మోదీ అవినీతికి పాల్పడ్డారు
మా వద్ద ఆధారాలున్నాయి
- అందుకే నన్ను పార్లమెంట్‌లో మాట్లాడనివ్వడం లేదు: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం.. 15 విపక్షాల నేతలతో కలసి రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారనేందుకు తన వద్ద కీలక సమాచారం ఉందని వెల్లడించారు. అందుకే తాను లోక్‌సభలో మాట్లాడతానంటే ఆయన భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. తన వద్ద ఉన్న సమాచారం వెల్లడిస్తే మోదీ బుడగ బద్ధలవుతుందన్నారు.
ఆ సమాచారం ఏమిటని విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించగా.. ‘అది మోదీకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం. లోక్‌సభలోనే వెల్లడిస్తాను’ అని చెప్పారు. ‘పార్లమెంటులో బేషరతుగా చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రభుత్వం మాత్రం చర్చను ప్రారంభించేందుకు సిద్ధంగా లేదు’ అని ఆరోపించారు. ప్రధాని మోదీ బయట మాట్లాడటం మానేసి.. సభకు రావాలని.. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రధాని వ్యక్తిగత నిర్ణయమని, దీనికి సమాధానం చెప్పకుండా ఆయన తప్పించుకోజాలరని అన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత దేశమంతా నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు.
ప్రధాని పారిపోతున్నారు: ప్రతిపక్షాలు
రాహుల్ ఆరోపణలపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. నోట్ల రద్దు చర్చ నుంచి ప్రధాని పారిపోతున్నారని ఎద్దేవా చేశాయి. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. మోదీ పార్లమెంట్‌లో తప్ప అన్ని చోట్లా మాట్లాడతారని, నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు.
ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు: బీజేపీ
రాహుల్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ దగ్గర సమాచారం ఉన్నట్లయితే ఆయన ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ప్రశ్నించారు. ఆయన ఆరోపణలు నిరాధారమన్నారు. సభలో మాట్లాడతానని రాహుల్ ఒక్క నోటీసూ ఇవ్వలేదన్నారు.