంలో కొలువుదీరిన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. భక్తులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భోజన ఏర్పాట్ల కోసం అక్కడే మంటపెడుతున్న సమయంలో పొగ తేనెతుట్టకు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేయడంతో భక్తులు తలోదిక్కు పరుగులు తీశారు. మొత్తం పదిహేను మంది దర్శనానికి వెళ్తే.. వారిలో గాయపడిన ఏడుగురు వ్యక్తులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మిగతా వారికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. -
'జన్మభూమి'పై తేనెటీగల దాడి!
-
కౌంటింగ్ కేంద్రంపై తేనెటీగల దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలోని కౌంటింగ్ కేంద్రంపై మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్బంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతుంది. అయితే పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుండగా తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాయి.