Geographical
-
ఏపీలోనే ప్రథమ స్థానం.. పట్టు.. ‘కొత్త’గా మెరిసేట్టు..
ధర్మవరం...పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పట్టుచీర. రక్షా బంధన్ చీర, కట్టుకుంటే సంగీతం వినిపించే మ్యూజికల్ చీర, పూల వాసన గుబాళించే సంపంగి చీర, వాతావరణాన్ని బట్టి రంగు మారే చీర, భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చీరలు.. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మవరం చీరకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చింది. నూతన జిల్లా శ్రీసత్యసాయి మకుటంలో ధర్మవరం పట్టుచీర మణిలా మెరుస్తోంది. రానున్న రోజుల్లో మరింత ప్రకాశించనుంది. చదవండి👉: మారేడు తెచ్చి.. నన్నారి షర్బత్ చేసి.. ధర్మవరం టౌన్(శ్రీసత్యసాయి జిల్లా): జిల్లాకు ధర్మవరం పట్టుచీర కీర్తికిరీటంలా నిలుస్తోంది. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతం ధర్మవరం. ఇక్కడి నేతన్నలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, విదేశాలకు సైతం పట్టుచీరలను ఎగుమతి చేస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల దాకా పట్టుచీరల బిజినెస్ జరుగుతోంది. ధర్మవరం నేతన్నల పనితనాన్ని గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇచ్చింది. ఉపాధికి ఊతం శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో 28 వేల దాకా చేనేత మగ్గాలున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే 20 వేల మగ్గాలున్నాయి. చేనేత మగ్గాలతో పాటు పట్టుచీరల తయారీలో 18 దాకా అనుబంధ రంగాలు ఉంటాయి. రంగుల అద్దకం, డోలు చుట్టడం, పాలిషింగ్, పురిమిషన్, బోట్లు చుట్టడం, రేషం చుట్టడం, అచ్చులు అతకడం తదితర వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ఇక్కడి డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. వందమంది దాకా పట్టుచీరల డిజైనర్లు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వివాహ శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీలు ధరించే చీరల కోసం ఇక్కడి డిజైనర్లు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. ధర్మవరం పట్టుచీర జరీ, మోడల్, డిజైన్బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచ్చింది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతర ప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశ, విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మవరంలో 1,800 దాకా సిల్్కషాపులుండగా.. వీటి ద్వారా పట్టుచీరలను కొనుగోలు చేయడం, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి అవుతాయి. ధర్మవరం నేసేపేటలోని పట్టుచీరల మార్కెట్లో వారానికి సగటున రూ.100 కోట్ల దాకా టర్నోవర్ జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసి శ్రీసత్యసాయి జిల్లాకు వన్నె తేవాలని నేతన్నలు కోరుతున్నారు. చేనేతకు మంచిరోజులు శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతో ధర్మవరం చేనేతలకు మంచిరోజులు వచ్చాయి. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాక పోకలకు అనుమతినిస్తే వ్యాపారులు ఎక్కువ మంది ధర్మవరం వచ్చే అవకాశం ఉంటుంది. సరుకు ఎగుమతులకూ వీలు కలుగుతుంది. తద్వారా వ్యాపారం మరింత జోరందుకుంటుంది. –రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం జాతీయ అవార్డు అందుకున్నా ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. నేను తయారు చేసిన పట్టుచీర డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది. –నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం. అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తాం ధర్మవరం నేతన్నల నైపుణ్యంతో తయారైన పట్టుచీరలను కొందరు వ్యాపారులు కంచిపట్టు చీరలుగా చెలామణి చేస్తున్నారు. అందువల్లే ధర్మవరం నేతన్నకు అనుకున్నంత పేరు రాలేదు. భౌగోళి గుర్తింపు దృష్ట్యా ధర్మవరం పట్టుచీరకు ఉన్న ప్రత్యేకత తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం. –కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ధర్మవరం. -
కార్యాలయాల ఫొటోలు, భౌగోళిక వివరాలు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల ఫొటోలు, భౌగోళికంగా ఎక్కడున్నదీ తెలియజేసే రేఖాంశ, అక్షాంశ వివరాలను తెలియజేయడం త్వరలోనే తప్పనిసరికానుంది. షెల్ కంపెనీలను (అక్రమ నగదు లావాదేవీల కోసం ఏర్పాటయ్యేవి) ఏరిపారేసే కార్యక్రమంలో భాగంగా కేంద్రం నూతన ఫామ్ యాక్టివ్–1ను నోటిఫై చేసింది. 2017 డిసెంబర్ 31నాటికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదై ఉన్న కంపెనీలు వచ్చే ఏప్రిల్ 25లోగా ఫామ్ యాక్టివ్–1ను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోపు ఈ పత్రాన్ని దాఖలు చేయని కంపెనీలు రూ.10,000 ఆలస్యపు ఫీజుతో దాఖలు చేయవచ్చు. కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కంపెనీ, దాని వెనుక ఉన్న వారి వివరాలను తెలుసుకునేందుకు ఈ నోటిఫికేషన్ పెద్ద ముందడుగుగా ఓ సీనియర్ అధికారి తెలిపారు. కంపెనీల కార్యాలయాల ఫొటోలను, రేఖాంశ, అక్షాంశాల వివరాలను కోరడం ఇదే మొదటిసారిగా తెలిపారు. రిజిస్టర్ కార్యాలయం ఫొటోతోపాటు, ఒక డైరెక్టర్ లేదా యాజమాన్యంలోని ఒక కీలకమైన వ్యక్తి ఫొటోను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు కంపెనీల చట్టం 2013కు చేసిన సవరణలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రద్దయినవి, రద్దయ్యే ప్రక్రియలో ఉన్నవి, -
సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం
న్యూఢిల్లీ: ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఈనెల 27, 28వ తేదీల్లో సాక్షాత్కారం కానుంది. దాదాపు గంటా 43 నిమిషాలపాటు కొనసాగే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం జూలై 27వ తేదీ అర్ధరాత్రి 11.54 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ గ్రహణంగా మారనుంది. అలా 2 గంటల 43 నిమిషాలపాటు కొనసాగి తిరిగి 28వ తేదీ వేకువజామున 3 గంటల 49 నిమిషాలకు గ్రహణంవీడనుందని భూగోళ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆస్ట్రేలియా, ఆసియాలో పూర్తిగా కనిపించనుంది. ఇది ఈ శతాబ్దం(2001 నుంచి 2100కాలం)లో అతి ఎక్కువ కాలం పాటు కొనసాగే చంద్రగ్రహణంగా రికార్డులకెక్కనుందని పేర్కొంది. -
భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జియోగ్రాఫికల్ ఇండికేషన్స్(భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. డార్జిలింగ్ టీ, పోచంపల్లి ఇకత్, మైసూర్ సిల్క్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, బికనీర్ భుజియా, గుంటూరు సన్నమ్ చిల్లి, హైదరాబాద్ హలీమ్.. భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందట. అందుకే వీటిని విక్రయించేందుకు ప్రముఖ ఆన్లైన్ సంస్థలూ ముందుకొస్తున్నాయి. ‘విలువైన’ గుర్తింపు..: భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు మార్కెట్లో తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. రాజస్తాన్‌లోని బికనీర్‌లో తయారైన భుజియాకు గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్లో 10% ప్రీమియం లభిస్తోందట. బికనీర్ భుజియా తయారీలో సుమారు 25 లక్షల మంది ఆధారపడ్డారు. కుటీర పరిశ్రమగా ఉన్న బికనీర్ భుజియాకు పెప్సితోపాటు దేశీ కంపెనీల నుంచి పోటీ తలెత్తింది. చివరకు 2010 సెప్టెంబర్‌లో భారత పేటెంటు కార్యాలయం జీఐ ధ్రువీకరణ ఇచ్చింది. బికనీర్ భుజియా పేరును ఆ ప్రాంత తయారీదారులుకాక మరెవరూ వాడుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్(రిజిస్ట్రేషన్, ప్రొటెక్షన్)చట్టం-1999 రక్షణ కల్పిస్తోంది. జీఐ ధ్రువీకరణ ఉన్న ఏ ఉత్పత్తికైనా రక్షణ ఉంది. తిరుపతి లడ్డూ లాంటి లడ్డూ అని విక్రయిస్తున్న చెన్నై వ్యాపారిపై కేసు నమోదైంది కూడా. 5 వేల ఉత్పత్తులు..: దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉన్న ఉత్పత్తులు సుమారు 1,000కి పైగా ఉంటాయి. ఇందులో భౌగోళిక గుర్తింపు నమోదు కోసం 450 (ఇతర దేశాల్లో 100 కలుపుకుని) దరఖాస్తులు చెన్నైలోని జీఐ రిజిస్ట్రీకి వచ్చాయి. వీటిలో 195 ఉత్పత్తులు ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 60 దాకా ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో 30 దరఖాస్తులు రాగా, 22 ఉత్పత్తులకు ధ్రువీకరణ లభించింది. బంగినపల్లి మామిడి, దుర్గి స్టోన్, మచిలీపట్నం ఇమిటేషన్ జువెల్లరీ, ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం చీరలు, హైదరాబాద్ బిర్యానీ, బనగానపల్లె మామిడి, బందరు లడ్డు, నిజామాబాద్ నల్ల మట్టి పింగాణి తదితర ఉత్పత్తులు జీఐ కోసం ఎదురు చూస్తున్నాయి. దేశీయ కళాకారులను ప్రోత్సహిస్తూ, వారి ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆన్లైన్ సంస్థ క్రాఫ్టిసన్.ఇన్ రాష్ట్రంపైనా ఆసక్తి కనబరుస్తోంది. త్వరలో ఇక్కడి తయారీదారులతో చేతులు కలపనుంది. అవకాశాలు అందుకోండి.. జీఐ ఉత్పత్తుల విక్రయానికి వ్యాపారులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రమోషన్ సెంటర్(ఏపీటీడీసీ) సూచిస్తోంది. జీఐ ఉత్పత్తులకు కస్టమర్లు విలువిస్తున్నారని, వ్యాపార అవకాశాలను అందుకోవాలని ఏపీటీడీసీ డెరైక్టర్ ఎస్.జ్యోతి కుమార్ సోమవారమిక్కడ సీఐఐ సదస్సు సందర్భంగా తెలిపారు. ఈ ఉత్పత్తులను విక్రయించాలనుకునే వారు స్వల్ప రుసుముతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఐపీఆర్ కౌన్సిలర్ సుభజిత్ సాహా తెలిపారు. వ్యాపారులకు అవగాహన కోసం త్వరలో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.