తుర్కయాంజాల్: తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, బడుగు వర్గాల ఆకాంక్షల మేరకు త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్‌లోని సామ శ్రీనివాస్‌రెడ్డి గార్డెన్స్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై కోదండరాం అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సభలో ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ ఇటికెల పురుషోత్తం, జేఏసీ కన్వీనర్ కంచె రఘు, తీన్మార్ మల్లన్న, రైతులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
గత రెండు నెలలుగా జేఏసీ కమిటీలు గ్రామాల్లో పర్యటించి రైతాంగ సమస్యలపై రూపొందించిన నివేదికలను సభ ముందుంచారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారంలో మనవారే ఉంటారు.. సమస్యలను పరిష్కరించుకోవచ్చు’ అని అనుకున్న ప్రజలకు అందుకు భిన్నంగా నిరాశే మిగిలిందన్నారు.
అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. రైతు అంటే దేశానికి అన్నం పెట్టే వాడని, నేడు మార్కెట్లో రైతు పరిస్థితి బతిమిలాడుకునేలా తయారైందని, ఇది పాలకుల తప్పిదమని అన్నారు. న్యాయవాది రచనారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment