ఈ ఏడాది చివరిలోగా నీళ్లిద్దాం | By the end of this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివరిలోగా నీళ్లిద్దాం

Published Sat, Feb 27 2016 2:33 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

ఈ ఏడాది చివరిలోగా నీళ్లిద్దాం - Sakshi

ఈ ఏడాది చివరిలోగా నీళ్లిద్దాం

♦ ‘మిషన్ భగీరథ’పై సమీక్షలో సీఎం కేసీఆర్
♦ రాష్ట్రంలోని చాలా వరకు గ్రామాలకు తాగునీరు అందించాలి
♦ ఏప్రిల్‌లో తొమ్మిది నియోజకవర్గాల్లో నీటి సరఫరా
♦ {sీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తికాగానే సరఫరా మొదలుపెట్టండి
♦ జెన్‌కో, ట్రాన్స్‌కో సమన్వయంతో వేగంగా పనులు జరగాలి
♦ ‘ఉపాధి హామీ’ కింద పైప్‌లైన్ల కందకాలు తవ్వే పనులు
♦ డిజైన్లు, అనుమతుల్లో జాప్యం చేయవద్దని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది చివరినాటికే రాష్ట్రంలో చాలా వరకు గ్రామాలకు తాగునీటిని అందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుని, వేగంగా పనులు చేయాలని సూచించారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలతో సమన్వయం కుదుర్చుకుని పంప్‌హౌజ్, పైప్‌లైన్లు తదితర పనులు చేయాలని... విద్యుత్ శాఖ అధికారులు కనీసం పది రోజుల పాటు మిషన్ భగీరథ పనుల్లో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తయిన చోట వెంటనే అక్కడి ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ పనుల పురోగతిపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎస్‌పీ సింగ్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సీఈలు, ఎస్‌ఈలు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రెండు విడతలుగా సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పైపులైన్ల నిర్మాణం తదితర పనులను సెగ్మెంట్ల వారీగా సమీక్షించారు. డిజైన్లు, అనుమతులు ఇవ్వడంలో జాప్యాన్ని నివారించాలని... అవాంతరాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి నాటికి రాష్ట్రంలోని తొమ్మిది నియోజకవర్గాలకు మంచినీరు అందించేందుకు జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్కడెక్కడ ఏయే పనులు పూర్తి చేయగలుగుతారు, నెలవారీగా ఎక్కడెక్కడ ఏమేం పనులు జరుగుతాయి అనే అంశాలపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు.

 ఖరీఫ్‌కు ముందే పైపులైన్లు
 రైతుల పొలాల గుండా వెళ్లే పైపులైన్ల నిర్మాణాన్ని ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యే జూన్‌లోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాకు  ఉపయోగించే పైపులైన్లు నాణ్యతతో ఉండాలని, రోగ కారకమైనందున సిమెంట్ పైపులైన్లను ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దని సూచించారు. పెద్ద ఎత్తున అవసరమయ్యే పైపులు, వాల్వ్‌లను సమకూర్చుకునేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని... రాష్ట్రంలోని కంపెనీలు పైపులైన్లు, వాల్వ్‌లు అందించే పరిస్థితి లేకుంటే దేశంలో ఉత్తమమైన సంస్థలకు పనులు ఇవ్వాలని చెప్పారు.

 ఉపాధి హామీతో తవ్వకాలు
 ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లతో పాటు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం వేగంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణానికి కందకాలు తవ్వే పనిని ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని సూచించారు. తాగునీటి పంపింగ్‌కు అవసరమయ్యే విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన తర్వాత వచ్చే పదేళ్ళ పాటు నిర్వహణ బాధ్యత వర్కింగ్ ఏజెన్సీలకే ఉంటుందని... నిర్ణీత కాలంలో పనులు పూర్తిచేసిన వారికిచ్చే 1.5 శాతం ఇన్సెంటివ్‌ను అందుకునేందుకు అన్ని వర్కింగ్ ఏజెన్సీలు ప్రయత్నించాలని పేర్కొన్నారు.
 
 ఐటీఐ ఫిట్టర్లకు ఉపాధి కల్పించాలి
 మిషన్ భగీరథ పనులకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని, ఇంజనీరింగ్ పనుల్లో సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులను ఉపయోగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. పైప్‌లైన్ ఫిట్టింగ్, కనెక్టింగ్ తదితర పనులు చేసే అవకాశాన్ని గ్రామాల్లో ఉండే ఐటీఐ పూర్తి చేసిన ఫిట్టర్లకు ఇవ్వాలని.. మంత్రులు, కలెక్టర్లు చొరవ తీసుకొని మండలాల వారీగా ఐటీఐ పూర్తి చేసిన వారి వివరాలు తీసుకోవాలని చెప్పారు. డిజైన్ల రూపకల్పనలో మరింత వేగం అవసరమని వ్యాప్కోస్ ప్రతినిధులకు సీఎం సూచించారు. 2016 చివరి నాటికి పూర్తయ్యే పనులకు సంబంధించిన డి జైన్లు వచ్చే నెలాఖరు నాటికి ఖరారు చేయాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement