properly
-
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
-
దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా
దానిమ్మ కాయ గురించి తెలియని వారు వుండరు. అనేక ఔషధ లక్షణాలను తనలోదాచుకున్న దానిమ్మ అంటే ఇష్టం పడనివారు దాదాపు ఎవరూ వుండరు. ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ జ్యూస్‌ను సేవిస్తే..రక్తహీనత నుంచి బయటపడవచ్చని వైద్యులు చెపుతారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అయితే.. దానిమ్మ కాయలు వలవడం అంటే అంత సులువు కాదు. కొంచెం కష్టపడాల్సిందే. దానిమ్మ గింజలు చితికిపోకుండా, దుస్తుల మీద గింజల రసం పడకుండా.. జాగ్రత్తగా ఒలవాలి. ఎందుకంటే.. దానిమ్మ రసం దుస్తుల మీద పడితే... ఆ మరకలు ఒక పట్టాన పోవు. దీంతో దానిమ్మ గింజలు ఒలవడం అంటే ఓర్పు, నేర్పూ వుండాలి. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా దానిమ్మగింజలు ఒలిచే విధానంపై ఒక వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి సులభమైన ఆ విధానం కథా కమామిషు ఏంటో మీరు కూడా ఒకసారి వీక్షించండి.. ఇప్పటికే చూశారా.. అయినా మరోసారి చూసేయండి! -
ఐసీడీఎస్‌లో అక్రమాల పరీక్ష
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆదివారం జరిగిన రాత పరీక్షల్లో భారీ అక్రమాలు, అవినీతి జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 252 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 3422 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 4న పరీక్ష జరగాల్సి ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా వేశారు. తర్వాత ఈ నెల 27(ఆదివారం)న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో పరీక్షను వాయిదా వేస్తారని భావించినా పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నట్లు శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు. దాంతో అభ్యర్థులు వ్యయ, ప్రయాసలతో విశాఖపట్నం చేరుకున్నారు. కొందరికి పరీక్ష కేంద్రాలు మార్చినట్లు ప్రకటించడంతో వాటిని వెతుక్కుంటూ ఎలాగోలా చేరారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే ఎందువల్లనో 45 నిమిషాల తర్వాత పరీక్షను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటికే పరీక్ష రాస్తున్న అభ్యర్థుల నుంచి సమాధాన పత్రాలు, ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను వెనక్కి తీసుకున్నారు. దాదాపు సగం పరీక్ష రాసిన తర్వాత వాయిదా వేయడంపై అధికారులు పొంతన లేని వివరణలు ఇస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష నిర్వహించినప్పుడు ఉదయం ఇచ్చిన ప్రశ్నపత్రమే ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం మూడు ప్రశ్నపత్రాలు ఉన్నాయని, ఉదయం ఇచ్చినది కాకుండా వేరే సెట్ ఇచ్చామని చెబుతున్నారు. ఒకవేళ సెట్ మార్చిన కొన్ని ప్రశ్నలైనా ఉదయం ఇచ్చిన సెట్లోనివే ఉంటాయని అభ్యర్థులు అంటున్నారు. కాగా నిబంధనలు ప్రకారం ఒకే ప్రాజెక్టులో పనిచేస్తున్న వారికి జంబ్లింగ్ విధానం ద్వారా వేర్వేరు పరీక్షా కేంద్రాలు కేటాయించాల్సి ఉంది. దీన్ని అధికారులు తుంగలో తొక్కారు. టెక్కలి ప్రాజెక్టులో పనిచేస్తున్న ముగ్గురు సూపర్వైజర్లకు విశాఖ రైల్వే కాలనీలోని పాఠశాలను కేటాయించడమే కాకుండా ముగ్గురికీ రూమ్ నెంబరు 6నే కేటాయించారు. వీరు ముగ్గురు ఒకే వరుసలో కూర్చోవడాన్ని మిగతా అభ్యర్థులు తప్పుపడుతున్నారు. ఈ కేంద్రంతో పాటు మరికొన్నింటికి కొందరు ఐసీడీఎస్ అధికారులు, ఉద్యోగులు వచ్చి పలువురు అభ్యర్థులకు యథోచితంగా సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు అభ్యర్థులు తమకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని, పలానా