ఏం జరుగుతోంది..?
► ఉపాధిహామీ సిబ్బంది పనితీరుపై మంత్రి రామన్న అసహనం
► మొక్కలు తక్కువ ఉన్నా కాపాడలేకపోతున్నాం
► నాన్ సీఆర్‌ఎఫ్ బిల్లుల పెండింగ్‌పై అసంతృప్తి
► పథకాల అమలు తీరుపై మంత్రి సమీక్ష
ఆదిలాబాద్ అర్బన్: రైతులు కంపోస్టు ఎరువు కోసం ఉపయోగించే గుంతలకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదని, ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసహనం వ్యక్తం చేశారు. పని చేయని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో ఎదురవుతున్న తాగునీటి ఇబ్బందులు, ఉపాధి హామీ పనులు, హరితహారంపై సమీక్షించారు.
కలెక్టర్ జ్యోతిబ్ధు ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధి హామీ, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీశాఖ, అధికారులు పాల్గొన్నారు. ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో ఆదిలాబాద్ వెనుకబడి ఉందని అన్నారు. రెండు వేల మంది మాత్రమే పనులు చేస్తున్నారని అధికారులు తెలుపగా.. అవగాహన కల్పించి మరిన్ని పనులు కల్పించాలని సూచించారు. వేసవిలో పనులు చేస్తున్న కూలీలకు అదనంగా డబ్బులు వస్తాయన్న విషయం తెలుపాలని, గ్రామాల్లోని వీఆర్‌ఏల సహకారం తీసుకోవాలని అన్నారు.
మొక్కలు కాపాడలేకపోతున్నాం..
జిల్లాలో గత రెండేళ్ల క్రితం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు తక్కువగా ఉన్న కూడా వాటిని కాపాడలేకపోతున్నామని మంత్రి రామన్న అన్నారు. వేసవి దృష్ట్యా అగ్గి తగిలి అనేక చెట్లు కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు ఇంత వరకు కూడా తెలియదని అన్నారు. అటవీ ప్రాంతంలో అగ్గి తగిలి చెట్లు కాలిపోతున్నాయని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పని చేసే అధికారులు, సిబ్బంది పైస్థాయి అధికారులకు ఎలా, ఏం తెలియజేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
ఎంపీడీవోలకు వారి కింది స్థాయి సిబ్బంది రోజువారీ నివేదికలు ఇవ్వరా.. అని ప్రశ్నించారు. జైనథ్ మండలంలో రోడ్డు గుండా నాటిన మొక్కలు కాలిపోయాయని మంత్రి ప్రస్తావించారు. జిల్లాలో తక్కువ కిలోమీటర్ల మేర చెట్లు నాటిన వాటిని కాపాడలేకపోతున్నామని, వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాల వల్ల చెట్లు కాలిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఫారెస్ట్ నర్సరీల్లో పనులు చేస్తున్న కూలీలకు ఇంకా వేతనాలు రాలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, అక్కడ కమిషనరేట్‌లో పంపామని చెబుతారు.. ఇక్కడికేమో రాలేదు.. ఆ విషయం ఓసారి పరిశీలించి తెలుపాలని చెప్పారు.
తాగునీటి ఇబ్బందులు రావొద్దు
తాగునీటి సరఫరాపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ రవాణా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారో తెలుసుకున్నారు. వీఆర్‌ఏలు, మండల అధికారులు గ్రామాలకు వెళ్లి ఉపాధి హామీ, తాగునీరు, హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పెన్‌గంగ నుంచి జైనథ్, బేల మండలాలకు తాగునీరు అందించే పైప్‌లైన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
సాత్నాల పైప్‌లైన్‌ను ఎందుకు ప్రారంభించడం లేదని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఇబ్బందుల రావొద్దని ఆదేశింంచారు. గతేడాదిలో జరిగిన నాన్ సీఆర్‌ఎఫ్ పనులు పూర్తయ్యాయి, కానీ ఇంత వరకు బిల్లులు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణారెడ్డి, ఐఎఫ్‌ఎస్ ఎస్‌కె.గుప్తా, డీఆర్డీవో రాజేశ్వర్, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.