విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ
అవినీతిపరులను అవి కాపాడుతున్నాయి
అవినీతి అంతమే ఎన్డీఏ మంత్రం
అందుకోసమే నా పోరాటం
మీరట్ ర్యాలీలో ప్రధాని
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్‌తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు.
నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు.
పదేళ్ల అభివృద్ధి ట్రైలరే
‘‘ఈసారి లోక్‌సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్‌కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను.
అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్‌పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment