సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్–4 కొలువుల ప్రకటనకు ఇప్పట్లో అడుగు ముందుకు పడే అవకాశం కనిపించడంలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,163 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కదలిక లేదు.
సీఎస్ ఆదేశాల ప్రకారం ఈనెల 29 నాటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి శాఖల వారీగా ఇండెంట్లు (ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్ వారీగాకొలువుల భర్తీకి ప్రతిపాదనలు) సమ ర్పించాల్సి ఉంది. ఈమేరకు సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సీఎస్ డెడ్‌లైన్ కూడా విధించారు. అయినా ఒక్క శాఖ నుంచి కూడా టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం.
కారణం ఇదేనా?
ప్రభుత్వ శాఖల వద్ద గ్రూప్–4 కేటగిరీలోకి వచ్చే కొలువుల ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంది. అయితే నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు, రోస్టర్ వారీగా భర్తీ చేయాల్సినవెన్ని? తదితర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు.
దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ శాఖలు ఆ దిశగా గణాంకాలను సిద్ధం చేసుకోగా, వాటిని టీఎస్‌పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పించే ముందు ఆయా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన ఖాళీలకు తగినట్లుగా టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిస్తారు.
సాధారణంగా ఇదే పద్ధతి ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 29లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూసిన శాఖలు, నిర్దేశించిన గడువులోగా అవి వెలువడకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించలేదని తెలుస్తోంది.
హడావుడిగా సాగి..
వివిధ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9,163 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిని రిజర్వేషన్లకు అనుగుణంగా విభజించి నూతన జోనల్ విధానం ప్రకారంభర్తీ చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో రెండు వారాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ చైర్మన్ దీనికి హాజరు కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో సైతం హడావుడి నెలకొంది. ప్రభుత్వ సమావేశాలకు ఆయన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగాల భర్తీ వేగిరమైందని భావించారు. దీంతో దాదాపు అన్ని శాఖలు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. కానీ తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment