నత్తనడకన ‘మెగా వాటర్‌షెడ్’
Published Mon, Aug 5 2013 1:08 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
ఒక్క పథకంతో ఊరు బాగుపడటమే కాకుండా మీ అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఆ పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెగా వాటర్‌షెడ్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్న పేదల ఆశలు అడియాసలవుతునాయి. మండల పరిధిలో 2010లో పథకం ప్రారంభం కాగా, ఇప్పటికీ 30 శాతం మేర కూడా అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల్లో పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ఈ పథకం అమలు, రెండు విడతల్లో నిధుల ఖర్చు, చేపట్టనున్న అభివృద్ధి పనుల గూర్చి అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
మొదటి విడతతో రూ.ఐదు కోట్లతో నానక్‌నగర్, నందివనపర్తి, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో చెక్‌డ్యాంలు, రాతికట్టలు నిర్మిస్తామని, అలాగే కుల వృత్తిదారులకు రుణాలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహాలు అందజేస్తామని అధికారులు నమ్మబలకడంతో ఇక తమ బతుకులు బాగుపడినట్టేనని పేదలు ఆశించారు. అయితే చిన్న చిన్న చెక్‌డ్యాంలు, మొక్కలు నాటడం మినహా పనుల్లో పురోగతి లేకపోవడంతో వారంతా ఉసూరంటున్నారు. మరోపక్క మెగా వాటర్‌షెడ్ పథకం అక్రమాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల కమిటీల చైర్మన్లు విమర్శిస్తున్నారు. తమకు తెలియకుండానే చిన్నపాటి చెక్‌డ్యాంల నిర్మాణానికి కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలు సక్రమ నిర్వహణ లేక ఎండిపోతున్నాయి.
రెండో విడతా అదే తీరు...
మెగా వాటర్ షెడ్ మొదటి విడత పనులు పూర్తికాకుండానే హడావుడిగా రెండో విడత పనులు చేపట్టారు. ఐదు గ్రామాల్లో రూ.5.16 కోట్ల నిధులతో 4302 హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించడం ద్వారా పదివేల మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2012 జూలై 24న అప్పటి హోంమంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా చౌదర్‌పల్లి గ్రామానికి వెళ్లే దారిలో పనుల ప్రారంభానికి సంబంధించి శిలాఫలకం వేయించారు. ఏడాది దాటినా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు.
అభివృద్ధి పనుల్లో వేగం లేదు
వేలాది మందికి ప్రయోజనం చేకూర్చాల్సిన పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. కేవలం చెక్‌డ్యాంల నిర్మాణంతో సరిపెడుతూ మిగతా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పథకం రెండు విడతల్లో ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
- కలకొండ బీరప్ప, మెగావాటర్‌షెడ్ చైర్మన్, నక్కర్తమేడిపల్లి
పనులు పర్యవేక్షిస్తా...
వాటర్‌షెడ్ కింద చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల సత్వర పూర్తికి చర్యలు తీసుకుంటా. వాటర్ షెడ్ పథకం పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ పర్యటించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటా. పేదల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యేలా చూస్తా.
- ఉష, ఎంపీడీఓ, యాచారం
Advertisement
Advertisement