జేఏసీ ర్యాలీకి అనుమతించాల్సిందే: పార్టీలు, సంఘాలు | must give permission to TJAC's Un Employees Rally: partys demands | Sakshi
Sakshi News home page

జేఏసీ ర్యాలీకి అనుమతించాల్సిందే: పార్టీలు, సంఘాలు

Published Tue, Feb 21 2017 2:51 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

must give permission to TJAC's Un Employees Rally: partys demands

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతి నిరాకరణపై పలు పార్టీలు, సంఘాలు సోమవారం మండిపడ్డాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనమేమన్నా నియంతృత్వంలో ఉన్నామా అని సీఎల్పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అనుమతి కోసం నిరుద్యోగులు కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితేమిటి? కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు సిగ్గుచేటు’’ అని విమర్శించారు. అనుమతివ్వకపోతే పరిణామాలకు కేసీఆర్‌దే బాధ్యతని హెచ్చరించారు. పోలీసులు కూడా విజ్ఞతతో వ్యవహరించాలన్నారు.

గతంలో ఎవరూ సభలు పెట్టని దూర ప్రదేశాల్లో సభ పెట్టుకోవాలని జేఏసీకి పోలీసులు సూచించడం నిరంకుశ ధోరణికి నిదర్శనమని సీపీఐ ధ్వజమెత్తింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని, లేదంటే వారికి నెలకు రూ.5 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలివ్వగలరో ఒక కేలండర్‌ను ప్రకటించి యువతలో ఆందోళన తగ్గించే చర్యలు చేపట్టాలంది. ఏ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందో, అవే విధానాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించడమే మిటంటూ సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ– చంద్రన్న నాయకుడు కె.గోవర్ధన్‌ తప్పుబట్టారు. ర్యాలీకి అనుమతివ్వాలని మానవ హక్కుల వేదిక ఉభయరాష్ట్రాల అధ్యక్షుడు ఎస్‌.జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్‌ కృష్ణ డిమాండ్‌ చేశారు. ర్యాలీకి సర్పంచుల ఐక్యవేదిక, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ మద్దతు ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement