ధర్మవరం...పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పట్టుచీర. రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, పూల వాసన గుబాళించే సంపంగి చీర, వాతావరణాన్ని బట్టి రంగు మారే చీర, భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చీరలు.. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మవరం చీరకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చింది. నూతన జిల్లా శ్రీసత్యసాయి మకుటంలో ధర్మవరం పట్టుచీర మణిలా మెరుస్తోంది. రానున్న రోజుల్లో మరింత ప్రకాశించనుంది.
చదవండి👉: మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి..
ధర్మవరం టౌన్(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాకు ధర్మవరం పట్టుచీర కీర్తికిరీటంలా నిలుస్తోంది. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి నేతన్నలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు సైతం పట్టుచీరలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇక్కడి మార్కెట్‌లో సగటున వారానికి రూ.100 కోట్ల దాకా పట్టుచీరల బిజినెస్ జరుగుతోంది. ధర్మవరం నేతన్నల పనితనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇచ్చింది.
ఉపాధికి ఊతం
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో 28 వేల దాకా చేనేత మగ్గాలున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 20 వేల మగ్గాలున్నాయి. చేనేత మగ్గాలతో పాటు పట్టుచీరల తయారీలో 18 దాకా అనుబంధ రంగాలు ఉంటాయి. రంగుల అద్దకం, డోలు చుట్టడం, పాలిషింగ్, పురిమిషన్, బోట్లు చుట్టడం, రేషం చుట్టడం, అచ్చులు అతకడం తదితర వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు.
ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు
మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ఇక్కడి డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. వందమంది దాకా పట్టుచీరల డిజైనర్లు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వివాహ శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీలు ధరించే చీరల కోసం ఇక్కడి డిజైనర్లు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. ధర్మవరం పట్టుచీర జరీ, మోడల్, డిజైన్‌బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.
భౌగోళిక గుర్తింపు
ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచ్చింది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్‌లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్‌లు నేస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
దేశ, విదేశాలకు ఎగుమతులు
ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరంలో 1,800 దాకా సిల్‌్కషాపులుండగా.. వీటి ద్వారా పట్టుచీరలను కొనుగోలు చేయడం, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి అవుతాయి. ధర్మవరం నేసేపేటలోని పట్టుచీరల మార్కెట్‌లో వారానికి సగటున రూ.100 కోట్ల దాకా టర్నోవర్ జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి శ్రీసత్యసాయి జిల్లాకు వన్నె తేవాలని నేతన్నలు కోరుతున్నారు.
చేనేతకు మంచిరోజులు
శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో ధర్మవరం చేనేతలకు మంచిరోజులు వచ్చాయి. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాక పోకలకు అనుమతినిస్తే వ్యాపారులు ఎక్కువ మంది ధర్మవరం వచ్చే అవకాశం ఉంటుంది. సరుకు ఎగుమతులకూ వీలు కలుగుతుంది. తద్వారా వ్యాపారం మరింత జోరందుకుంటుంది.
–రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం
జాతీయ అవార్డు అందుకున్నా
ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. నేను తయారు చేసిన పట్టుచీర డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది.
–నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం.
అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తాం
ధర్మవరం నేతన్నల నైపుణ్యంతో తయారైన పట్టుచీరలను కొందరు వ్యాపారులు కంచిపట్టు చీరలుగా చెలామణి చేస్తున్నారు. అందువల్లే ధర్మవరం నేతన్నకు అనుకున్నంత పేరు రాలేదు. భౌగోళి గుర్తింపు దృష్ట్యా ధర్మవరం పట్టుచీరకు ఉన్న ప్రత్యేకత తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం.
–కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ధర్మవరం.
Comments
Please login to add a commentAdd a comment