
కొత్త పార్టీ ఆలోచన లేదు: కోదండరాం
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనేమీ తనకు లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం చెప్పారు.
త్రిపురారం/నల్లగొండ టౌన్: రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనేమీ తనకు లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం చెప్పారు. తన సారథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై ఆయనీ వివరణ ఇచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా హాలియాలో విలేరుల సమావేశంలో, నల్లగొండలో జరిగిన టీపీటీఎఫ్ జిల్లా సదస్సు, పన్మాల గోపాల్‌రెడ్డి ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ఎడమ కాల్వ ఆధునీకరణ పేరుతో కాల్వకు ఇరువైపుల, లోపల సీసీ (సిమెంట్ కాంక్రీట్) లైనింగ్ చేయడం వల్ల భూమిలోకి నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయి, జలమట్టం గణనీయంగా తగ్గిందన్నారు. గ్రామాల్లో తాగునీరు, పశుగ్రాసం దొరక్కఇబ్బందిపడే పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.