సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. పార్టీ పేరు, నినాదాలు, విధివిధానాలు, గుర్తు తదితరాలు ప్రకటించేందుకు తేదీనీ ఖరారు చేశారు. మిలియన్ మార్చ్ జరిగిన మార్చి 10న భారీ బహిరంగసభ నిర్వహించి అట్టహాసంగా పార్టీని ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారు. మిలియన్ మార్చ్‌తో సమైక్య రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడినట్లే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం పునరంకితం అవుతామని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల రెండో వారంలోనే పార్టీ ప్రకటన, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ముందు భావించినా జేఏసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ రోజునే ప్రకటన చేయడం బాగుంటుందని కోదండరాం ఈ నిర్ణయం తీసుకున్నారు.
వేదిక ఎక్కడ...?
పార్టీ తొలి బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలో స్పష్టత రాలేదు. హైదరాబాద్‌లో నిర్వహించాలా లేక జిల్లాల్లోనా అనే అంశమై జేఏసీ ముఖ్యులు తర్జనభర్జన పడుతున్నారు. జేఏసీ నిర్వహించిన అమరుల స్ఫూర్తియాత్ర, భూ నిర్వాసితుల సభ, నిరుద్యోగ గర్జనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. కానీ రాజకీయపార్టీగా అవతరిస్తున్నందున బహిరంగ సభకు అవాంతరాలు కల్పించకపోవచ్చని నేతలు భావిన్నారు. తొలి సభను భారీగా, అట్టహాసంగా నిర్వహించేందుకు వరంగల్ అయితే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కోదండరాం కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసినట్లు నేతలు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో నిర్వహిస్తే అన్నివర్గాల దృష్టిని ఆకర్షించడంతోపాటు, మీడియా కేంద్రీకరణకూ అవకాశం ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అన్ని అంశాలు బేరీజు వేసుకుని సభా వేదిక నిర్ణయించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు.
పూర్తయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ
కోదండరాం అధ్యక్షుడుగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరును కోదండరాం ఖరారు చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక అవరోధాలు, ఇతర సమస్యలొచ్చినా అధిగమించేందుకు మరో 3 పేర్లనూ వివిధ నాయకుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, ప్రజా తెలంగాణ పార్టీ వంటి పేర్లూ రిజిస్టర్ చేసినట్లు పేర్కొంటున్నారు. పార్టీ విధివిధానాలు, నినాదాలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముఖ్యులతో కలసి అభిప్రాయాలు తీసుకుని తుది మెరుగులు దిద్దనున్నారు. పార్టీగా ప్రకటించడానికి ముందే జేఏసీ బాధ్యతల నుంచి కోదండరాం వైదొలుగుతారా, పార్టీ ప్రకటన తర్వాత బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారా స్పష్టతలేదు. పార్టీకి సారథ్యం వహించాల్సిన సమయంలో జేఏసీ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని కోదండరాం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment