నెల్లూరు(పొగతోట): గూడూరు రూరల్ మండలంలోని ఉపాధిహామీ ఏపీఓ సుబ్బరాయుడిపై దాడి చేసిన అధికారపార్టీ నాయకుడి తనయుడు నాగరాజు, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమాఖ్య(జేఏసీ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బద్దిపూడి మధు, వల్లూరు దయానంద్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఓపై అధికారపార్టీకి చెందిన వ్యక్తులు 20 మంది చుట్టుముట్టి మేము చెప్పిన పనులు చేయవా అంటూ పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ళతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఓ ప్రాణభయంతో పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉపా«ధి సిబ్బంది అభద్రతతో పనులు చేయలేమని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. జ్ఞానప్రకాష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలి
రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు.. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి చిత్రపటాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి
అల్లూరు చెరువు భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు న్యాయం చేయాలని యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చెరువు భూముల్లో 140 యానాది కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మర్‌స్టోరేజ్ కోసం ఆ భూముల్లో ఐదెకరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుందన్నారు. గతంలో పంటలు సాగు చేసుకున్న యానాదులు భూముల్లోకి వెళితే ఎస్సీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు.
భూస్వాముల నుంచి రక్షణ కల్పించండి..
పేద రైతులకు భూ స్వాముల నుంచి రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ సినియర్ నాయకులు పి.దశరథరామయ్య, వి. రామరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. నెల్లూరు రూరల్ మండలం కందమూరులో 150 ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే నెల్లూరుకు చెందిన వ్యాపారులు సాగు చేయనివ్వకుండా రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారని తెలిపారు. అప్పటి కలెక్టర్ భూములను పరిశీలించి వ్యాపారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయమని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం దొంగ పట్టాలు సృష్టించి రైతులను భూముల్లోకి దిగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. భూములు సాగు చేస్తున్నా వారికి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు.
సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి
బ్రాహ్మణక్రాక ఫిషర్‌మెన్ కో–ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1975లో జలదంకి మండలం బ్రాహ్మణక్రాక సోసైటీ రిజిస్టర్ అయిందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్యవర్గ సభ్యుల గడువు పూర్తి అయినందున సోసైటీకి ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతు జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment