అవినీతి కొండంత.. రికవరీ గోరంత
తలుపుల మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో కోటి 16 లక్షల 25 వేల 362 రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. కానీ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు. నల్లమాడ మండలంలో రూ.10,27,239 అవినీతి జరిగింది. ఇక్కడా రూపాయి కూడా రికవరీ చేయలేదు. తరచూ సామాజిక తనిఖీలు చేపట్టి.. అవినీతి చోటుచేసుకున్నట్లు గుర్తిస్తున్నా రికవరీ చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. సదరు శాఖలోని కొందరు పెద్దల అండ ఉండటం వల్లే అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీ కావడం లేదన్నది బహిరంగ రహస్యం.
అనంతపురం టౌన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పథకం అమలులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. అక్రమాలను మాత్రం పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. సామాజిక తనిఖీలూ తూతూమంత్రంగా మారాయి. దీంతో అక్రమార్కులు సులువుగా తప్పించుకోగలుగుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో 2006 నుంచి అమలు చేస్తున్నారు.
వలసల నివారణే ధ్యేయంగా అమలు చేస్తున్న ఈ పథకం కూలీలకు ఏమో గానీ ఉపాధి హామీ సిబ్బందికి, అధికారులకు మాత్రం కల్పతరువుగా మారిందనే విమర్శలున్నాయి. ఉపాధి పనులపై జిల్లాలో ఇప్పటి వరకు ఆరు విడతల్లో సామాజిక తనిఖీ పూర్తయ్యింది. ప్రస్తుతం ఏడో విడత కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా రూ.16.97 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. దీని వెనుక ఎవరెవరి హస్తం ఉందనే విషయం కూడా బయటకు వచ్చింది. కానీ చర్యలు తీసుకోలేకపోతున్నారు. తిన్న సొమ్ములో కనీసం సగం కూడా రికవరీ చేయలేకపోతున్నారు.
ఇప్పటి వరకు రూ.1.12 కోట్లు మాత్రమే రికవరీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రికవరీ మొత్తం కంటే సామాజిక తనిఖీల పేరుతో చేస్తున్న ఖర్చే అధికంగా ఉంటోంది. ఉదాహరణకు.. పామిడి మండలంలో ఇప్పటి వరకు సామాజిక తనిఖీలకు రూ.1.40 లక్షలు ఖర్చు చేశారు. అక్రమార్కుల నుంచి రాబట్టింది మాత్రం రూ.16 వేలే. అవినీతికి పాల్పడిన వారికి కొంత మంది ఉన్నతాధికారుల అండదండలున్నందు వల్లే రికవరీ చేయడం సాధ్యం కావడం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాస్తవానికి క్రిమినల్ కేసులు నమోదు చేయించే అధికారం ఉన్నప్పటికీ ఆ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకోక పోవడంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
99 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు
ఇటీవల అక్రమాలకు పాల్పడిన 99 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పథకం ప్రారంభం నుంచి ఇంత పెద్దసంఖ్యలో వేటు పడడం ఇదే ప్రథమం. సస్పెన్షన్‌కు గురైన వారిలో షరీఫ్ (గుత్తి), మల్లేసు (బేతాపల్లి), రమేష్‌రెడ్డి (బేతాపల్లి), తిప్పారెడ్డి (ఊతకల్లు), సరస్వతి (మార్నెపల్లి, చెర్లోపల్లి), మస్తాన్ వలి (మామడూరు), సుంకన్న (అబ్బేదొడ్డి), ఆదినారాయణ (మామడూరు), లక్ష్మి కాంతప్ప (వన్నెదొడ్డి), రామకృష్ణ (కొత్తపేట), నాగరత్న (తురకపల్లి), రంగయ్య (కరిడికొండ), సుధాకర్నైలి (కురుమామిడి, పచారి మేకల తండా), బాలు నాయక్ (గుంటిపల్లి, వానవోలు), ఎర్రిస్వామి (పెనకచెర్ల), రామసుబ్బయ్య (కొప్పలకొండ), టి.అంజినాయక్ (కైరేవు), విజయ్ కుమార్ (అనుంపల్లి), నాగభూషణం (చెర్లోపల్లి, ఎంఎన్ హళ్లి), మల్లికార్జున (చిన్నంపల్లి), గంగాధర్ (బాచుపల్లి), నరసింహులు (కనుకూరు, మాచర్లపల్లి), గోవిందు (కైరేవు), సుదర్శన్ (శెట్టూరు), నారాయణ (శెట్టూరు), జగన్‌మోహన్‌రెడ్డి (నార్పల), బయన్న (గుంజేపల్లి), ఎస్.మంజుల (మాదాపురం), రమేష్ (నసనకోట), రమేష్‌నాయక్ (ఆర్‌బీవంక), భాస్కర్‌రెడ్డి (డీటీపల్లి), రామకృష్ణ (దిగువ చెర్లోపల్లి, టి.సదుం), మంజుల (తిమ్మసముద్రం, మంగలకుంట), పి.అరుణ (కళ్యాణదుర్గం), వనిత (కొత్తూరు), కె.వెంకటరమణ (ఏ.నారాయణపురం), లక్ష్మినారాయణ (రుద్రంపేట), రామకృష్ణారెడ్డి (పులిగుండ్లపల్లి), ఎర్రిస్వామి (కొనకండ్ల), శీనప్ప (లింగదహల్), వెంకటేశులు (కడదరబెంచి), సుబ్బయ్య (ఆత్మకూరు), రామాంజనేయులు (సీకే మంద), ధవచంద్రారెడ్డి (పెడపల్లి), మహేశ్వరరెడ్డి (కమలపాడు), బి.రవీంద్ర నాయక్ (పుప్పాల), సుబ్బయ్య (ఆత్మకూరు), అంజినప్ప (ఓరువాయి), రవీంద్ర (కె.పూలకుంట), దామోదర్ (ఎర్రగుంట), ఎం.హరికృష్ణ (కూడేరు), ఎం.మల్లికార్జున (మరుట్ల), బి.రమేష్ (మలకవేముల), సి.జయరాములు (పసులూరు), పి.చెన్నకేశవులు (తూముకుంట) ఉన్నారు.
రికవరీపై దృష్టి సారిస్తున్నాం
సామాజిక తనిఖీలలో తేలిన అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నాం. ఇప్పటికే బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాం. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు. దుర్వినియోగం చేసిన సొమ్మును రాబట్టే విషయంపై దృష్టి సారిస్తున్నాం. ఇప్పటి వరకూ పెద్దగా రికవరీ చేయలేకపోయాం. ఇక నుంచి అక్రమాలను పూర్తిగా అరికట్టడంతో పాటు రికవరీ పెంచుతాం.
- సంజయ్ ప్రభాకర్, ప్రాజెక్టు డెరైక్టర్, డ్వామా