ఎంపీడీఓపై ఉపాధి కూలీల దాడి
కొడంగల్: ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి తగిన కూలి ఇవ్వలేదని ఆరోపిస్తూ ఇన్‌చార్జి ఎంపీడీఓ వీరబ్రహ్మచారిపై కూలీలు దాడి చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో బుధవారం జరిగింది. పర్సాపూర్‌కి చెందిన సగం మంది కూలీలు ర్యాలపేట చెరువు మట్టిరోడ్డు పనులకు వెళ్లారు. వారం రోజుల పాటు పని చేశారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.10-12 మాత్రమే కూలి డబ్బులు వచ్చే విధంగా ఈజీఎస్ సిబ్బంది బిల్లులు తయారు చేశారు. దీంతో ఆగ్రహించిన కూలీలు బుధవారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు చావు డప్పు కొట్టుకుంటూ వచ్చారు.
ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకెళ్లారు. వీరబ్రహ్మచారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పర్సాపూర్‌కి చెందిన రామకృష్ణ, జీడీ మల్లేష్, సాకలి మల్లప్ప, జీడీ మొగులప్పలపై కేసు నమోదు చేశారు.