
ఉపాధికూలీలకు ‘ఉచిత’ శిక్షణ
ఉపాధిహామీ పథకం కూలీల కుటుంబాల కోసం పూర్తి కాల జీవన ఉపాధి పథకం అందుబాటులోకి వచ్చింది.
పాలకోడేరు రూరల్ : ఉపాధిహామీ పథకం కూలీల కుటుంబాల కోసం పూర్తి కాల జీవన ఉపాధి పథకం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఆంధ్రాభ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూపొందించింది. వివిధ కోర్సుల్లో, వృత్తుల్లో ఉపాధికూలీలకు, లేదా వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ వివరాలను ఉపాధిహామీ పథకం భీమవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి దుండి రాంబాబు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం ప్రస్తుతం వందరోజుల పని కల్పిస్తోంది.
వారికి 365 రోజులూ ఉపాధి లభించేలా చూడాలనే సదాశయంతో ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ముందుకొచ్చింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణకు పంపిచే బాధ్యతను అధికారులకు అప్పగించింది.
అర్హతలు
* ఉపాధి హామీ పనుల్లో వంద రోజులు పనిచేసిన కుటంబానికి చెందిన వారు గానీ లేదా వంద రోజులు పనిచేసిన వారు గానీ అయి ఉండాలి.
* వయస్సు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మహిళలు అయితే 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండాలి.
* కంప్యూటర్, డ్రైవింగ్ కోర్సులకు అయితే పదో తరగతి పాస్ అయి ఉండాలి.
* ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి.
* ఆయా కోర్సులు చేయగలిగితే
వికలాంగులు కూడా అర్హులు.
* 2014-2015 ఏడాదిలో వంద రోజులు పని చేసిన వారు అయి ఉండాలి(ప్రస్తుతానికి)
శిక్షణ కాలం
శిక్షణార్థులు ఎంచుకున్న కోర్సును బట్టి ఆరు రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ అంతా ఏలూరులోని అశోక్ నగర్ ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థలోనే జరుగుతుంది. ఏడాదికి 1700 మందికే సంస్థ శిక్షణ ఇస్తుంది. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేస్తారు.
ప్రయోజనం
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్‌ను ఆంధ్రాబ్యాంకు శిక్షణ సంస్థ జారీచేస్తోంది. అలాగే శిక్షణార్థులు స్వయం ఉపాధి పొందడం కోసం బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తోంది.
శిక్షణ ఇచ్చే కోర్సులు
ఏలూరులోని అశోక్‌నగర్‌లో ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉంది. దీనిలో ఉపాధి కూలీలు, వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చే కోర్సులివే..
⇒ కంప్యూటర్ (డీటీపీ,ఎంఎస్ ఆఫీస్)
⇒ కంప్యూటర్ హార్డ్‌వేర్
⇒ డ్రైవింగ్
⇒ సెల్‌ఫోన్ రిపేరింగ్
⇒ ఇటుకల తయారీ
⇒ సిమెంట్ వరల తయారీ
⇒ బ్యాగుల తయారీ
⇒ టైలరింగ్
⇒ ఫ్యాబ్రిక్ పెయింటింగ్
⇒ స్క్రీన్ ప్రింటింగ్
⇒ కుట్లు, అల్లికలు
⇒ గోర్రెల పెంపకం
దరఖాస్తు విధానం
స్వయం ఉపాధి శిక్షణలో చేరడం కోసం అభ్యర్థులు నేరుగా ఏలూరు అశోక్ నగర్‌లోని ఆంధ్రాబ్యాంకు స్వయం ఉపాధి శిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఉపాధిహామీ పథకం మండల టీఏ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఉంటుంది.