నగదు రాక.. దారి తెలీక..
► ‘ఉపాధి’ కూలీల ఖాతాల స్తంభన
► ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి అందని కూలీ
► దిక్కుతోచని స్థితిలో దాదాపు 3 లక్షల మంది
► పట్టించుకోని అధికారులు
ఉదయగిరి: ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీ పని చేసిన 15 రోజుల్లో నగదు వారి ఖాతాల్లో జమచేయాలి. కాస్త అటోఇటో నగదు కూలీల ఖాతాల్లో జమవుతున్నప్పటికీ, ఇప్పుడా నగదు తీసుకునే అవకాశం లేకుండా ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు వాటిని బ్లాక్ చేశారు. దీంతో రెండు నెలలనుంచి పేదల డొక్కలు ఎండుతున్నాయి. వీరి ఖాతాలు ఎందుకు స్తంభింపజేశారో ఎవరూ చేప్పడం లేదు. కూలీల కష్టం గురించి అధికారులకు తెలిపినా సమస్య పరిష్కారం కావడం లేదు.
మరోవైపు జిల్లా అధికారులు కూలీల సంఖ్యను పెంచాలని విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారే తప్ప వారి ఖాతాల్లో పడిన నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని ఆపివేసిన ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా పలువురు కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5.42 లక్షల జాబ్‌కార్డులున్నాయి. వీటి పరిధిలో 12.8 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో సుమారు ఐదు లక్షల మంది కూలీలు పనులు చేసినట్లు రికార్డులు చూపుతున్నాయి.
వీరిలో 3.50 లక్షల వరకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారు. ఈ ఖాతాలలో జమయిన ఉపాధి కూలీ నగదును డ్రా కాకుండా చేయడంతో ఉపాధి కూలీలకు సమస్య తలెత్తింది. ఆ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు కూడా సేవలందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్థానికంగా ఉండే వీరి స్వైపింగ్ మిషన్లలో కూలీలు నగదు డ్రా చేయకుండా ఖాతాలు లాక్ చేయడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్యాంకు జిల్లా కేంద్రంలో మాత్రమే ఉండటంతో వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి కూలీలు తమ నగదు డ్రా చేసుకునే పరిస్థితి లేదు.
కూలీలకు అందని నగదు
ఈ పథకం ప్రారంభంలో ఉపాధి కూలీల నగదును పొదుపు గ్రామసమాఖ్యల ద్వారా పంపిణీ చేసేవారు. ఇందులో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు పోస్టాఫీసుల ద్వారా కూలీలకు నగదు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఉపాధి కూలీల నగదును పంపిణీ చేశారు. ఆ తర్వాత మరలా పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేపట్టారు. గతేడాది ఆగస్టు నుంచి పోస్టాఫీసుల నుంచి కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా ఉపాధి నగదును పంపిణీచేయాలని నిర్ణయించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే చాలామంది ఖాతాలు ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్నందున ఆ ఖాతాల్లోనే ఆర్నెల్ల నుంచి నగదు జమవుతూ ఉంది. ఈ నగదును ఉపాధి కూలీలు స్థానికంగా ఉన్న బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల స్వైపింగ్ మిషన్ల ద్వారా తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఐసీఐసీఐ బ్యాంకులో పడిన ఉపాధి కూలీల నగదు డ్రా కాకుండా ఆ బ్యాంకు అధికారులు స్తంభింపచేశారు. దీంతో ఉపాధి కూలీలు ఆ నగదు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
ఐసీఐసీఐ బ్యాంకే ఖాతాల ఏర్పాటు:
సాధారణంగా ఒక బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలంటే ఆ ఖాతాదారుడి రెండు అడ్రస్ ప్రూఫ్‌లు, ఆధార్ తప్పనిసరి. కానీ స్థానిక ఉపాధి సిబ్బంది ద్వారా కూలీల ప్రమేయం లేకుండానే ఆధార్ నంబర్లు సేకరించిన ఐసీఐసీఐ సిబ్బంది వారి పేరిట ఖాతాలు తెరిచారు. అయితే చాలామంది ఉపాధికూలీలు తమ నగదును స్థానిక బ్యాంకులో జమచేయాలని బ్యాంకు ఖాతానంబర్లు ఇచ్చినప్పటికీ వాటిలో జమకావడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకులోనే జమవుతున్నాయి. ఇపుడు వారు డబ్బు డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
సమస్యకు త్వరలో పరిష్కారం:
ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే జిల్లా అధికారులకు తెలియచేశాము. జిల్లా అధికారులు ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను త్వరలో పరిష్కరిస్తారు. ప్రతి ఉపాధి కూలీ నగదు వారు కోరుకున్న బ్యాంకులో జమయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. –నాగేశ్వరరావు, ఏపీవో