పెండింగ్ వేతనాలు చెల్లించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం లో భాగంగా రాష్ట్రంలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే చెల్లించేం దుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. హరితహారం పనులు చేసి 4 నెలలు గడుస్తున్నా కూలీలకు డబ్బులు విడుదల కాలేదంది. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను సరిదిద్ది, ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సోమవారం సీఎంకు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.
ఈ పథకానికి బడ్జెట్‌లో రాష్ట్రం కేటాయిస్తున్న 10శాతం నిధులను ఖర్చు చేయడం లేదన్నారు. 90 శాతం కేంద్రం నిధులను కూడా ఇతర శాఖల్లోని అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. అందువల్ల ఉపాధి కూలీలకు చట్టంలో పేర్కొన్న విధంగా వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు.