వాటర్‌షెడ్ డౌన్!
♦ ఏడాదిన్నరగా పైసా విదల్చని సర్కారు
♦ ఫలితంగా 293 ప్రాజెక్టుల్లో అటకెక్కిన 88,159 పనులు
♦ ఇతర ప్రాజెక్టుల్లోకి ఉద్యోగుల డిప్యూటేషన్
♦ ఇప్పటికే 350 మంది ఉపాధిహామీ పథకంలోకి బదిలీ!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వం వాటర్‌షెడ్ పథకానికి స్వస్తి పలికింది. ఈ మేరకు అంతర్గత సంకేతాలిచ్చిన సర్కారు.. ఆ ప్రాజెక్టు కింద సేవలందిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి బదలాయిస్తోంది. ‘ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుదాం.. భూగర్భజలాల వృద్ధితో సాగు విస్తీర్ణాన్ని పెంపొందిద్దాం’ అనే నినాదంతో తలపెట్టిన సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) భవిష్యత్తు సంకటంలో పడింది. ఏడాదిన్నరగా ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో పనులు అటకెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మూడోవంతు ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిపై ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. తాజాగా మిగిలిన ఉద్యోగులను ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థల ప్రాజెక్టు డెరైక్టర్లకు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
293 ప్రాజెక్టులపై ప్రభావం!
రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్ మినహా ఎనిమిది జిల్లాల్లో సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం కింద 293 ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు మరో 1,491 మైక్రో వాటర్‌షెడ్లు కొనసాగుతున్నాయి. ఒక్కో వాటర్ షెడ్ పరిధి లో కనిష్టంగా ఐదు గ్రామాలను క్లస్టర్‌గా పరిగణిస్తూ అక్కడ రాతి కట్టల నిర్మాణం, నీటి వృథాను అరికట్టేందుకు చెక్‌డ్యాం ల ఏర్పాటు, గులకరాళ్ల కట్టలు, ఇంకుడు గుంతల తవ్వకం, పశువుల కోసం నీటితొట్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి 293 వాటర్‌షెడ్ల పరిధిలో 1,586 గ్రామాల్లో 88,159 పనులను నిర్దేశించారు.
ఇందుకుగాను రూ.430.06 కోట్లు అవసరమని ప్రణాళిక తయారు చేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటర్‌షెడ్ కార్యక్రమాలు నిలిచిపోవడంతో అటు సిబ్బందికిసైతం పని లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం ముగియడం.. కొత్తగా 2016-17 వార్షిక సంవత్సరం ప్రారంభం కావడం.. కరువు నేపథ్యంలో ఉపాధిహామీ పనులు ఊపందుకున్న తరుణంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదలాయింపునకు ఉపక్రమించింది. ఇందు లో భాగంగా వాటర్‌షెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను అవసరమైన చోట ఉపాధి పథకంలోకి మళ్లిస్తోంది.
350 మందికి డిప్యూటేషన్లు!
రాష్ట్రంలో 293 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల్లో 1,955 మంది పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు ఉద్యోగులే. వాటర్‌షెడ్ పనులకు నిధులివ్వకపోవడంతో వీరిని క్రమంగా ఉపాధిహామీ పథకం కింద పనులకు డిమాండ్ ఉన్నచోటకు డిప్యూటేషన్ పద్ధతిలో పంపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని తాత్కాలిక డిప్యూటేషన్‌పై పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. డిప్యూటేషన్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లు చర్యలు చే పట్టారు. అదేవిధంగా ఐడబ్ల్యూఎంపీ జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న 88 మంది అధికారులు, ఉద్యోగుల సంఖ్యను కూడా కుదిం చాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మరో పక్షం రోజు ల్లో ఉద్యోగులు, సిబ్బందికి డిప్యూటేషన్లకు సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.