వాటాల పంట | The stock of shares | Sakshi
Sakshi News home page

వాటాల పంట

Published Mon, Jul 10 2017 11:22 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

వాటాల పంట - Sakshi

వాటాల పంట

  • వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో అక్రమాల వరద
  • టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు
  • నాసిరకం, అవసరం లేని చోట పనులు చేపట్టి నిధుల స్వాహా
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక పెచ్చుమీరిన అవినీతి
  • రూ.4.45 కోట్ల పనుల్లో అడుగడుగునా డొల్లతనమే
  • కొన్ని పనులకు రికార్డులే కరువు 
  •  

    ఇక్కడ కన్పిస్తున్న కల్లం తట్రకల్లు గ్రామ సమీపంలోనిది. వాస్తవానికి రైతులకు అందుబాటులో.. అనువైన చోట కల్లాలు నిర్మించాల్సి ఉంది. కానీ అధికారులు అనువుకాని చోట ‘లెక్క’లేసుకుని ఎగుడుదిగుడున్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు.. గంజికుంట, బోడిసానిపల్లి, ఎన్‌ఎన్‌పీ తండా, రాగులపాడు, వజ్రకరూరులోనూ ఇదే పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో కానీ, రైతులందరి అనుమతితో కానీ ఒక ప్రదేశాన్ని గుర్తించి కల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇష్టారాజ్యంగా నిర్మించారు. పైగా వాటర్‌షెడ్‌ పరిధిలో కాకుండా ఇతర ప్రాంతంలోనూ నిర్మాణాలు చేపట్టారు. కొన్ని కల్లాలను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా అధికార పార్టీ నేతలకు చెందిన పొలాల్లో నిర్మించి బిల్లు చేసుకోవడం గమనార్హం.

    అనంతపురం టౌన్‌:

    దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు కుమ్మక్కై అక్రమాల వరద పారించారు. గ్రామ అవసరాల కోసం కాకుండా తమ స్వార్థంతో పనులు చేపట్టి అందినకాడికి దోచుకున్నారు. నాసిరకం నిర్మాణాలతో నిధులు స్వాహా చేశారు. వజ్రకరూరు మండలంలోని ఆరు పంచాయతీల్లో ఎక్కడ పరిశీలించినా నాణ్యత నవ్వుతోంది. చెక్‌డ్యాం, ఫారంపాండ్స్‌లో నిబంధనలకు పాతరేశారు. అసలు కొన్ని పనులకు లెక్కా జమా లేదంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సామాజిక తనిఖీ బృందం కూడా తూతూమంత్రంగా పనులు పరిశీలించినట్లు స్పష్టమవుతోంది.

     

    రూ.5.48 కోట్లతో వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు

    వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం(ఐడబ్ల్యూఎంపీ) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 2009–10 మొదటి బ్యాచ్‌ కింద వజ్రకరూరు మండలంలోని ఎన్‌ఎన్‌పీ తండా, రాగులపాడు, తట్రకల్లు, వజ్రకరూరు, బోడిసానిపల్లి, గంజికుంట గ్రామాల్లో వాననీటి సంరక్షణ చేపట్టి భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో 4568 హెక్టార్లలో వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందుకోసం రూ.548.16 లక్షలు కేటాయించగా గత ఏడాది సెప్టెంబర్‌ నాటికే ప్రాజెక్ట్‌ కాల వ్యవధి ముగిసింది. మొత్తం రూ.444.56 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

     

    అందినంత దోచుడే..

    ప్రాజెక్టు పరిధిలోని ఏ గ్రామంలో చూసినా ‘దోచుడు’ వ్యవహారమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాల ప్రణాళిక రచించి పక్కాగా అమలు చేశారు. 2014 నుంచి ఏకంగా రూ.295.03 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో ఐడబ్ల్యూఎంపీ నిధులు 185.27 లక్షలు, ఉపాధి హామీ నిధులు రూ.109.76 లక్షలతో పనులు చేపట్టారు. ఆయా గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, వాటర్‌షెడ్‌ అధికారులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పనులు నాసిరకంగా నిర్వహించారు. నిబంధనల మేరకు ఫారంపాండ్స్‌ను కూలీలతో చేయించాల్సి ఉండగా.. యంత్రాలతో చేపట్టి బిల్లులు స్వాహా చేశారు. అవసరం లేని చోట కొన్ని చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టారు. కొన్ని పనులు కేవలం కాగితాల్లో మినహా క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. గ్రామ అవసరాల కోసం చేయాల్సిన పనుల్లోనూ చేతివాటం చూపి సొంత లాభం చూసుకున్నారు. ఈ కారణంగానే ఇటీవల సామాజిక తనిఖీలు చేపట్టగా రికార్డులు కూడా సమర్పించలేదు.

     

    ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంతే..!

    వాటర్‌షెడ్‌ అమలు చేస్తున్న ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏ పని చేపట్టినా పనుల గుర్తింపు, ఎస్టిమేట్ల తయారీ, బిల్లుల చెల్లింపులన్నీ డబ్ల్యూసీసీ(వాటర్‌షెడ్‌ కంప్యూటర్‌ సెంటర్‌) పరిధిలోనే జరుగుతుండడం టీడీపీ నాయకులకు కలిసొచ్చింది. అధికారులు కూడా పనికింతని పర్సెంటేజీల రూపంలో దండుకున్నారు. బినామీ పేర్లతో బిల్లులు డ్రా చేసుకున్నారు. చేయని పనులు చేసినట్లు చూపి ‘వాటా’లు పంచుకున్నారు. పనుల వివరాలు నమోదు చేసేందుకు నకిలీ ఎం.బుక్కులు వినియోగించారు. నిబంధనల ప్రకారం ఎం.బుక్‌లలో అధికారి సంతకం, జారీ చేసిన నంబర్లు ఉంటాయి. కానీ ఇక్కడ చేసిన పనుల్లో అలాంటివేవీ కన్పించకపోవడం గమనార్హం. కొన్ని పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement