లక్ష్యాన్ని చేరాం! | Challenges and the stretch between 2015-16, the employment guarantee | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని చేరాం!

Published Sat, Apr 2 2016 1:27 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM

లక్ష్యాన్ని చేరాం! - Sakshi

లక్ష్యాన్ని చేరాం!

 2015-16లో సవాళ్ల మధ్య సాగిన ఉపాధిహామీ
చెల్లింపుల్లో వెనుకడుగు, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కరువు
ఈసారి కూడా మహిళలదే పైచేయి
ఎట్టకేలకు లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకున్న పథకం
నిర్ణీత సమయంలో చెల్లింపులు 46.8 శాతమే

 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16 ఆర్థిక సంవత్సర లక్ష్యాన్ని ఎట్టకేలకు చేరుకున్నారు. అయితే చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగింది. ఇకముందు దీనిని నివారించి పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తామని అధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం పథకం లక్ష్యం..పనిదినాలు, కూలి డబ్బుల చెల్లింపు తదితర అంశాలపై సాక్షి ఫోకస్.
 
మహబూబ్‌నగర్ న్యూటౌన్:- 
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2015-16 ఆర్థిక సంవత్సరంలో అనేక ఆటుపోట్ల మధ్య నిర్దేశించిన లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకుంది.  క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, సమ్మెలు, కూలి చెల్లింపుల్లో ఆలస్యం, పని ప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాల కొరత వంటి ఇబ్బందుల మధ్య అనుకున్న లక్ష్యాన్ని.. అతికష్టం మీద చేరుకుంది. గ్రామాల్లో కూలీల డిమాండ్ ఉన్నప్పటికీ నిర్వహణ లోపాల కారణంగా ఈ పథకం అమలు అనేక ఆటుపోట్ల మధ్య కొనసాగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ఉపాధిహామీ పథకానికి మొదటి ప్రాధాన్యం ఉండగా గత జూన్ నెలలో ఉపాధి సిబ్బంది సమ్మెతో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గ్రామాలలోని కూలీలకు చెల్లింపుల్లో ఆలస్యం, పనుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం, అక్రమాల నివారించడంలో ఉదాసీనత కారణంగా ఈ పథకం కూలీలకు పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కలిగించలేకపోయిందన్న భావన వ్యక్తమవుతోంది.

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతినడంతో పాటు జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాన పాత్ర పోషించాల్సిన ఉపాధిహామీ పథకం అమలు నిర్లక్ష్యానికి గురైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవాల్సిన అవసరమున్నప్పటికీ ఈ పథకం నిర్వహణాలోపానికి కారణమైంది. దీంతో జిల్లాలోని అనేక గ్రామాల్లో కూలీలు వలసబాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీల కూలి రేట్లను పెంచడంతో పా టు కూలీ కుంటుంబాలకు కల్పిస్తున్న పనిదినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచింది. అయినా క్షేత్ర స్థాయిలో అవగాహన, పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో అనుకున్న దాని కంటే ఎక్కువ ఫలితాలు సాధించాల్సిన ఈ పథకం గ్రామాల్లో నిరాధరణకు గురైందనే చెప్పవచ్చు.  
 
 జిల్లాలో పురోగతి ఇలా...
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 9,15,689 కుటుంబాలకు జాబ్‌కార్డులు జారీ చేశారు. మొత్తం 54,129 శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడి 10,39,162 మంది కూలీలుగా నమోదయ్యారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31వ తేదీ వరకు ఈ పథకం ద్వారా జిల్లాలో రూ. 273.76 కోట్లు ఖర్చు చేశారు. అందులో కూలీల ఖర్చు రూ.212.82 కోట్లు కాగా, సామగ్రి, నైపుణ్యత కూలీలకు రూ. 42.08 కోట్లు ఖర్చు చేశారు.

ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకం కూలీలకు 1,64,73,386 పనిదినాలు కల్పించి లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకుంది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఖర్చు చేసిన నిధులు రూ.2,272.27 కోట్లు కాగా రూ.1,561.31 కోట్లను కూలీలపై ఖర్చు చేశారు. జిల్లాలో 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 46,375 ఉండగా 150 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 7,500 ఉన్నాయి.
 
కలవర పెట్టిన చెల్లింపు సమస్య
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం చెల్లింపులు జరగడం లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ సమస్య కూలీలను కలవరపెడుతోంది. వారం రోజులు పనిచేసిన కూలీలకు కంప్యూటర్‌లో మూడు రోజుల్లోపు పేఆర్డర్లు తయారు చేసి వచ్చే వారం లోపు చెల్లింపు చేయాలి. ప్రభుత్వం ఈ పథకంపై పర్యవేక్షణాలోపం కారణంగా కూలీలకు నిర్ణీత సమయంలో చెల్లింపులు జరగడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మూడురోజుల్లో చెల్లింపుశాతం 46.8 గా నమోదైంది. నిర్ణీత సమయంలో చెల్లింపులు 50శాతం కూడా చేయకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మూడు రోజుల్లో చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. గత జన వరి మాసం ప్రారంభం నుంచి చెల్లింపులు మూడు నాలుగు వారాలకోసారి  చేయడంతో కూలీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు జిల్లాలో దాదాపు రూ.7.6 కోట్లు నిలిచిపోయాయి.
 
 వికలాంగుల భాగస్వామ్యం అంతంతే!
ఉపాధి హామీ పథకంలో వికలాంగుల భాగస్వామ్యం నామమాత్రంగా మిగులుతోంది. ఈ పథకం ద్వారా వికలాంగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చట్టంలో పేర్కొంది. అయితే ఆశించిన స్థాయిలో వికలాంగులను ఈ పథకంలో భాగస్వాములను చేయడం లేదు. జిల్లాలో 17,448 మంది వికలాంగుల కుటుంబాలకు ప్రభుత్వం జాబ్ కార్డులు జారీ చేసింది. మొత్తం 897  వికలాంగుల శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేసి 19,968 మంది వికలాంగులను నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 4,495 మంది వికలాంగులకే పని కల్పించింది. అందులో 360 మంది వంద రోజులు ఉపాధి పనిపూర్తి చేసుకోగా, 38 మంది 150 రోజులు పూర్తి చేసుకున్నారు.
 
 మహిళలదే పైచేయి
ఈ పథకంలో మహిళా కూలీల పాత్ర పై చేయిగా నిలుస్తోంది. ఈ పథకం ప్రారంభంనుంచి మహిళా కూలీల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే హెచ్చు స్థాయిలో ఉంటోంది. 2015-16లో 3,07,430 మంది పురుషులు కూలీ పనులు చేయగా 4,16,064 మంది మహిళా కూలీలు ఉపాధి హామీ పనుల్లో భాగస్వాములయ్యారు.
 
 లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని సాధించాం
పాలమూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు కూలీల డిమాండ్ ఉంది. చాలా గ్రామాల్లో స్థానిక పరిస్థితులు ఇబ్బందులకు గురిచేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని ఆలస్యంగా చేరుకున్నాం. ఈ సంవత్సరం అలా జరగకుండా ఇప్పటినుంచే ప్రణాళికాప్రకారం ముందుకెళ్తాం.  - కె.దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement