నిలిచిపోయిన ఉపాధి హామీ చెల్లింపులు
ఫిబ్రవరి 12 నుంచి పెండింగ్
6 లక్షల మంది కూలీల ఎదురుచూపు
ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్న అధికారులు
హన్మకొండ అర్బన్ :గ్రామాల్లో కూలీలకు పని కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. కూలీలు పనులు చేసి నెలలు గడుస్తున్నా వారికి కూలి డబ్బులు చెల్లించడం లేదు. దీంతో రోజువారీ కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. 24గంటల్లో చెల్లింపులు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రసుతం 50రోజులు దాటినా కూలీలకు చెల్లింపులు చేయడం లేదు. డబ్బుల కోసం క్షేత్రస్థాయిలో కూలీలు ఆందోళనకు దిగుతున్నా సిబ్బంది, అధికారులు సర్ధిచెప్పి పనుల్లోకి తీసుకుంటున్నారు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో ఉపాధి హామీ కూలీల హాజరు శాతం కూడా తగ్గుతోంద ని క్షేత్రస్థాయి సిబ్బంది అంటున్నారు.
ఫిబ్రవరి 12నుంచి పెండింగ్
జిల్లాలో ఈ సంవత్సరం ఫిబ్రవరి తరువాత నిధులు రాకపోవడంతో అధికారులు కూలీలకు డబ్బులు చెల్లించలేదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 6.03లక్షల మంది కూలీలకు రూ.32.82 కోట్లు చెల్లింపులు చేయాల్సిఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాక పోవడం వల్లనే కూలి చెల్లించలేక పోతున్నామని అధికారులు అంటున్నారు. ఈ విషయంలో అధికారులు స్పష్టమైన తేదీ కూడా చెప్పే పరిస్థితి లేదు. జిల్లాలో 911గ్రామ పంచాతీల పరిధిలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా లక్ష మంది కూలీలు పనులకు హాజరయ్యారు.
నిధులు రాకనే చెల్లింపులు చేయలేదు డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి
ఫిబ్రవరి 12నుంచి బడ్జెట్ రాక కూలీలకు చెల్లింపులు చేయలేకపోయాం. సమస్యను ప్రభుత్వానికి ఎప్పటికప్పడు తెలియజేసున్నాం. నిధులు రాగానే చెల్లింపులు చేస్తాం. ప్రస్తుతం వేసవి తీవ్రత ఉన్న దృష్ట్యా ఉదయం మాత్రమే పనుల్లోకి వెళ్లాలని చెపుతున్నాం. పని ప్రదేశాల్లో అవసరమైన అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నాం.
పని కల్పించింది 41రోజులే..
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా 2015-16 సంవత్సరంలో కల్పించిన పనిదినాలు సరాసరిగా 41 రోజులే. రాష్ట్రం మొత్తంలో చూస్తే సగటు పని దినాలు 47 కాగా.. జిల్లాలో మాత్రం ఈ సంఖ్య 41 మాత్రమే ఉండటం గమనార్హం. జిల్లాలో పూర్తిగా 100 రోజుల పని 20,959 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. సంవత్సరంలో మొత్తం 5.90 లక్షల మంది కూలీలు పనులకు వచ్చారు. వీరికి మొత్తంగా 1.30కోట్ల పనిదినాలు అధికారులు కల్పించారు. ఇందుకోసం మొత్తం రూ.244.73కోట్లు చెల్లింపులు చేశారు.