తేనె పూసిన 'కల్తీ' | 77 percent of honey from popular brands is adulterated | Sakshi
Sakshi News home page

తేనె పూసిన 'కల్తీ'

Published Sun, Apr 25 2021 4:11 AM | Last Updated on Sun, Apr 25 2021 4:11 AM

77 percent of honey from popular brands is adulterated - Sakshi

సాక్షి, అమరావతి: మార్కెట్‌లో విక్రయిస్తున్న ప్రముఖ బ్రాండ్ల తేనెలో 77 శాతం కల్తీవేనని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) తేల్చింది. చాలా కంపెనీలు తేనెలో చక్కెర పాకం కలిపి విక్రయిస్తున్నట్టు స్పష్టం చేసింది. 13 రకాల ప్రముఖ బ్రాండ్లకు చెందిన తేనె నమూనాలను సేకరించిన సీఎస్‌ఈ జర్మనీలోని ల్యాబ్‌లో పరీక్ష చేయించగా.. దిగ్భ్రాంతి కలిగించే ఈ మోసం బయటపడింది. అడవుల నుంచి పట్టు, పుట్ట తేనెను సేకరించామంటూ రోడ్లపక్కన తేనె పేరిట బెల్లం పాకాన్ని పిండి ఇస్తున్న దానికీ.. ప్రముఖ బ్రాండ్ల పేరిట అమ్మే తేనెకు ఏ మాత్రం తేడా కనిపించడం లేదని ప్రకటించింది.

ఎన్‌ఎంఆర్‌ పరీక్షల్లో ఏం తేలిందంటే..
తేనెలో ఏయే రకాల చక్కెర పాకాలను కలుపుతున్నారనేది గుర్తించడానికి న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రెసోనాన్స్‌ (ఎన్‌ఎంఆర్‌) పరీక్ష నిర్వహిస్తారు. దేశంలో ఇటువంటి పరీక్షా కేంద్రాలు లేకపోవడం సీఎస్‌ఈ సేకరించిన నమూనాలను జర్మనీకి పంపింది. తేనెలో సీ–3 సుగర్‌ను ఎక్కువ కలుపుతున్నట్టు ఆ పరీక్షల్లో తేలింది. దీనిని చైనా నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నారని సీఎస్‌ఈ ప్రకటించింది. ఆ సంస్థ నివేదిక ప్రకారం చైనా కంపెనీలు ఫ్రక్టోజ్‌ సిరప్‌ పేరిట చక్కెర పాకాన్ని భారత్‌కు పంపిస్తున్నాయి. ఏటా చైనా నుంచి సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల ఫ్రక్టోజ్‌ దిగుమతి అవుతోంది. దీనిని స్వల్ప మోతాదులో ఉండే తేనెతో కలిపి విక్రయిస్తున్నట్టు సీఎస్‌ఈ తేల్చింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో విక్రయిస్తున్న ప్రముఖ బ్రాండ్ల తేనెలన్నీ కల్తీవేనంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనికి మరికొన్ని సంస్థలు కూడా గొంతు కలిపాయి.

కల్తీని గుర్తించడం ఎలా?
తేనె సీసాల లేబుల్‌పై ముద్రించి ఉండే కాంపొనెంట్స్‌ ఏమిటనేది గుర్తించాలి. అందులో వాడిన ముడి పదార్థాలేమిటో పరిశీలించాలి. మూత తీసేప్పుడు చిన్నపాటి శబ్దం (సోడా బాటిల్‌ మూత తీసేప్పుడు వచ్చే శబ్దం మాదిరి) వస్తే అదిమంచిది కానట్టే. బాటిల్‌ లోపల పులియటం (ఫెర్మంటేషన్‌) జరిగితే ఈ శబ్దం వస్తుంది. వెనిగర్‌ కలిపిన నీళ్లలో తేనెను వేసినప్పుడు నురగ వస్తే అది మంచిది కాదు. తేనెను మరగబెట్టినా ఆవిరి కాదు. బొటన వేలిపై ఒక బొట్టు తేనె వేసుకున్నప్పుడు కొన్ని సెకన్ల పాటు అయినా కదలకుండా ఉండాలి. 

తేనెటీగల పెంపకందారుల జీవనోపాధికి గండి
కల్తీ తేనె వల్ల తేనెటీగల పెంపకందారుల జీవనోపాధి దెబ్బతింటోంది. రాష్ట్రంలో గిరిజన కార్పొరేషన్‌ విక్రయించే తేనెకు మంచి పేరుంది. అయినా అమ్మకాలు మాత్రం తక్కువే. తేనెటీగల పెంపకందారులు కల్తీతో పోటీ పడలేకపోతున్నారు. కల్తీ తేనె ధర తక్కువ. తేనెటీగలు పెంచి ఉత్పత్తి చేసే తేనె ధర ఎక్కువగా ఉంటుంది.
– డాక్టర్‌ వై.వెంకటేశ్వరరావు, చైర్మన్, రైతు నేస్తం ఫౌండేషన్‌

కల్తీని కట్టడి చేసే చట్టం రావాలి
కరోనా నేపథ్యంలో తేనె వినియోగం పెరిగింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దానిలో భాగమే కల్తీ. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తోంది. వాస్తవానికి అది గత ఏడాది జూలైలో అమల్లోకి రావాల్సి ఉంది. త్వరలో ఆ చట్టం అమల్లోకి వస్తే కల్తీని కట్టడి చేయవచ్చు. చెరకు, వరి, మొక్కజొన్న, బీట్రూట్, గోధుమల నుంచి కూడా సుగర్‌ సిరప్‌ తయారు చేసి తేనెలో కలుపుతున్నట్టు తెలుస్తోంది. 
– జె.కుమారస్వామి, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement