
న్యూఢిల్లీ: పాఠశాలల్లో ‘నో డిటెన్షన్ విధానం’ రద్దుకు ఉద్దేశించిన విద్యాహక్కు సవరణ బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. అయితే, స్కూళ్లలో డిటెన్షన్ విధానం కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. బాలలకు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు సవరణ బిల్లు–2017పై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి జవడేకర్ మాట్లాడుతూ.. ‘తాజా సవరణతో ఎలిమెంటరీ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది.
తెలంగాణ, కేరళ, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు’ అని తెలిపారు. తాజా బిల్లు ప్రకారం 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఫెయిలైన వారికి మరో అవకాశంగా రెండు నెలల్లో మళ్లీ పరీక్షలు పెడతారు. లేదంటే అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. అయితే, ఈ సవరణలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీ, టీఎంసీ, శివసేన, ఎన్‌సీపీ, అకాలీదళ్ ఈ బిల్లును సమర్ధించాయి. విద్యార్థులను 8వ తరగతి వరకు డిటెయిన్ చేయకుండా తర్వాతి తరగతులకు పంపించాలని ప్రస్తుత చట్టం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment