కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం.. | TS BC Study Circle Free Training For Group 3 And Group 4 Candidates | Sakshi
Sakshi News home page

కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం.. బీసీ స్టడీ సర్కిల్‌ నిర్వాకం 

Published Fri, Dec 23 2022 2:36 AM | Last Updated on Fri, Dec 23 2022 3:45 PM

TS BC Study Circle Free Training For Group 3 And Group 4 Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ దారితప్పింది. గ్రూప్‌–3, గ్రూప్‌–4 కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు లోపభూయిష్టంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్‌–3, గ్రూప్‌–4 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన బీసీ స్టడీ సర్కిల్‌ ప్రైవేటు శిక్షణ సంస్థలను ఎంపిక చేసి తరగతుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.

ఒక్కో అభ్యర్థికి సగటున రూ.5500 చొప్పున ఫీజు నిర్దేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50 శిక్షణ తరగతులకు ప్రైవేటు సెంటర్లను ఎంపిక చేసి సెప్టెంబర్‌ 15 నుంచి తరగతులను ప్రారంభించింది. మూడు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ శిక్షణ తరగతులు పలుచోట్ల నామమాత్రంగా సాగగా... కొన్నిచోట్ల అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. 

ఎంపిక ప్రక్రియలో నిబంధనలు గాలికి... 
రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల తెరిచిన సెంటర్లకు ఏడు సంస్థలను బీసీ స్టడీ సర్కిల్‌ ఎంపిక చేసింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 సెంటర్ల బాధ్యతలు అప్పగించగా... మిగతా 30 సెంటర్ల నిర్వహణను మిగిలిన ఆరు సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సంస్థను ఎంపిక చేసేటప్పుడు ఆ సంస్థ నేపథ్యం, అనుభవం, సామర్ధ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపు జరిగినట్లు ఆరోపణలున్నాయి.  

అడ్డగోలుగా అభ్యర్థుల పెంపు... 
ఒక్కో బీసీ స్టడీ సెంటర్‌లో గ్రూప్‌–3, గ్రూప్‌–4 శిక్షణ తరగతుల కోసం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీసీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. మొత్తంగా 5వేల మందికి శిక్షణ ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెప్టెంబర్‌ 15 నాటికి తరగతులు ప్రారంభించి డిసెంబర్‌ 15కల్లా ముగించేలా కార్యాచరణ రూపొందించింది. కానీ చాలా కేంద్రాల్లో నిర్దేశించిన అభ్యర్థుల సంఖ్య కంటే సగం, అంతకంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నమోదయ్యారు.

దీంతో గిట్టుబాటు కాదనుకున్న ప్రైవేటు సంస్థలు అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల సంఖ్య పెంపునకు అవకాశం కోరగా... తరగతులు ప్రారంభమైన నెలరోజుల తర్వాత అవకాశం  కల్పిస్తూ బీసీ స్టడీ సర్కిల్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ స్టడీ సెంటర్లుగా ఎంపిక చేసిన భవనాలన్నీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలే కావడంతో... ఏకంగా డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న అభ్యర్థులను సైతం చేర్చుకునే వెసులుబాటు కల్పించారు.

వాస్తవానికి గ్రూప్‌–3, గ్రూప్‌–4 ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ విడుదల కాగా, గ్రూప్‌–3 ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్‌ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రయోజనకరం కాకున్నా అవకాశం కల్పించడం వివాదాలకు తావిస్తోంది. 

సెంటర్ల నిర్వహణపై ఫిర్యాదుల వెల్లువ... 
బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై పలుచోట్ల అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడ్డగోలు నిర్వహణతో విలువైన సమయాన్ని వృథా చేశారంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్‌ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు ఏకంగా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. 

ఇరవై రోజుల్లో మూసేశారు... 
బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ అంటే మరో ఆలోచన లేకుండా అడ్మిషన్‌ తీసుకున్నాను. కానీ కేవలం ఇరవై రోజుల్లో స్టడీ సెంటర్‌ను మూసేశారు. 25 శాతం సిలబస్‌ కూడా పూర్తి చేయలేదు. మరోవైపు గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ రాగా, గ్రూప్‌–3 ప్రకటన అతి త్వరలో వస్తుందని సమాచారం. ఇంతటి కీలక సమయంలో సెంటర్‌ మూసివేయడంతో మరో చోట కోచింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం స్టడీ మెటీరియల్‌ కూడా ఇవ్వకపోవడంతో ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు. వెంటనే స్టడీ సెంటర్‌ను తెరిచి శిక్షణ తరగతులు నిర్వహించాలి. 
– ప్రసాద్, వికారాబాద్‌ బీసీ స్టడీ సర్కిల్‌ అభ్యర్థి 

నిరుద్యోగుల జీవితాలతో ఆటలా... 
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనడంతో ఎంతో నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు బీసీ స్టడీ సెంటర్లలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ప్రైవేటు సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడం... పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకుండా మధ్యలోనే చేతులెత్తేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు బాధ్యులను   గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. 
– ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం 

నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలు 
నిబంధనల ప్రకారమే శిక్షణ సంస్థలకు బాధ్యతలు అప్పగించాం. స్టడీ సెంటర్‌ నిర్వహణ, వసతులన్నీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టగా... ఫ్యాకల్టీ, మాక్‌ టెస్టులు మాత్రం ప్రైవేటు కేంద్రానికి అప్పగించాం. తక్కువ కాల వ్యవధి శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి వారికి వేతనాలు ఇవ్వడం పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.
– అలోక్‌ కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement