
న్యూఢిల్లీ: విద్యావ్యవస్థను ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పీజీడీఏవీ కళాశాల వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో లో పాల్గొన్న ఆయన భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విలువలతో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఇతర గొప్ప నాయకుల త్యాగాలు, జీవిత చరిత్రలు పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. విద్యాలయాలు జ్ఞానమందిరాలుగా విలసిల్లాలన్నారు. శాంతి, అభివృద్ధికి కేంద్రాలుగా మారాలన్నారు. చదువుతో సంబంధంలేని కార్యక్రమాలను విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించొద్దని సూచించారు.
విద్యార్థుల్లో మంచిగుణాలు, మంచి ప్రవర్తన నింపడమే విద్యాధర్మంగా గుర్తించాలన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ లాంటి కార్యక్రమాల్లో పిల్లలు కచ్చితంగా భాగం కావాలని కోరారు. వీటి వల్ల వారిలో క్రమశిక్షణ, సేవాగుణం అలవడుతాయన్నారు. వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషించాలన్నారు. చదువుతో పాటు ఆటలు, యోగా వంటి అలవాట్లను సాధన చేయాలని సూచించారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించాలని కోరారు.
అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. జీవనశైలి వ్యాధులు, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కొనేలా జాగ్రత్త వహించాలన్నారు. యువతలో అంతర్జాలం పట్ల పెరుగుతున్న మోజును నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత వల్ల తలెత్తే ప్రతికూలతలను అధిగమించడంలో పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.