వారికి ఇంత మొత్తం ఇచ్చామని ముందునుంచే చెబుతండటం విశేషం. ఇటువంటి వారికి రాత పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు వచ్చే అవకాశం ఉండడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. అవినీతి అక్రమాల మధ్య జరిగిన పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ రీజనల్ డెరైక్టర్ అనసూయ వద్ద ప్రస్తావించగా ఒకే ప్రాజెక్టుకు చెందిన వారిని ఒకే కేంద్రంలో వరుసగా కూర్చోబెట్టిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉదయం పరీక్షను మధ్యాహ్నానికి వాయిదా వేశామన్నారు. -
నత్తనడకన ‘మెగా వాటర్‌షెడ్’
ఒక్క పథకంతో ఊరు బాగుపడటమే కాకుండా మీ అందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఆ పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెగా వాటర్‌షెడ్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్న పేదల ఆశలు అడియాసలవుతునాయి. మండల పరిధిలో 2010లో పథకం ప్రారంభం కాగా, ఇప్పటికీ 30 శాతం మేర కూడా అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల్లో పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ఈ పథకం అమలు, రెండు విడతల్లో నిధుల ఖర్చు, చేపట్టనున్న అభివృద్ధి పనుల గూర్చి అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మొదటి విడతతో రూ.ఐదు కోట్లతో నానక్‌నగర్, నందివనపర్తి, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో చెక్‌డ్యాంలు, రాతికట్టలు నిర్మిస్తామని, అలాగే కుల వృత్తిదారులకు రుణాలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహాలు అందజేస్తామని అధికారులు నమ్మబలకడంతో ఇక తమ బతుకులు బాగుపడినట్టేనని పేదలు ఆశించారు. అయితే చిన్న చిన్న చెక్‌డ్యాంలు, మొక్కలు నాటడం మినహా పనుల్లో పురోగతి లేకపోవడంతో వారంతా ఉసూరంటున్నారు. మరోపక్క మెగా వాటర్‌షెడ్ పథకం అక్రమాలకు నిలయంగా మారిందని ఆయా గ్రామాల కమిటీల చైర్మన్లు విమర్శిస్తున్నారు. తమకు తెలియకుండానే చిన్నపాటి చెక్‌డ్యాంల నిర్మాణానికి కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలు సక్రమ నిర్వహణ లేక ఎండిపోతున్నాయి. రెండో విడతా అదే తీరు... మెగా వాటర్ షెడ్ మొదటి విడత పనులు పూర్తికాకుండానే హడావుడిగా రెండో విడత పనులు చేపట్టారు. ఐదు గ్రామాల్లో రూ.5.16 కోట్ల నిధులతో 4302 హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించడం ద్వారా పదివేల మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2012 జూలై 24న అప్పటి హోంమంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా చౌదర్పల్లి గ్రామానికి వెళ్లే దారిలో పనుల ప్రారంభానికి సంబంధించి శిలాఫలకం వేయించారు. ఏడాది దాటినా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. అభివృద్ధి పనుల్లో వేగం లేదు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చాల్సిన పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. కేవలం చెక్‌డ్యాంల నిర్మాణంతో సరిపెడుతూ మిగతా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పథకం రెండు విడతల్లో ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలి. - కలకొండ బీరప్ప, మెగావాటర్‌షెడ్ చైర్మన్, నక్కర్తమేడిపల్లి పనులు పర్యవేక్షిస్తా... వాటర్‌షెడ్ కింద చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల సత్వర పూర్తికి చర్యలు తీసుకుంటా. వాటర్ షెడ్ పథకం పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ పర్యటించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటా. పేదల సంక్షేమానికి ఉద్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యేలా చూస్తా. - ఉష, ఎంపీడీఓ, యాచారం