బీటెక్, డిగ్రీ లేదంటే ఎంబీఏ, కుదిరితే ఎంటెక్ పూర్తిచేసి ఏదో ఓ కంపెనీలో ప్లేస్‌మెంట్ సంపాదించాలి. లేదంటే పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రభుత్వ కొలువు కొట్టాలి. ఇదీ ప్రస్తుతం యువత ఆలోచన ధోరణి. వ్యవసాయం, కొత్త వ్యాపారం చేయాలని వందలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా వినూత్నంగా ఆలోచించిన వారిలో వరంగల్ మట్టెవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్ ఒకరు. రిస్క్‌తో కూడిన తేనె ఉత్పత్తి పంటను ఎంచుకుని రాణిస్తున్నాడు. హర్షవర్ధన్ పై సాక్షి ప్రత్యేక కథనం.
తల్లిపై ప్రేమతో..
హర్షవర్ధన్ స్కేటింగ్ కోచ్. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాడు. అతడి తల్లి ప్రతిభ పింగళి కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్. అందరి యువకుల మాదిరిగానే ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. కానీ తల్లిపై ప్రేమ కొత్త ఆలోచనకు తెరలేపింది. కరోనా వేవ్‌లో హర్షవర్ధన్ తల్లి ప్రతిభకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రతి రోజూ ఉదయం నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. మార్కెట్‌లో తెచ్చిన తేనె స్వచ్ఛతపై హర్షవర్ధన్‌కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో స్వచ్ఛమైన తేనె గురించి యూట్యూబ్‌లో అన్వేషించాడు. ఎక్కడ లభిస్తుంది.. ఎలా ఉత్పత్తి చేస్తారని వెతికాడు. చివరికి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ సంస్థలో తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై ఐదు రోజుల శిక్షణ తీసుకున్నాడు.
చేనులో ఏర్పాటు చేసిన తేనెటీగల బాక్సులు
మొదట రెండు బాక్సులతో..
శిక్షణ అనంతరం హైదరాబాద్‌లోనే తేనెటీగలు పెంచే బాక్సులను ఒక్కో బాక్స్ రూ.12వేలతో రెండింటిని కొనుగోలు చేశాడు. ఎఫీస్ మెలిఫెరా అనే ఇటాలియన్ తేనెటీగలు ఒక్కో బాక్సులో 50 వేల నుంచి లక్ష వరకు నివాసం ఉంటాయి. ఆ బాక్సులను మట్టెవాడలో తాను శిక్షణ ఇచ్చే స్కేటింగ్ రింక్ వద్ద చెట్లపై ఉంచాడు. సుమారు 45 రోజుల్లో పంట చేతికొచ్చింది. రెండు బాక్సుల నుంచి తేనె వేరు చేయడం సాధ్యం కాదని మరో 10 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వరంగల్ శివారు స్తంభంపెల్లిలో స్థానిక రైతు సాయంతో పొలంలో ఉంచాడు.
దీంతో మొదటిసారి 11 కేజీల స్వచ్ఛమైన తేనే వచ్చింది. సెకండ్ లాక్‌డౌన్ సమయంలో తేనెను బంధువులు, స్నేహితులకు అందజేశాడు. ఆ తర్వాత ధైర్యం చేసి 100 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వర్ధన్నపేట శివారులో పంట చేన్ల వద్ద ఉంచి తేనెటీగల పెంపకాన్ని కొనసాగించాడు. మంచి లాభం వచ్చింది. దీంతో 200 బాక్సులు తెప్పించి కోరుట్ల, అమ్మవారిపేటలోని పొద్దుతిరుగుడు, ఆవాల పంటల వద్ద ఉంచాడు. అవి జన్యుమార్పిడి పంటలు కావడంతో 50 బాక్సుల్లోని తేనేటీగలు మృత్యువాత పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాడు.
తేనెటీగల బాక్సుల వద్ద హర్షవర్ధన్
450 బాక్సుల్లో.. ఐదు రకాల తేనె..
నష్టపోయిన అనంతరం నిపుణుల వద్ద హర్షవర్ధన్ మరింత శిక్షణ తీసుకున్నాడు. ఏడాదిన్నర కాలంలో తేనె ఉత్పత్తిపై మంచి అనుభవం సంపాధించాడు. పూర్తి పరిజ్ఞానంతో తేనెలో సైతం వివిధ రకాల రుచులు ఉంటాయని తెలుసుకుని సిద్దిపేట, నల్గొండ శివారు గ్రామాల్లో పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, అల్లనేరేడు, ఓమ, తులసి పంటల రైతులతో మాట్లాడి పొలాల్లో 162 బాక్సులను ఉంచాడు.
ఈసారి ఆ బాక్సుల నుంచి 200 కేజీల తేనె దిగుమతిగా వచ్చింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో 450 బాక్సుల ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నాడు. హర్షవర్ధన్ వద్ద ప్రస్తుతం ఆవాలు, నువ్వులు, ఓమ, అల్లనేరేడు, తులసి రుచులలో తేనె వేర్వేరుగా లభిస్తోంది.
ప్రత్యేక స్టోర్..
కార్పొరేట్ కంపెనీల మాదిరిగా పబ్లిసిటి చేసుకోలేని హర్షవర్ధన్ ప్రస్తుతం హనుమకొండలోని డీఐజీ బంగ్లా ఎదురుగా షెటర్ అద్దెకు తీసుకుని ‘హర్ష నేచురల్ హనీ’ పేరుతో స్టోర్ ఏర్పాటు చేశాడు. మొదట్లో మార్కెటింగ్ కోసం ఇబ్బందిపడినా ప్రస్తుతం ఆన్‌లైన్, పరిచయాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాడు.
రుణం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
తేనెటీగల పెంపకం ఖర్చు, రిస్క్‌తో కూడుకున్నది. వ్యయప్రయసలకు ఓర్చి తేనె ఉత్పత్తి చేస్తున్న తనలాంటి వారికి ప్రభుత్వం రాయితీపై రుణంతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.
– మాడిశెట్టి హర్షవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment