watershed
-
వాటాల పంట
వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో అక్రమాల వరద టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు నాసిరకం, అవసరం లేని చోట పనులు చేపట్టి నిధుల స్వాహా టీడీపీ అధికారంలోకి వచ్చాక పెచ్చుమీరిన అవినీతి రూ.4.45 కోట్ల పనుల్లో అడుగడుగునా డొల్లతనమే కొన్ని పనులకు రికార్డులే కరువు ఇక్కడ కన్పిస్తున్న కల్లం తట్రకల్లు గ్రామ సమీపంలోనిది. వాస్తవానికి రైతులకు అందుబాటులో.. అనువైన చోట కల్లాలు నిర్మించాల్సి ఉంది. కానీ అధికారులు అనువుకాని చోట ‘లెక్క’లేసుకుని ఎగుడుదిగుడున్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు.. గంజికుంట, బోడిసానిపల్లి, ఎన్‌ఎన్‌పీ తండా, రాగులపాడు, వజ్రకరూరులోనూ ఇదే పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో కానీ, రైతులందరి అనుమతితో కానీ ఒక ప్రదేశాన్ని గుర్తించి కల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇష్టారాజ్యంగా నిర్మించారు. పైగా వాటర్‌షెడ్ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతంలోనూ నిర్మాణాలు చేపట్టారు. కొన్ని కల్లాలను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అధికార పార్టీ నేతలకు చెందిన పొలాల్లో నిర్మించి బిల్లు చేసుకోవడం గమనార్హం. అనంతపురం టౌన్: దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు కుమ్మక్కై అక్రమాల వరద పారించారు. గ్రామ అవసరాల కోసం కాకుండా తమ స్వార్థంతో పనులు చేపట్టి అందినకాడికి దోచుకున్నారు. నాసిరకం నిర్మాణాలతో నిధులు స్వాహా చేశారు. వజ్రకరూరు మండలంలోని ఆరు పంచాయతీల్లో ఎక్కడ పరిశీలించినా నాణ్యత నవ్వుతోంది. చెక్‌డ్యాం, ఫారంపాండ్స్‌లో నిబంధనలకు పాతరేశారు. అసలు కొన్ని పనులకు లెక్కా జమా లేదంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సామాజిక తనిఖీ బృందం కూడా తూతూమంత్రంగా పనులు పరిశీలించినట్లు స్పష్టమవుతోంది. రూ.5.48 కోట్లతో వాటర్‌షెడ్ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం(ఐడబ్ల్యూఎంపీ) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 2009–10 మొదటి బ్యాచ్ కింద వజ్రకరూరు మండలంలోని ఎన్‌ఎన్‌పీ తండా, రాగులపాడు, తట్రకల్లు, వజ్రకరూరు, బోడిసానిపల్లి, గంజికుంట గ్రామాల్లో వాననీటి సంరక్షణ చేపట్టి భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో 4568 హెక్టార్లలో వాటర్‌షెడ్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందుకోసం రూ.548.16 లక్షలు కేటాయించగా గత ఏడాది సెప్టెంబర్ నాటికే ప్రాజెక్ట్ కాల వ్యవధి ముగిసింది. మొత్తం రూ.444.56 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అందినంత దోచుడే.. ప్రాజెక్టు పరిధిలోని ఏ గ్రామంలో చూసినా ‘దోచుడు’ వ్యవహారమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాల ప్రణాళిక రచించి పక్కాగా అమలు చేశారు. 2014 నుంచి ఏకంగా రూ.295.03 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో ఐడబ్ల్యూఎంపీ నిధులు 185.27 లక్షలు, ఉపాధి హామీ నిధులు రూ.109.76 లక్షలతో పనులు చేపట్టారు. ఆయా గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, వాటర్‌షెడ్ అధికారులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు నాసిరకంగా నిర్వహించారు. నిబంధనల మేరకు ఫారంపాండ్స్‌ను కూలీలతో చేయించాల్సి ఉండగా.. యంత్రాలతో చేపట్టి బిల్లులు స్వాహా చేశారు. అవసరం లేని చోట కొన్ని చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టారు. కొన్ని పనులు కేవలం కాగితాల్లో మినహా క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. గ్రామ అవసరాల కోసం చేయాల్సిన పనుల్లోనూ చేతివాటం చూపి సొంత లాభం చూసుకున్నారు. ఈ కారణంగానే ఇటీవల సామాజిక తనిఖీలు చేపట్టగా రికార్డులు కూడా సమర్పించలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంతే..! వాటర్‌షెడ్ అమలు చేస్తున్న ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏ పని చేపట్టినా పనుల గుర్తింపు, ఎస్టిమేట్ల తయారీ, బిల్లుల చెల్లింపులన్నీ డబ్ల్యూసీసీ(వాటర్‌షెడ్ కంప్యూటర్ సెంటర్) పరిధిలోనే జరుగుతుండడం టీడీపీ నాయకులకు కలిసొచ్చింది. అధికారులు కూడా పనికింతని పర్సెంటేజీల రూపంలో దండుకున్నారు. బినామీ పేర్లతో బిల్లులు డ్రా చేసుకున్నారు. చేయని పనులు చేసినట్లు చూపి ‘వాటా’లు పంచుకున్నారు. పనుల వివరాలు నమోదు చేసేందుకు నకిలీ ఎం.బుక్కులు వినియోగించారు. నిబంధనల ప్రకారం ఎం.బుక్‌లలో అధికారి సంతకం, జారీ చేసిన నంబర్లు ఉంటాయి. కానీ ఇక్కడ చేసిన పనుల్లో అలాంటివేవీ కన్పించకపోవడం గమనార్హం. కొన్ని పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. -
అను‘మతి’లేని పనులు
- పక్కదారి పట్టిన వాటర్‌షెడ్ పథకం - డ్వామా నిధుల కాజేతకు తెలుగు తమ్ముళ్ల పన్నాగం -రైతుల ఖాతాల్లోకి కాకుండా బినామీ జేబుల్లోకి నిధులు గుంతకల్లు: మెట్ట రైతులకు సాగునీటి వసతి, బంజరు పొలాలను యోగ్యమైన సాగు భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన వాటర్‌షెడ్ పథకం అధికార పార్టీ నాయకులకు, దళారులకు వరంగా మారింది. జిల్లా నీటి యాజమాన్యం సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాటర్‌షెడ్ పథకం మండలంలోని పులగుట్టపల్లిలో పక్కదారి పట్టింది. వివరాల్లోకెళ్తే... ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు కల్గిన ప్రతి రైతు పొలంలో డ్వామా నిధులతో వంద క్యూబిక్ మీటర్ల మేర రాళ్లు, గుట్టలు తొలగించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ పోను ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ 10,500 , బీసీలకు రూ 9,500 బిల్లు మంజూరు చేస్తుంది. ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీ రైతులు రోజుకు 9 గంటలు, బీసీ రైతులు 8 గంటలు జేసీబీ సహాయంతో పని చేయించుకోవచ్చునన్న నిబంధన ఉంది. దీనిని సొమ్ము చేసుకోవాలని సింగిల్ విండో ప్రెసిడెంట్ పాల మల్లికార్జున, అతని సమీప బంధువు బీరప్ప పథకం రచించారు. పొలాల్లో రాళ్లు, గుట్టలు తొలగించి వ్యవసాయ యోగ్యం చేస్తామని నమ్మబలికి గ్రామానికి చెందిన దాదాపు 250 మంది రైతుల నుంచి ఒక్కొక్కరితో రూ.2 వేలు వసూలు చేశారు. సంబంధిత శాఖాధికారుల అనుమతి లేకుండానే తొలి విడతగా 25 మంది రైతుల పొలాల్లో జేసీబీతో రాళ్లు, గుట్టలు తొలగించినట్లు నివేదికలు తయారు చేసి, బిల్లుల కోసం డ్వామా కార్యాలయానికి పంపారు. డ్వామా నుంచి విడుదలైన సుమారు రూ.2 లక్షల పైచిలుకు సబ్సిడీ సొమ్ము బీరప్ప బ్యాంకు ఖాతా (విజయబ్యాంకు /నం.402801011004937 )లో జమ అయినట్లు రైతులు చెబుతున్నారు. ఇందుకు డ్వామా అధికారులు కూడా సహకరిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా మిగిలిన 225 మంది రైతుల పొలాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లు కూడా విడుదల చేయాలని డ్వామా అధికారులపై ఒత్తిడి కూడా తెస్తున్నట్లు తెలిసింది. వీరి అక్రమాల వల్ల తాము రెండు విధాల నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావల్సిన సబ్సిడీ రాకపోగా, ప్రెసిడెంట్, అతని బంధువు బీరప్ప మాటలు నమ్మి చెల్లించిన డబ్బు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనుమతి లేకున్నా పనులు చేశారు.. పులగుట్టపల్లిలో వాటర్‌షెడ్ పథకం కింద 250 మంది రైతుల పొలాల్లో అనుమతులు లేకుండానే పనులు చేసింది వాస్తవమే. పనుల కోసం ఎంపిక చేసిన 250 మంది రైతుల జాబ్‌కార్డులను పరిశీలించగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడటంతో పనులు చేయొద్దని సింగిల్ విండో ప్రెసిడెంట్, అతని అనుచర వర్గానికి చెప్పాము. అయినా సదరు సింగిల్ విండో ప్రెసిడెంట్ అనుమతులను తమ ఎమ్మెల్యే ద్వారా తెప్పించుకుంటానని పనులు చేశాడు. - శ్రీనివాసులు, ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా అనుమతి లభించింది.. గ్రామానికి చెందిన 250 మంది రైతుల పొలాల్లో వాటర్‌షెడ్ పథకం కింద రాళ్లు, గుట్టలు తొలగింపు పనులకు దరఖాస్తు చేసుకోగా 126 మంది రైతుల పొలాల్లో పనులు చేసేందుకు అనుమతి లభించింది. రైతుల ఖాతాల్లోని నిధులు కాజేశామనడంలో నిజం లేదు. పనులకు సంబంధించి జేసీబీ నిర్వాహకులకు రైతులు డబ్బు చెల్లించాల్సి ఉంది. రైతులు చెల్లించని పక్షంలో జేసీబీ నిర్వాహకుల ఖాతాల్లో ఆ డబ్బు జమ అవుతుంది. - పాల మల్లికార్జున, సింగిల్ విండో ప్రెసిడెంట్ 26జిటిఎల్501సి– అనుమతి లేకున్నా పులగుట్టపల్లి రైతు పొలంలో జేసీబీతో రాళ్లు తొలగించిన దృశ్యం -
వాటర్‌షెడ్ పనుల పరిశీలించిన కలెక్టర్
హుస్నాబాద్‌రూరల్: నాబార్డు సహకారంతో పనికిరాని భూములు సాగుకు యోగ్యంగా మారడం సంతోషకరమని కలెక్టర్ నీతూకుమారి అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలం కుందనపల్లిలో నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్ పనులను ఆమె పరిశీలించారు. హరితహారంలో భాగంగా రైతుల భూముల్లో టేకు మొక్కలు నాటేందుకు నాబార్డు సహకారంతో ప్రకృతి ఎన్జీవో చొరవచూపుతుందన్నారు. గిరిజన రైతులకు ఆరుతడి పంటల విత్తనాలను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం రవిబాబు, ఎంపీపీ భూక్య మంగ, సర్పంచులు నిర్మల, స్వరూప,ఎంపీటీసీ స్వామిరెడ్డి, ప్రకృతి ఎన్జీవో సీఈవో జయశ్రీ, ప్రతి నిధులు కిరణ్, మోతిలాల్,ౖ రెతులు పాల్గొన్నారు. గీతా కార్మికుల ఉపాధి.. హరితహారంలో కర్జూర, ఈత వనాలను పెంచుటకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని కలెక్టర్ అన్నారు. జనగామలో కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రభుత్వ భూముల్లో ఈత, కర్జూర వనాలతో గీతాకార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య మంగ, నగరపంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీడీవో జి.రాంరెడ్డి, తహసీల్దార్ వాణి, ఏపీవో వేణు, ఏవో శ్రీనివాస్,సర్పంచులు ఈశ్వర్, ఉపసర్పంచ్ రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, షాబుద్దీన్ పాల్గొన్నారు. -
వాటర్‌షెడ్ డౌన్!
♦ ఏడాదిన్నరగా పైసా విదల్చని సర్కారు ♦ ఫలితంగా 293 ప్రాజెక్టుల్లో అటకెక్కిన 88,159 పనులు ♦ ఇతర ప్రాజెక్టుల్లోకి ఉద్యోగుల డిప్యూటేషన్ ♦ ఇప్పటికే 350 మంది ఉపాధిహామీ పథకంలోకి బదిలీ! సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వం వాటర్‌షెడ్ పథకానికి స్వస్తి పలికింది. ఈ మేరకు అంతర్గత సంకేతాలిచ్చిన సర్కారు.. ఆ ప్రాజెక్టు కింద సేవలందిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి బదలాయిస్తోంది. ‘ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుదాం.. భూగర్భజలాల వృద్ధితో సాగు విస్తీర్ణాన్ని పెంపొందిద్దాం’ అనే నినాదంతో తలపెట్టిన సమగ్ర వాటర్‌షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) భవిష్యత్తు సంకటంలో పడింది. ఏడాదిన్నరగా ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో పనులు అటకెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మూడోవంతు ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిపై ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. తాజాగా మిగిలిన ఉద్యోగులను ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థల ప్రాజెక్టు డెరైక్టర్లకు గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. 293 ప్రాజెక్టులపై ప్రభావం! రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్ మినహా ఎనిమిది జిల్లాల్లో సమగ్ర వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం కింద 293 ప్రాజెక్టులున్నాయి. వీటితోపాటు మరో 1,491 మైక్రో వాటర్షెడ్లు కొనసాగుతున్నాయి. ఒక్కో వాటర్ షెడ్ పరిధి లో కనిష్టంగా ఐదు గ్రామాలను క్లస్టర్‌గా పరిగణిస్తూ అక్కడ రాతి కట్టల నిర్మాణం, నీటి వృథాను అరికట్టేందుకు చెక్‌డ్యాం ల ఏర్పాటు, గులకరాళ్ల కట్టలు, ఇంకుడు గుంతల తవ్వకం, పశువుల కోసం నీటితొట్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి 293 వాటర్షెడ్ల పరిధిలో 1,586 గ్రామాల్లో 88,159 పనులను నిర్దేశించారు. ఇందుకుగాను రూ.430.06 కోట్లు అవసరమని ప్రణాళిక తయారు చేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాటర్‌షెడ్ కార్యక్రమాలు నిలిచిపోవడంతో అటు సిబ్బందికిసైతం పని లేకుండా పోయింది. ఆర్థిక సంవత్సరం ముగియడం.. కొత్తగా 2016-17 వార్షిక సంవత్సరం ప్రారంభం కావడం.. కరువు నేపథ్యంలో ఉపాధిహామీ పనులు ఊపందుకున్న తరుణంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదలాయింపునకు ఉపక్రమించింది. ఇందు లో భాగంగా వాటర్‌షెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను అవసరమైన చోట ఉపాధి పథకంలోకి మళ్లిస్తోంది. 350 మందికి డిప్యూటేషన్లు! రాష్ట్రంలో 293 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల్లో 1,955 మంది పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు ఉద్యోగులే. వాటర్‌షెడ్ పనులకు నిధులివ్వకపోవడంతో వీరిని క్రమంగా ఉపాధిహామీ పథకం కింద పనులకు డిమాండ్ ఉన్నచోటకు డిప్యూటేషన్ పద్ధతిలో పంపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని తాత్కాలిక డిప్యూటేషన్‌పై పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. డిప్యూటేషన్లకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్లు చర్యలు చే పట్టారు. అదేవిధంగా ఐడబ్ల్యూఎంపీ జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న 88 మంది అధికారులు, ఉద్యోగుల సంఖ్యను కూడా కుదిం చాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మరో పక్షం రోజు ల్లో ఉద్యోగులు, సిబ్బందికి డిప్యూటేషన్లకు సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. -
టీడీపీ మహిళా ఎంపీపీ కంటతడి
సామర్లకోట: సొంత పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ, మండల అధికారులు తనను చులకనగా చూస్తున్నారంటూ టీడీపీకి చెందిన ఓ మహిళ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేసింది. మండల సమావేశంలో కంటతడి పెట్టి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మండల సమావేశంలో ఎంపీపీ కొరత మార్త ప్రసంగించారు. ఈ సందర్భంగా సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తనను పట్టించుకోవటం లేదని...దళిత మహిళ అయినందునే అధికారులు చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఆమె తీవ్ర మనస్థాపనికి గురై సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయింది. -
భూగర్భ జలాల పెంపే లక్ష్యం
