పొట్ట నింపని ‘ఉపాధి’ | The average wage of Rs 116 only | Sakshi
Sakshi News home page

పొట్ట నింపని ‘ఉపాధి’

Published Mon, Jun 5 2017 10:20 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

పొట్ట నింపని ‘ఉపాధి’ - Sakshi

పొట్ట నింపని ‘ఉపాధి’

పనులు చేసినా గిట్టుబాటుకాని కూలి    
సగటు వేతనం రూ.116 మాత్రమే
ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి..   
కొన్ని చోట్ల రోజు కూలి రూ.50 లోపే!
వలసలే శరణ్యమంటున్న కూలీలు  


కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో కూలీలకు ఆసరాగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకం వారి కడుపు మాడుస్తోంది. మండే ఎండల్లో.. కాలే కడుపులతో పనులు చేయాల్సిన దారుణ పరిస్థితి ఉంది. గట్టిపడిన నేలలో చేతులు బొబ్బలు ఎక్కేలా పని చేస్తున్నా గిట్టుబాటు కూలి అందడం లేదు.  ప్రభుత్వం కనీస వేతనం రూ.194 ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కొందరు కూలీలకు వారం రోజులు పని చేసినా రూ.500 కూడా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 30 శాతం అలవెన్స్‌గా ఇస్తున్నా కూలీల జీవనోపాధి కష్టంగా మారుతోంది. అందువల్లే వలసలు అనివార్యంగా మారాయి.                – అనంతపురం టౌన్‌

అనంతపురం టౌన్‌: జిల్లాలో 7,77,830 జాబ్‌కార్డులు జారీ చేశారు. 48,243 శ్రమశక్తి సంఘాల్లో 7,68,709 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 2 లక్షల మంది వరకు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే కూలి మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.13 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మామూలు రోజుల్లో చేసినట్లుగా వేసవిలో ఉపాధి పనులను కూలీలు చేయలేరు. ఎండవేడిమికి కూలి గిట్టుబాటు కాక పూటగడవని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వేసవిలో అదనపు కూలిని ముందుగానే ప్రకటించింది. ఉపాధి కింద రోజువారీ వేతనం రూ.194 ఉండగా అదనపు కూలి కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌/మే నెలల్లో 30 శాతం అందించారు.

ఇక జూన్‌లో 20 శాతం అందించనున్నారు. అంటే ఒక్క రోజు కూలి కింద రూ. 235 నుంచి రూ.280 వరకు రావాల్సి ఉంది. అయితే చాలా గ్రామాల్లో గిట్టుబాటు కూలి అందడం లేదు. గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఈనెల 1వ తేదీ(గురువారం) ఏకంగా ఉపాధి పనులనే బహిష్కరించారు. ఇక్కడ సగటున రోజు కూలి రూ.50లోపే వస్తోంది. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా సగటు వేతనం రూ.116 మాత్రమే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధి పనులకు కోసం వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బెంగళూరు, తమిళనాడు, తెలంగాణకు వలస వెళ్లారు. గత ఏడాది అధికారులు కేవలం సేద్యపు కుంటలతోనే నెట్టుకు వచ్చారు. ఈ ఏడాది ఇతర పనులు కూడా కల్పిస్తామని చెబుతున్నా కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కొలతల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు.

చేతులు బొబ్బలెక్కుతున్నాయ్‌
డగౌట్‌ పాండ్స్‌ పనులు చేస్తున్నాం. పైన ఒక అడుగు వరకు మెత్తగా వచ్చినా ఆ తర్వాత గునపం దింపాలంటే కష్టమే. చేతులు బొబ్బలెక్కుతున్నాయి. పోనీ చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందా అంటే అదీ లేదు. ఆరు రోజులకు గాను రూ.300లోపే కూలి పడింది. పేరుకే వేసవి అలవెన్సులు. మా కష్టానికి తగ్గ గిట్టుబాటు కూలి రావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే పనులకు వెళ్లేది లేదు. వలసలే శరణ్యం. – తిప్పేస్వామి, ఉపాధి కూలీ, కలుగోడు  

ఆరు రోజులు చేస్తే రూ.280
ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నా... అందరితో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నా. చాలా మంది కూలీలు ఆరు రోజులు పనులు చేస్తే రూ.260 నుంచి రూ.280లోపే పడింది. రోజుకు సగటున రూ.50 లోపు కూలి వస్తే ఎలా బతకాలి? ప్రభుత్వం చెప్పేదొకటి.. ఇక్కడ జరుగుతుందొకటి. ఈ విషయంపై అధికారులతో చర్చించినా ఫలితం లేదు. అందుకే గురువారం (ఈనెల 1న) అందరం కలిసి ఉపాధి పనులను బహిష్కరించాం. గిట్టుబాటు కూలి, మెత్తటి నేలలో పనులిస్తేనే ఉపాధికి వెళ్తాం.   – టి.సుకన్య, కలుగోడు ఎంపీటీసీ సభ్యురాలు, గుమ్మఘట్ట మండలం  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement