శ్రీకాకుళం, న్యూస్‌లైన్: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆదివారం జరిగిన రాత పరీక్షల్లో భారీ అక్రమాలు, అవినీతి జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 252 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 3422 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 4న పరీక్ష జరగాల్సి ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా వేశారు. తర్వాత ఈ నెల 27(ఆదివారం)న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో పరీక్షను వాయిదా వేస్తారని భావించినా పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నట్లు శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు.
దాంతో అభ్యర్థులు వ్యయ, ప్రయాసలతో విశాఖపట్నం చేరుకున్నారు. కొందరికి పరీక్ష కేంద్రాలు మార్చినట్లు ప్రకటించడంతో వాటిని వెతుక్కుంటూ ఎలాగోలా చేరారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే ఎందువల్లనో 45 నిమిషాల తర్వాత పరీక్షను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అప్పటికే పరీక్ష రాస్తున్న అభ్యర్థుల నుంచి సమాధాన పత్రాలు, ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను వెనక్కి తీసుకున్నారు. దాదాపు సగం పరీక్ష రాసిన తర్వాత వాయిదా వేయడంపై అధికారులు పొంతన లేని వివరణలు ఇస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష నిర్వహించినప్పుడు ఉదయం ఇచ్చిన ప్రశ్నపత్రమే ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం మూడు ప్రశ్నపత్రాలు ఉన్నాయని, ఉదయం ఇచ్చినది కాకుండా వేరే సెట్ ఇచ్చామని చెబుతున్నారు. ఒకవేళ సెట్ మార్చిన కొన్ని ప్రశ్నలైనా ఉదయం ఇచ్చిన సెట్‌లోనివే ఉంటాయని అభ్యర్థులు అంటున్నారు. కాగా నిబంధనలు ప్రకారం ఒకే ప్రాజెక్టులో పనిచేస్తున్న వారికి జంబ్లింగ్ విధానం ద్వారా వేర్వేరు పరీక్షా కేంద్రాలు కేటాయించాల్సి ఉంది. దీన్ని అధికారులు తుంగలో తొక్కారు. టెక్కలి ప్రాజెక్టులో పనిచేస్తున్న ముగ్గురు సూపర్‌వైజర్లకు విశాఖ రైల్వే కాలనీలోని పాఠశాలను కేటాయించడమే కాకుండా ముగ్గురికీ రూమ్ నెంబరు 6నే కేటాయించారు. వీరు ముగ్గురు ఒకే వరుసలో కూర్చోవడాన్ని మిగతా అభ్యర్థులు తప్పుపడుతున్నారు.
ఈ కేంద్రంతో పాటు మరికొన్నింటికి కొందరు ఐసీడీఎస్ అధికారులు, ఉద్యోగులు వచ్చి పలువురు అభ్యర్థులకు యథోచితంగా సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు అభ్యర్థులు తమకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని, పలానా వారికి ఇంత మొత్తం ఇచ్చామని ముందునుంచే చెబుతండటం విశేషం. ఇటువంటి వారికి రాత పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు వచ్చే అవకాశం ఉండడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. అవినీతి అక్రమాల మధ్య జరిగిన పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ రీజనల్ డెరైక్టర్ అనసూయ వద్ద ప్రస్తావించగా ఒకే ప్రాజెక్టుకు చెందిన వారిని ఒకే కేంద్రంలో వరుసగా కూర్చోబెట్టిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉదయం పరీక్షను మధ్యాహ్నానికి వాయిదా వేశామన్నారు.