‘ఉపాధి’ పనులు మధ్యాహ్నం వద్దు
♦ ఎండలో పనిచేస్తే కలిగేదుష్పరిణామాలను వివరించండి
♦ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతుండడంతో ప్రైవేట్ కంపెనీలు మిట్ట మధ్యాహ్నం కార్మికుల చేత పనులు చేయించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సోమవారం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు పనులు చేయకుండా చూడాలని, అలా పనిచేస్తే కలిగే దుష్పరిణామాల గురించి వారికి అవగాహన కల్పించాలంది. వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్యలను కొనసాగించాలని, వాటిని మరో మూడు వారాల తరువాత పర్యవేక్షిస్తామని చెప్పింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి
వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని, ప్రాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పిట్టల శ్రీశైలం హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ వడగాలుల బారిన పడకుండా ఉండేలా చూడటం ప్రభుత్వానికి సాధ్యం కాదని, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ...
ఉపాధి హామీ పథకం కూలీలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనిచేస్తున్నారని, దీనివల్ల వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్నారన్నారు. ఇలాంటి కూలీల విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సంజీవ్‌ను ధర్మాసనం కోరింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పను లు చేయాలని చెప్పడం లేదన్నారు. ఇలా ఎవరైనా పని చేయిస్తున్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీ ల్లో ఎండల్లో పని చేయిస్తుంటే వారి విషయం లో ఏం చేయబోతున్నారో తెలపాలంది.