సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల్లో కదలిక మొదలైంది. అన్ని పార్టీల అధినాయకత్వం ఉనికి చాటుకునేలా అడుగులు వేస్తోంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. మరోవైపు సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తుండగా.. పార్టీలు దూకుడు పెంచాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం ప్రజాక్షేత్రంలో కార్యకలాపాలను విస్తృతం చేశాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణ ప్రభావం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ కనిపిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌లకు తిరిగి ఎందరికి టిక్కెట్లు వస్తాయన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాల్లో పొత్తుల అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) భవిష్యత్తుపైనా స్థానికంగా చర్చ జరుగుతోంది.
జనంలోకి అధికార పార్టీ నేతలు.. ‘ప్లీనరీ’ తర్వాత మరింత దూకుడు
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే పల్లెబాట పట్టారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఉమ్మడి జిల్లాలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల వద్ద ఏకరువు పెడుతున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చరిష్మాపై ఆశలు భారీగా ఉన్నప్పటికీ జనంలోకి వెళ్లకపోతే అసలు టిక్కెట్టుకే ఎసరు రావచ్చన్న భయం కొందరు ఎమ్మెల్యేలకు పట్టుకుంది. గతంలో కేసీఆర్ నాలుగు దఫాలుగా నిర్వహించిన పలు సర్వేల్లో వెనుకంజలో ఉన్నట్లు తేలిన పలువురిలో ఇప్పటికే ఆందోళన నెలకొంది. అధినేత పిలుపుమేరకు ప్రజాక్షేత్రంలో ఉండటమే మేలనుకుంటున్న ప్రజాప్రతినిధులు.. తమ నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా జరిగిన బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే, అంబేద్కర్ జయంతి వేడకల్లో అందరూ బిజీబిజీగా గడిపారు. మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, బొడిగ శోభ, పుట్ట మధూకర్ తదితరులు విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతామంత్రులు, ఎమ్మెల్యేలూ నియోజకవర్గ ఓటర్లతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు పార్టీవర్గాలు చెపుతున్నాయి. ఈనెల 27 పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయని, ఆ తర్వాత మరింత దూకుడు పెంచాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.
ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష పార్టీల్లో పొత్తులపై చర్చ
ఉమ్మడి కరీంనగర్‌లో రెండు విడతలుగా చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచింది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. ఈ క్రమంలో అధికార, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు హాట్‌టాఫిక్‌గా మారుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యన పొత్తు ఉంటుందన్న ప్రచారమూ కలకలం రేపుతోంది. మరోవైపు ‘ఫెడరల్ ఫ్రంట్’ నినాదం భవిష్యత్‌లో ఏయే పార్టీల మధ్య పొత్తులకు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కాంక్షతో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ వివిధ పార్టీలతో పొత్తులు కుదిరితే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్.రమణ హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించే పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణలో సీపీఐకి కేటాయించే ఒకటి, రెండు స్థానాల్లో హుస్నాబాద్ ఉంటుంది. ఈ స్థానంపై సీపీఐ కన్నేసింది. వచ్చే జూన్ తర్వాత పొత్తులపై కలిసొచ్చే పార్టీలతో కాంగ్రెస్ అధికారికంగా చర్చలు జరుపుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాతే కాంగ్రెస్–టీడీపీ–సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ తెరపైకి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొత్తుల వ్యవహారం హాట్‌టాఫిక్‌గా మారింది. బీజేపీ కరీంనగర్, వేములవాడ, పెద్దపల్లి, హుస్నాబాద్, హుజూరాబాద్ స్థానాలపై గట్టిగా దృష్టి సారించింది. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు పోటీకి సై అంటున్నాయి. రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
చర్చనీయాంశంగా తెలంగాణ జనసమితి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకపాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా టీజేఏసీ బ్యానర్‌పై ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల పక్షాన నిలిచిన కోదండరామ్.. కొత్తగా స్థాపించిన పార్టీతో అన్నిపార్టీల్లోనూ గుబులు రేపుతోంది. మరోవైపు ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నాయకులు ఇప్పటినుంచే టీజేఎస్ నాయకత్వంతో టచ్‌లోకి రావడం కలకలంగా మారింది. ఈ నేపథ్యంలో కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులకు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే టీజేఎస్‌పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో టీజేఎస్‌కు ఇప్పటికే బలమైన క్యాడర్ ఉండగా.. భవిష్యత్‌లో మారే రాజకీయ పరిణామాలన్నింటినీ ఆ పార్టీ అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన కేసీఆర్ పనితీరు మార్చుకోవాలని పలువురికి సూచించారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకే టిక్కెట్ అని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న నాయకులూ టీజేఎస్ ద్వారా రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్. టీడీపీ, బీజేపీ తదితర పార్టీలకు చెందిన కొందరు ఆశావహ నాయకులు టీజేఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment