అందరికీ నాణ్యమైన విద్యే లక్ష్యం
- కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
- నెల్లూరు జిల్లాలో ఎన్‌సీఈఆర్‌టీ కేంద్రానికి భూమిపూజ
వెంకటాచలం: అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవటపాళెంలో 55 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కేంద్రానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలసి మంగళవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ.. ఈ సంస్థలో ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడంతో పాటు అనుబంధంగా మరో స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. స్కూల్లో 1,500 మంది విద్యార్థులు చదువుకునే వీలుంటుందని తెలిపారు. ఈ సంస్థలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. పుదుచ్చేరి, అండమాన్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలుంటాయని చెప్పారు.