
తేనెటీగల జీవన విధానాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని అత్యంత నాణ్యమైన తేనె సేకరించడంలో మాదు నాగేశ్వరరావుది అందెవేసిన చేయి. పరిసర ప్రాంతాల్లో పెట్టెలను ఏర్పాటు చేసి 67 ఏళ్లుగా తేనె సేకరించడమే ఆయన వ్యాపకం. నాణ్యత విషయంలో రాజీ పడరు. ఆయన వద్ద నుంచి ఇతర దేశాల్లోని తెలుగు వారు సైతం తేనెను కొనుగోలు చేస్తుంటారు. నాగేశ్వరరావు అనుభవాలు ఆయన మాటల్లోనే...
మా స్వగ్రామం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. అత్తవారిది ఈడుపుగల్లు. మాది వ్యవసాయ కుటుంబం. మా ప్రాంతానికి చెందిన శేషాచలం, అప్పారావు, కొల్లి రాజారావు వంటి వారి వద్ద నుంచి మెలకువలు నేర్చుకున్నాను. 1950లో గాంధీజీ తేనె పరిశ్రమను స్థాపించాను. ప్రత్యేకంగా తయారు చేసుకున్న తేనె పెట్టెలు చెట్లు, పండ్లతోటలు, ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసుకోవాలి. డెల్టా ప్రాంతంలో కన్నా అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన తేనె ఉత్తమం. నవంబర్, డిసెంబర్ నెలల్లో తేనెటీగల సంతతి పెరుగుతుంటుంది. జనవరి నాటికి పెట్టెలు ఇరుకు అవుతాయి. ఈగలను మరో పెట్టెలోకి తరలించటం ద్వారా అవి మరో ప్రాంతానికి వలస వెళ్లకుండా కాపాడుకోవాలి. తద్వారా తేనె ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ ఉండొచ్చు.
గతంలో తేనె పెట్టెలను ఖాదీ గ్రామోద్యోగ మిషన్ సబ్సిడీపై ఇస్తుండేది. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో కొనుక్కోవాల్సిందే. పంటలపై రసాయనిక పురుగు మందుల వాడకం పెరుగుతున్నందున తేనెటీగల సంఖ్య తగ్గుతున్నది. పుప్పొడి సేకరించే తరుణంలో తేనెటీగలు పురుగుమందుల ప్రభావంతో చనిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో వేప, తాటి గులకల మీది నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. కలప కోసం ఆ చెట్లను నరికేస్తున్నారు. ఆ సీజన్‌లో తేనె అనుకున్నంతగా రావటం లేదు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కొందరు సినిమాతారలకు కూడా తేనె ఇచ్చాను. తొలి రోజుల్లో వీసె తేనె రూ. 12కి విక్రయించటం తెలుసు. ప్రస్తుతం కిలో రూ.260కి ఇస్తున్నాం. తేనె సేకరణలో చాలా మందికి శిక్షణ ఇచ్చాను. మొబైల్: 99592 65559.
– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment