శ్రీకాకుళం కలెక్టరేట్/టెక్కలి, న్యూస్‌లైన్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. గత రెండు నెల ల్లో శ్రీకాకుళం టౌన్‌లో ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ఇద్దరు కానిస్టేబుళ్లు, శ్రీకాకుళం, పాలకొండ మున్సి పల్ కమిషనర్లు ఇద్దరు అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కారు. తాజాగా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్న కోటబొమ్మాళి సీడీపీవో కె.ఉమాదేవి లంచం తీసుకుంటూ ఏసీబీకి శుక్రవారం చిక్కారు. ఆమెతో పాటు భర్త కొండయ్యరాజు కూడా అవినీతిలో భాగస్వామ్యం కావడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోటబొమ్మాళి సీడీపీవో కార్యాలయంలో ఆమెకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీడీపీవో ఉమాదేవి అవినీతిపై ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయ నగరం సీఐలు ఆజాద్, లక్ష్మణ్‌జీ, రమేష్‌లు ఆపరేషన్ నిర్వహించారు.
ఇలా పట్టుబడ్డారు
కోటబొమ్మాళి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పు, ఇతర ఆహార పదార్థాలను స్వరాజ్‌మ్యాజిక్ వాహనంలో రవాణా చేసేందుకు నెలకు రూ 21,500 వంతున చెల్లించేందుకు కోటబొమ్మాళికి చెందిన తంగుడు సునీల్‌కుమార్‌తో సీడీపీవో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది నెలలుగా ఆయన సరుకులను రవాణా చేస్తున్నారు. అయితే, అద్దెను బడ్జెట్ ఉన్నమేరకు రెండు నెలల కోసారి చెల్లించాలి. సీడీపీవో ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించకుండా తిప్పుతున్నారు. దీంతో అద్దెబకాయి రూ.లక్షా 72 వేలకు చేరుకుంది. బిల్లు చెల్లించాలంటే కొంత ఖర్చు అవుతుందని చెబుతూ ఆమె వాయిదాలు వేస్తూ వచ్చారు. కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన సునీల్‌కుమార్ ఖర్చులు చెల్లిస్తానని చెప్పడంతో సీడీపీవో మొదట రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. పలుమార్లు బిల్లుల కోసం తిరిగితిరిగి విసిగిపోయిన సునీల్ ఈ నెల 19న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పౌడర్ చల్లిన రూ 15 వేలును ఆయనకు ఇచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని విశాఖ-బి కాలనీలో ఉన్న సీడీపీవో ఉమాదేవి ఇంటికి వెళ్లి ఆయన నగదును అంద జేశారు. తీసుకున్న నగదును భద్రపరచాలంటూ ఉమాదేవి తన భర్త కొండయ్యరాజుకు అందజేసింది. ఆయన భద్రపరిచేందుకు ముందే ఏసీబీ అధికారులు ఇంట్లోకి చొరబడి కొండయ్యరాజును, ఉమాదేవిని పట్టుకున్నారు.
కొండయ్యరాజు కూడా వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కావడంతో ఇద్దరిపైనా కేసు నమోదుచేశారు. అక్కడి నుంచి కోటబొమ్మాళి సీడీపీవో కార్యాలయానికి వారిని తీసు కెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీడీపీవో పట్టుబడ్డ వార్త జిల్లా వ్యాప్తంగా దావానంలా వ్యాపిం చడంతో నియోజకవర్గంలోని ఐసీడీఎస్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. ఇటీవల అంగన్‌వాడీలో అక్రమాలపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురి తమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అవినీతి పరులు పట్టబడడంతో అందరిలోనూ ఇదే చర్చ సాగింది.
ఫిర్యాదు మేరకే దాడులు
సీడీపీవో అవినీతిపై వచ్చిన ఫిర్యాదు మేరకే దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. రెండు రోజుల్లో రూపొందించిన పథకం ప్రకారం పౌడర్ చల్లిన డబ్బును సునీల్‌కుమార్ చేత పంపించామని, ఆమె తీసుకొని భర్త ద్వారా భద్రపరుస్తుండగా పట్టుకున్నట్టు వెల్లడించారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అవినీతి, లంచగొండి తనం జరిగితే తమ దృష్టికి తేవాలని కోరారు.
ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ సీడీపీవో
Published Sat, Nov 23 2013 3:21 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement