‘ఉపాధి’ నిధులతో ‘వైకుంఠధామాలు’
తొలి విడతలో 500 గ్రామాల్లో ఏర్పాటుకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వైకుంఠధామాల(శ్మశానవాటిక)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు వెచ్చించాలని నిర్ణయిచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతలో 500 గ్రామాల్లో వైకుంఠ థామాల ఏర్పాటుకు గ్రామీణాబివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తంగా తొలివిడతలో మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో వైకుంఠధామాల ఏర్పాటు నిమిత్తం మార్గదర్శకాలను సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఉపాధిహామీ చట్టంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కింద ఈ పనులను చేపట్టేందుకు వెసులుబాటు ఉందని ఆమె పేర్కొన్నారు.వైకుంఠధామాలకు ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, ఆయా గ్రామాల్లో జనాభాను బట్టి అంచనాల్లో కొంత మేరకు హెచ్చుతగ్గులు ఉండే వచ్చు. ఏదేని గ్రామంలో దాతలు ముందుకు వచ్చినట్లయితే, వైకుంఠ ధామం ఏర్పాటుకు రూ.5 లక్షలు లేదా వ్యయంలో 25 శాతం (ఏది ఎక్కువైతే అది) ఇచ్చినవారి పెద్దల లేదా తల్లిదండ్రుల స్మారకంగా పేరును పెట్టనున్నారు.
వైకుంఠ ధామం ఎలాగంటే..
ఒక్కో వైకుంఠధామంలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్‌రూమ్, సందర్శకులకు షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్‌హెడ్ ట్యాంక్, సోలార్‌లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపట్టనున్నారు. నీటి సరఫరా, ప్రహరీ, ఇతర పనులను గ్రామ పంచాయతీ లేదా ఇతర నిధులతో పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. స్థలం ఎంపిక నిమిత్తం రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని, గ్రామసభ ఆమోదం లభించాక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను సిద్ధం చేయించాలని ఉపాధిహామీ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.