apiculture
-
తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుడు.. 5 రకాల రుచుల్లో తేనె
బీటెక్, డిగ్రీ లేదంటే ఎంబీఏ, కుదిరితే ఎంటెక్ పూర్తిచేసి ఏదో ఓ కంపెనీలో ప్లేస్మెంట్ సంపాదించాలి. లేదంటే పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రభుత్వ కొలువు కొట్టాలి. ఇదీ ప్రస్తుతం యువత ఆలోచన ధోరణి. వ్యవసాయం, కొత్త వ్యాపారం చేయాలని వందలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఆలోచిస్తున్నారు. అలా వినూత్నంగా ఆలోచించిన వారిలో వరంగల్ మట్టెవాడకు చెందిన మాడిశెట్టి హర్షవర్ధన్ ఒకరు. రిస్క్‌తో కూడిన తేనె ఉత్పత్తి పంటను ఎంచుకుని రాణిస్తున్నాడు. హర్షవర్ధన్ పై సాక్షి ప్రత్యేక కథనం. తల్లిపై ప్రేమతో.. హర్షవర్ధన్ స్కేటింగ్ కోచ్. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తున్నాడు. అతడి తల్లి ప్రతిభ పింగళి కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్. అందరి యువకుల మాదిరిగానే ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. కానీ తల్లిపై ప్రేమ కొత్త ఆలోచనకు తెరలేపింది. కరోనా వేవ్‌లో హర్షవర్ధన్ తల్లి ప్రతిభకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రతి రోజూ ఉదయం నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. మార్కెట్లో తెచ్చిన తేనె స్వచ్ఛతపై హర్షవర్ధన్‌కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో స్వచ్ఛమైన తేనె గురించి యూట్యూబ్‌లో అన్వేషించాడు. ఎక్కడ లభిస్తుంది.. ఎలా ఉత్పత్తి చేస్తారని వెతికాడు. చివరికి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ సంస్థలో తేనెటీగల పెంపకం, ఉత్పత్తిపై ఐదు రోజుల శిక్షణ తీసుకున్నాడు. చేనులో ఏర్పాటు చేసిన తేనెటీగల బాక్సులు మొదట రెండు బాక్సులతో.. శిక్షణ అనంతరం హైదరాబాద్‌లోనే తేనెటీగలు పెంచే బాక్సులను ఒక్కో బాక్స్ రూ.12వేలతో రెండింటిని కొనుగోలు చేశాడు. ఎఫీస్ మెలిఫెరా అనే ఇటాలియన్ తేనెటీగలు ఒక్కో బాక్సులో 50 వేల నుంచి లక్ష వరకు నివాసం ఉంటాయి. ఆ బాక్సులను మట్టెవాడలో తాను శిక్షణ ఇచ్చే స్కేటింగ్ రింక్ వద్ద చెట్లపై ఉంచాడు. సుమారు 45 రోజుల్లో పంట చేతికొచ్చింది. రెండు బాక్సుల నుంచి తేనె వేరు చేయడం సాధ్యం కాదని మరో 10 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వరంగల్ శివారు స్తంభంపెల్లిలో స్థానిక రైతు సాయంతో పొలంలో ఉంచాడు. దీంతో మొదటిసారి 11 కేజీల స్వచ్ఛమైన తేనే వచ్చింది. సెకండ్ లాక్డౌన్ సమయంలో తేనెను బంధువులు, స్నేహితులకు అందజేశాడు. ఆ తర్వాత ధైర్యం చేసి 100 బాక్సులు కొనుగోలు చేశాడు. వాటిని వర్ధన్నపేట శివారులో పంట చేన్ల వద్ద ఉంచి తేనెటీగల పెంపకాన్ని కొనసాగించాడు. మంచి లాభం వచ్చింది. దీంతో 200 బాక్సులు తెప్పించి కోరుట్ల, అమ్మవారిపేటలోని పొద్దుతిరుగుడు, ఆవాల పంటల వద్ద ఉంచాడు. అవి జన్యుమార్పిడి పంటలు కావడంతో 50 బాక్సుల్లోని తేనేటీగలు మృత్యువాత పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాడు. తేనెటీగల బాక్సుల వద్ద హర్షవర్ధన్ 450 బాక్సుల్లో.. ఐదు రకాల తేనె.. నష్టపోయిన అనంతరం నిపుణుల వద్ద హర్షవర్ధన్ మరింత శిక్షణ తీసుకున్నాడు. ఏడాదిన్నర కాలంలో తేనె ఉత్పత్తిపై మంచి అనుభవం సంపాధించాడు. పూర్తి పరిజ్ఞానంతో తేనెలో సైతం వివిధ రకాల రుచులు ఉంటాయని తెలుసుకుని సిద్దిపేట, నల్గొండ శివారు గ్రామాల్లో పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, అల్లనేరేడు, ఓమ, తులసి పంటల రైతులతో మాట్లాడి పొలాల్లో 162 బాక్సులను ఉంచాడు. ఈసారి ఆ బాక్సుల నుంచి 200 కేజీల తేనె దిగుమతిగా వచ్చింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో 450 బాక్సుల ద్వారా తేనె ఉత్పత్తి చేస్తున్నాడు. హర్షవర్ధన్ వద్ద ప్రస్తుతం ఆవాలు, నువ్వులు, ఓమ, అల్లనేరేడు, తులసి రుచులలో తేనె వేర్వేరుగా లభిస్తోంది. ప్రత్యేక స్టోర్.. కార్పొరేట్ కంపెనీల మాదిరిగా పబ్లిసిటి చేసుకోలేని హర్షవర్ధన్ ప్రస్తుతం హనుమకొండలోని డీఐజీ బంగ్లా ఎదురుగా షెటర్ అద్దెకు తీసుకుని ‘హర్ష నేచురల్ హనీ’ పేరుతో స్టోర్ ఏర్పాటు చేశాడు. మొదట్లో మార్కెటింగ్ కోసం ఇబ్బందిపడినా ప్రస్తుతం ఆన్లైన్, పరిచయాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాడు. రుణం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి తేనెటీగల పెంపకం ఖర్చు, రిస్క్‌తో కూడుకున్నది. వ్యయప్రయసలకు ఓర్చి తేనె ఉత్పత్తి చేస్తున్న తనలాంటి వారికి ప్రభుత్వం రాయితీపై రుణంతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. – మాడిశెట్టి హర్షవర్ధన్ -
60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా..
తిరువనంతపురం: తేనె మానవులకు అత్యంత ఇష్టమైన, మధురమైన పదార్ధం. తేనెను ఇష్టపడని వారుండరు అంటే కూడా అతిశయోక్తి కాదేమో.. కానీ తేనెటీగలను చూస్తే మాత్రం కాసింత దూరం వెళ్లాల్సిందే. కానీ కేరళకు చెందిన ఓ యువకుడు మాత్రం తేనెటీగలు తన స్నేహితులంటూ వాటిని రక్షించడం నా కర్తవ్యం అంటూ చెప్పుకొస్తున్నాడు. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన సంజయ్‌కుమార్ ఒక తేనెటీగల పెంపకందారుడు. తేనెను తయారుచేస్తూ అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. నేచర్ ఎమ్ఎస్గా పిలవబడే 24 ఏళ్ల ఆయన కుమారుడు తన చిన్ననాటి నుంచే తేనెటీగల పెంపకాన్ని చూస్తూ వాటిని బాగా మచ్చిక చేసుకున్నాడు. తేనెటీగలు కుట్టడం ప్రమాదకరమని తెలిసినా.. వాటితో ఒక ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. చదవండి: వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా? ఏడు సంవత్సరాల వయసు నుంచే వందలాది తేనెటీగలను తన ముఖం మీద, చేతుల మీద వాటిని ఉంచుకోవడం తన స్నేహితులను ఆశ్చర్యానికి గురిచేసేది. తర్వాతి కాలంలో దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు 60వేల తేనెటీగలను తన మొహంపై ఉంచుకొని గిన్నిస్ రికార్డును కూడా నెలకొల్పారు. అనుభవజ్ఞులైన తేనెటీగల పెంపకందారులు కూడా ఇటువంటి చర్యలకు బయపడతారు. కానీ అతను మాత్రం కనురెప్పలు, పెదాల మీద ఉంచుకొని వాటితో ప్రశాంతంగా ఉండాలని.. స్నేహితుడిలా.. సోదరుడిలా చూసుకోవాలని సలహా ఇస్తున్నాడు. చదవండి: చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం కాగా దీనిపై ఆయనను వివరణ కోరగా.. మొదట్లో ఇది అంత సులభం కాదు. కొద్దిరోజులకు అలవాటుపడ్డాను. దీనిని నేను ఎప్పుడూ ఇబ్బందికరంగా భావించలేదు. వాటిని ముఖం మీద ఉంచుకున్నప్పుడు కూడా నేను ప్రతిదీ చూడగలిగాను. నడవగలిగాను. డ్యాన్స్ కూడా చేశాను. తేనెటీగ ప్రమాదకరం అని తెలుసుకోకముందే వాటితో నాకు ఒక ప్రత్యేక బంధం ఏర్పడింది. ఆ అభిమానమే ఎపీకల్చర్లో బెంగళూర్‌లో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి ప్రేరేపించింది. త్వరలోనే తేనెటీగల గురించి అధ్యయనం చేసి డాక్టరేట్ కూడా పొందాలని కలలు కంటున్నట్లు' తెలిపాడు. -
పూలుంటే తేనె ‘పంటే’!
