కొల్లేరు సమస్యలపై చర్యలు తీసుకోండి
కేంద్ర మంత్రి జవదేకర్‌కు వెంకయ్య విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు తగ్గించే అంశంపై తాత్కాలికంగా ఉపశమన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీ దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతున్నందున ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, అటవీ, పర్యావరణ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో కూడిన బృందం సోమవారమిక్కడ వెంకయ్య నాయుడుతో భేటీ అయింది.
అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సోమవారం తన చాంబర్‌కు పిలిపించుకొని కొల్లేరు సమస్యలపై వెంకయ్య నాయుడు చర్చించారు. జలగం వెంగళరావు సీఎంగా ఉన్న సమయంలో కొల్లేరు ప్రాంతంలో స్థాపించిన 136 మత్స్యకార సంఘాలను పునరుద్ధరించాలని జవదేకర్‌ను వెంకయ్య కోరారు. ఇందుకు జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకరించారు.