సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై తమ పార్టీకి చెందిన ఆయా రాష్ట్ర కమిటీలతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పొత్తుల విషయంపై రాష్ట్ర కమిటీలతో చర్చించేందుకు తాను గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు ఆయన వెల్లడించారు. ‘కాంగ్రెస్ హటావో దేశ్ బచావో’ అంటూ జనసేన పార్టీ నాయకుడు పవన్‌కల్యాణ్ పిలుపునివ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. బీజేపీ విధానమూ అదేనన్నారు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని పవన్‌కల్యాణ్ కలవనున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. అలాంటిదేమైనా ఉంటే.. మీడియాకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పొత్తులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు.
పొత్తులకు కొంత సమయం కావాలి:వెంకయ్య
రాష్ట్రంలో బీజేపీ పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని, వాటి ఖరారుకు మరికొంత సమయం పడుతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించి చర్చ జరగలేదన్నారు.