కూలీల సొమ్ము ఏమాయె !
అనంతపురం టౌన్: వలసల్ని నివారించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారుతోంది. బినామీ ఖాతాలు తెరిచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు స్వాహా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నరేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.15 కోట్లకు పైగా ఉపాధి కూలి సొమ్ము ‘సస్పెండ్’ అయింది. సుమారు 95 వేల మంది కూలీలకు ఈ డబ్బు చెల్లించాల్సి ఉందని రికార్డుల్లో ఉన్నా అసలు కథ వేరేలా ఉంది. సగానికి పైగా కూలీల సొమ్మును బోగస్ అకౌంట్లలో వేసుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులు స్కెచ్ వేశారు. అయితే ‘ఆధార్’ అనుసంధానంతో ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టమవుతోంది. సస్పెండ్‌లో ఉన్న సొమ్మును క్లెయిం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది.
∙క్లెయిం చేసుకునేందుకు వెనుకంజ
గత ఏడాది డిసెంబర్ నుంచి ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలకు నేరుగా వేతనాలను జమ చేస్తున్నారు. పనులు చేస్తున్న కూలీలకు చెల్లించాల్సిన డబ్బు పక్కదారి పట్టకుండా తీసుకొచ్చిన ఈ విధానంతో అక్రమార్కులకు చెక్ పడగా.. నిజంగా పనులు చేసి తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాని కూలీలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. చాలా మంది కూలీలు తమ అవసరాల నిమిత్తం రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. ఎంసీసీ (మండల కంప్యూటర్ సెంటర్)ల్లో ఉపాధి కూలీకి సంబంధించి జాబ్‌కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతాలు ‘లింక్’ చేశారు. తద్వారానే పేమెంట్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది.
అయితే కూలీల ఖాతాల్లో నగదు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్‌లో ఆధార్ అనుసంధానం కావాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో చాలా మందికి వారాల తరబడి వేతనాలు అందడం లేదు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 94,839 మంది కూలీలకు సంబంధించి రూ.1567.57 లక్షల వేతనం సస్పెండ్‌లో ఉంది. ఇందులో 90 రోజులు పైబడి 52,216 మంది కూలీలకు చెందిన రూ.867.45 లక్షలు సస్పెండ్ అయింది. ఈ సొమ్ములో సగానికి పైగా బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే సొమ్మును క్లెయిం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
∙ఈ ఏడాది అదే పరిస్థితి
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోనే నగదు పడేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా 993 పంచాయతీల్లో పనులు చేసిన 49,056 మంది కూలీలకు చెందిన రూ.865.9 లక్షలు సస్పెండ్‌లోకి వెళ్లింది. ఇందులో 30 రోజుల్లోగా 32,204 మంది కూలీలకు సంబంధించి రూ.4.70 కోట్లు, 30 నుంచి 60 రోజుల్లోగా 8096 మంది కూలీలకు చెందిన రూ.157.31 లక్షలు, 60 నుంచి 90 రోజుల్లోపు 4647 మంది కూలీలకు గానూ 121.65 లక్షలు సస్పెండ్ అయింది.
90 రోజులకు పైబడి 4109 మంది కూలీలకు గానూ రూ.116.95 లక్షలు సస్పెండ్ అయ్యాయి. ఇందులో ఉపాధి హామీ కింద చేసిన పనులకు సంబంధించి ఏకంగా రూ.6 కోట్లకు పైగా సస్పెండ్ అయింది. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకుల్లో ‘ఆధార్’ అనుసంధానంలో జాప్యం వల్ల పడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆధార్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు అందాయి.