మోర్తాడ్(బాల్కొండ): విదేశీ వలస కార్మికుల కష్టాలను గుర్తించిన ఖతర్ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచుతూ కొత్త చట్టం రూపొందిం చింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ప్రతి కంపెనీ వలస కార్మికులకు నెలకు వెయ్యి రియాళ్ల కనీస వేతనం (మన కరెన్సీలో రూ.20 వేలు) చెల్లించడంతో పాటు భోజనం, వసతి కోసం మరో ఎనిమిది వందల రియాళ్లు ఇవ్వాలని ఖతర్ ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కార్మిక శాఖ జారీ చేసింది. ప్రస్తుతం ఖతర్‌లో ఉపాధి పొందుతున్న విదేశీ వలస కార్మికులకు నెలకు 500 రియాళ్ల నుంచి 700 రియాళ్ల వరకు వేతనం చెలిస్తున్నారు.
కొన్ని కంపెనీలు తమ క్యాంపులలో కార్మికులకు వసతి కల్పిస్తుండగా మరి కొన్ని కంపెనీలు మాత్రం కార్మికుల వసతి, ఇతర సదుపాయాల గురించి పట్టించుకోవడంలేదు. కాగా, వలస కార్మికులకు తక్కువ వేతనం చెల్లించడం వల్ల వారి శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని భావించిన ఖతర్ ప్రభుత్వం కనీస వేతన పరిమితిని పెంచింది. 2020 ఆగస్టులోనే కనీస వేతన పరిమితి పెంచిన ఖతర్ ప్రభుత్వం, ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఈనెల 20 నుంచి అమలులోకి తీసుకురానుంది.
ఈ చట్టం ప్రకారం వలస కార్మికులకు ఆయా కంపెనీలు వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తే ప్రతి నెలా వెయ్యి రియాళ్ల కనీస వేతనం చెల్లించాలి. ఒక వేళ వసతి, భోజన సదుపాయాలను కల్పించకపోతే అదనంగా 800 రియాళ్లను చెల్లించాలని ఖతర్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఖతర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కొన్ని కంపెనీలు అమలులోకి తీసుకువచ్చాయి. కాగా ఇప్పటి వరకు కనీస వేతన పరిమితిని అమలు చేయని కంపెనీలు ఈనెల 20 నుంచి కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కనీస వేతన పరిమితిని పెంచుతూ ఖతర్ ప్రభుత్వం చట్టం రూపొందించడం వల్ల వలస కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
చదవండి:
పది నెలలుగా ఇంటి కూరగాయలే
Comments
Please login to add a commentAdd a comment