కర్నూలు(కలెక్టరేట్): భూగర్భ జలాల పెంపే ప్రధాన లక్ష్యంగా ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్లు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలను చేపట్టాలను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో వీటి ద్వారా ఎటువంటి పనులు చేపట్టాలనే అంశంపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్‌కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భూగర్భ జలాల అభివృద్ధి, మొక్కలు నాటి పెంచడం, వ్యవసాయం, మల్బరీ, ఫిషరీస్‌తో అనుసంధానం చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశుగ్రాసాల పెంపకం, పశువులకు నీటి తొట్ల నిర్మాణం వంటి పనులతో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భూగర్భ జలాల అభివృద్ధికి చెక్‌డ్యామ్‌లు, చెక్వాళ్లు, ఫాంఫాండ్లు, నీటి కుంటలు తదితర వాటిని పెద్ద ఎత్తున నిర్మించాలని వెల్లడించారు. చేలగట్లు, రోడ్ల వెంట మొక్కలు నాటి పెంచాలన్నారు. గ్రామం యూనిట్‌గా ఈ పనులన్నీ జరిగేలా చూడాలన్నారు. ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. హౌసింగ్‌లో 90 రోజుల పని దినాలను కల్పించాలని స్పష్టం చేశారు. పంటల కోత తర్వాత ఆరబెట్టుకునేందుకు డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు, గోదాములు కూడా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ హరినాథరెడ్డి, అదనపు పీడీ విశ్వనాథరెడ్డి, ఏపీడీలు, తదితరులు పాల్గొన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమాల అమలులో భాగస్వాములు కండి - ఎంపీటీసీ సభ్యులకు డ్వామా పీడీ పిలుపు కర్నూలు(కలెక్టరేట్): ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్ కార్యక్రమాల అమలులో ఎంపీటీసీ సభ్యులు భాగస్వాములు కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ హరినాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో డ్వామా హాల్లో వాటర్‌షెడ్ గ్రామాల ఎంపీటీసీ సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్లు, ఎన్ఆర్ఈజీఎస్లకు మంజూరు అవుతాయన్నారు.. ఈ నిధులను రాజకీయాలకు అతీతంగా వినియోగించుకుంటే గ్రామాలు అభివృద్ధి పథంలోకి వస్తాయన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు కలిసికట్టుగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్ల ద్వారా ఎటువంటి పనులు నిర్వహిస్తారు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఏ పనులకు అవకాశం ఉందో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీలు రసూల్, ఖాదర్ బాష, కోర్సు డెరైక్టర్ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
నత్తనడకన ‘మెగా వాటర్‌షెడ్’
ఒక్క పథకంతో ఊరు బాగుపడటమే కాకుండా మీ అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఆ పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెగా వాటర్‌షెడ్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్న పేదల ఆశలు అడియాసలవుతునాయి. మండల పరిధిలో 2010లో పథకం ప్రారంభం కాగా, ఇప్పటికీ 30 శాతం మేర కూడా అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల్లో పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ఈ పథకం అమలు, రెండు విడతల్లో నిధుల ఖర్చు, చేపట్టనున్న అభివృద్ధి పనుల గూర్చి అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మొదటి విడతతో రూ.ఐదు కోట్లతో నానక్‌నగర్, నందివనపర్తి, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో చెక్‌డ్యాంలు, రాతికట్టలు నిర్మిస్తామని, అలాగే కుల వృత్తిదారులకు రుణాలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహాలు అందజేస్తామని అధికారులు నమ్మబలకడంతో ఇక తమ బతుకులు బాగుపడినట్టేనని పేదలు ఆశించారు. అయితే చిన్న చిన్న చెక్‌డ్యాంలు, మొక్కలు నాటడం మినహా పనుల్లో పురోగతి లేకపోవడంతో వారంతా ఉసూరంటున్నారు. మరోపక్క మెగా వాటర్‌షెడ్ పథకం అక్రమాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల కమిటీల చైర్మన్లు విమర్శిస్తున్నారు. తమకు తెలియకుండానే చిన్నపాటి చెక్‌డ్యాంల నిర్మాణానికి కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలు సక్రమ నిర్వహణ లేక ఎండిపోతున్నాయి. రెండో విడతా అదే తీరు... మెగా వాటర్ షెడ్ మొదటి విడత పనులు పూర్తికాకుండానే హడావుడిగా రెండో విడత పనులు చేపట్టారు. ఐదు గ్రామాల్లో రూ.5.16 కోట్ల నిధులతో 4302 హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించడం ద్వారా పదివేల మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2012 జూలై 24న అప్పటి హోంమంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా చౌదర్పల్లి గ్రామానికి వెళ్లే దారిలో పనుల ప్రారంభానికి సంబంధించి శిలాఫలకం వేయించారు. ఏడాది దాటినా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. అభివృద్ధి పనుల్లో వేగం లేదు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చాల్సిన పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. కేవలం చెక్‌డ్యాంల నిర్మాణంతో సరిపెడుతూ మిగతా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పథకం రెండు విడతల్లో ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలి. - కలకొండ బీరప్ప, మెగావాటర్‌షెడ్ చైర్మన్, నక్కర్తమేడిపల్లి పనులు పర్యవేక్షిస్తా... వాటర్‌షెడ్ కింద చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల సత్వర పూర్తికి చర్యలు తీసుకుంటా. వాటర్ షెడ్ పథకం పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ పర్యటించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటా. పేదల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యేలా చూస్తా. - ఉష, ఎంపీడీఓ, యాచారం