భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విదేశీ విద్యార్థులు
గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంప్ వాక్
గుంటూరు ఎడ్యుకేషన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువతో గుం‘టూరు’ వచ్చిన విదేశీ విద్యార్థులు సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే వస్త్రాలు ధరించి ర్యాంప్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. యూకే-ఇండియా ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (యూకేఐఈఆర్‌ఐ) ప్రాజెక్టు కింద ఏఐసీటీఈ సహకారంతో గుంటూరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్యాషన్ అప్పారెల్ టెక్నాలజీపై స్కాట్లాండ్‌కు చెందిన గ్లాస్గో కెల్విన్ కాలేజీ విద్యార్థుల బృందం నాలుగు రోజులుగా శిక్షణ పొందుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది విదేశీయుల బృందం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులతో కలిసి ఆధునిక, సంప్రదాయ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్‌లో హోయలొలికించారు. గార్మెంట్ మేకింగ్‌పై పొందిన శిక్షణ ఆధారంగా యూకే విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు సంయుక్తంగా రూపొందించిన వస్త్రాలను ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి తిలకించారు.
అనంతరం స్వదేశీ, విదేశీ విద్యార్థులు ‘ఫ్యాషన్ టెక్స్‌టైల్ రిఫ్లెక్షన్స్’ పేరుతో ర్యాంప్‌పై నడుస్తూ అలరించారు. ఉదయలక్ష్మి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన భారతదేశ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు ఉందన్నారు. విదేశాల నుంచి విద్యార్థులు శిక్షణ పొందేందుకు రావడం శుభ పరిణామమని చెప్పారు. యూకేలోని గ్లాస్గో కెల్విన్ కళాశాల సందర్శనకు పాలిటెక్నిక్ కళాశాల తరపున అధ్యాపక బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్లాస్గో కెల్విన్ కాలేజీ డెరైక్టర్ ఎలస్టైర్ అండర్సన్ మెక్‌గే పైస్లీ ప్యాట్రన్ నిపుణుడు డాక్టర్ డాన్ కౌలీన్, ఇరువురు ఫ్యాకల్టీతో పాటు ఆరుగురు విద్యార్థులు, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి నిర్మల్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ ప్రతినిధి గజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ ప్రసాద్, శిక్షణా కార్యక్రమం సమన్వయకర్త బి.నాగమణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన శిక్షణా కేంద్ర నూతన భవనాన్ని కమిషనర్ ప్రారంభించారు.
అదిరేటి డ్రస్సు మేమేస్తే..
Published Sat, Jan 9 2016 1:24 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement