
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్షాలకు ఒక ఎజెండాగానీ, విధానంగానీ లేదని, ప్రధాని మోదీని గద్దె దింపడమే వారు పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. 2014 ఎన్నికల కంటే భారీ మెజారిటీతో 2019 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ కార్యవర్గం ఆదివారం సమావేశమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. మోదీని ఆపడమే తమ పథకంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. అస్సాంలో కల్లోలిత ప్రాంతాల్లో అమల్లో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ( ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తివేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలో ఎవరూ ఇల్లు లేకుండా ఉండకూడదనేది తమ విధానమని, ఇదే నవభారత నిర్మాణ లక్ష్యమని చెప్పారు. జన్‌ధన్‌యోజన ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి సామాన్యులు అందరూ వచ్చారుని పేర్కొన్నారు. కార్యవర్గ భేటీలో బీజేపీ రాజకీయ తీర్మానాన్ని రాజ్‌నాథ్ ప్రవేశపెట్టారు.