‘తేనెటీగల పెంపకంలో అతిముఖ్యమైనది ఆహారం. అంటే పుష్పించే కాలం. మామిడి, జీడి మామిడి తదితర తోటలు డిసెంబర్ నెలలో పూత మొదలై ఫిబ్రవరి నెల సగం వరకు పిందె కట్టుతాయి. వివిధ రకాల పూల మొక్కలు, కుంకుడు, కంది వంటివి కూడా చలికాలంలో పుష్పిస్తాయి. కావున తేనెటీగల పెంపకం ఈ కాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉన్న చిన్నతరహా పరిశ్రమ ఇది. దీనికి విశాలమైన స్థలంతో పనిలేదు. చదువులాంటి అర్హతలు అక్కర్లేదు. సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, గృహిణులు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగ యువత... ఎవరైనా ఈ పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. తేనెటీగలు పెంచే ముందు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. పెంపకం పద్ధతులను ఆకళింపు చేసుకుంటే చాలు. తొలి దశలో శిక్షణ తప్పని సరి.’ తేనెటీగల పెంపకం గురించి సూర్యనారాయణ ఇంకా ఏమంటున్నారో ఆయన మాటల్లోనే... పూలే ప్రధానం తేనెటీగలు పెంచాలనుకునే ప్రాంతంలో పుష్పసంపద కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రుతువులు, నెలల్లో పుష్పించే మొక్కల సమాచారాన్ని సేకరించాలి. వీటి పుష్పీకరణ వ్యవధిని కూడా గమనించాలి. పుష్ప సాంద్రత కూడా చాలా ప్రధానం. పూలు అధికంగా ఉండే సీజన్లోనే తేనెటీగలను పెంచాలి. తేనెటీగల పెంపకానికి కావలసిన సామగ్రిలో తేనెటీగల పెట్టే, హైవ్స్టాండ్ ముఖ్యమైనవి. తేనెటీగల పెట్టెగా టేకుతో చేసిన గూడు ఉపయోగించాలి. హైవ్ స్టాండ్: తేనెటీగల గూళ్లను నేలమట్టం కంటే కొంత ఎత్తులో ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. తేనెటీగలను చీమలు, చెద పురుగులు, కీటకాల నుంచి రక్షించేందుకు ఇది దోహదపడుతుంది. నేలలోని తేమ గూళ్లను తాకకుండా ఉండేందుకు అడుగున ఉన్న గూడుకు సైతం గాలి వెలుతురు సోకేం దుకూ ఈస్టాండ్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ఐదు ఎకరాల మామిడి తోట ఉన్న రైతు 20-25 బాక్సులు తోట అంతటా అమర్చితే మూడు నుంచి ఐదునెలల కాలంలో సుమారు 25 లీటర్ల తేనె ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా సుమారు రూ. 18,000 నుంచి రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఈ ఆదాయం మామిడి, జీడి మామిడి పంటలకు అదనం. తేనెటీగల వలన పరపరాగ సంపర్కం జరిగి మామిడి, ఇతర పంటల్లో పిందెకట్టు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. -
తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు ఉంటాయని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారు శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ఆసక్తి గలవారు బయోడేటా, నాలుగు పాస్‌ఫొటోలు, రేషన్‌కార్డు జిరాక్స్‌తో హసన్‌పర్తిలోని సంస్కృతీ విహార్‌లో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0870-2564766, 98493 07873 నంబర్లలో సంప్రదించాలని కోరారు.