అను‘మతి’లేని పనులు
అను‘మతి’లేని పనులు
Published Thu, Apr 27 2017 12:10 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
- పక్కదారి పట్టిన వాటర్‌షెడ్ పథకం
- డ్వామా నిధుల కాజేతకు తెలుగు తమ్ముళ్ల పన్నాగం
-రైతుల ఖాతాల్లోకి కాకుండా బినామీ జేబుల్లోకి నిధులు
గుంతకల్లు: మెట్ట రైతులకు సాగునీటి వసతి, బంజరు పొలాలను యోగ్యమైన సాగు భూములుగా మార్చేందుకు ఉద్దేశించిన వాటర్‌షెడ్ పథకం అధికార పార్టీ నాయకులకు, దళారులకు వరంగా మారింది. జిల్లా నీటి యాజమాన్యం సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాటర్‌షెడ్ పథకం మండలంలోని పులగుట్టపల్లిలో పక్కదారి పట్టింది.
వివరాల్లోకెళ్తే... ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు కల్గిన ప్రతి రైతు పొలంలో డ్వామా నిధులతో వంద క్యూబిక్ మీటర్ల మేర రాళ్లు, గుట్టలు తొలగించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ పోను ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ 10,500 , బీసీలకు రూ 9,500 బిల్లు మంజూరు చేస్తుంది. ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీ రైతులు రోజుకు 9 గంటలు, బీసీ రైతులు 8 గంటలు జేసీబీ సహాయంతో పని చేయించుకోవచ్చునన్న నిబంధన ఉంది. దీనిని సొమ్ము చేసుకోవాలని సింగిల్ విండో ప్రెసిడెంట్ పాల మల్లికార్జున, అతని సమీప బంధువు బీరప్ప పథకం రచించారు. పొలాల్లో రాళ్లు, గుట్టలు తొలగించి వ్యవసాయ యోగ్యం చేస్తామని నమ్మబలికి గ్రామానికి చెందిన దాదాపు 250 మంది రైతుల నుంచి ఒక్కొక్కరితో రూ.2 వేలు వసూలు చేశారు. సంబంధిత శాఖాధికారుల అనుమతి లేకుండానే తొలి విడతగా 25 మంది రైతుల పొలాల్లో జేసీబీతో రాళ్లు, గుట్టలు తొలగించినట్లు నివేదికలు తయారు చేసి, బిల్లుల కోసం డ్వామా కార్యాలయానికి పంపారు. డ్వామా నుంచి విడుదలైన సుమారు రూ.2 లక్షల పైచిలుకు సబ్సిడీ సొమ్ము బీరప్ప బ్యాంకు ఖాతా (విజయబ్యాంకు /నం.402801011004937 )లో జమ అయినట్లు రైతులు చెబుతున్నారు. ఇందుకు డ్వామా అధికారులు కూడా సహకరిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా మిగిలిన 225 మంది రైతుల పొలాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లు కూడా విడుదల చేయాలని డ్వామా అధికారులపై ఒత్తిడి కూడా తెస్తున్నట్లు తెలిసింది. వీరి అక్రమాల వల్ల తాము రెండు విధాల నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావల్సిన సబ్సిడీ రాకపోగా, ప్రెసిడెంట్, అతని బంధువు బీరప్ప మాటలు నమ్మి చెల్లించిన డబ్బు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అనుమతి లేకున్నా పనులు చేశారు..
పులగుట్టపల్లిలో వాటర్‌షెడ్ పథకం కింద 250 మంది రైతుల పొలాల్లో అనుమతులు లేకుండానే పనులు చేసింది వాస్తవమే. పనుల కోసం ఎంపిక చేసిన 250 మంది రైతుల జాబ్‌కార్డులను పరిశీలించగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడటంతో పనులు చేయొద్దని సింగిల్ విండో ప్రెసిడెంట్, అతని అనుచర వర్గానికి చెప్పాము. అయినా సదరు సింగిల్ విండో ప్రెసిడెంట్ అనుమతులను తమ ఎమ్మెల్యే ద్వారా తెప్పించుకుంటానని పనులు చేశాడు.
- శ్రీనివాసులు, ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా
అనుమతి లభించింది..
గ్రామానికి చెందిన 250 మంది రైతుల పొలాల్లో వాటర్‌షెడ్ పథకం కింద రాళ్లు, గుట్టలు తొలగింపు పనులకు దరఖాస్తు చేసుకోగా 126 మంది రైతుల పొలాల్లో పనులు చేసేందుకు అనుమతి లభించింది. రైతుల ఖాతాల్లోని నిధులు కాజేశామనడంలో నిజం లేదు. పనులకు సంబంధించి జేసీబీ నిర్వాహకులకు రైతులు డబ్బు చెల్లించాల్సి ఉంది. రైతులు చెల్లించని పక్షంలో జేసీబీ నిర్వాహకుల ఖాతాల్లో ఆ డబ్బు జమ అవుతుంది.
- పాల మల్లికార్జున, సింగిల్ విండో ప్రెసిడెంట్
26జిటిఎల్501సి– అనుమతి లేకున్నా పులగుట్టపల్లి రైతు పొలంలో జేసీబీతో రాళ్లు తొలగించిన దృశ్యం
Advertisement