
చేనేతలకు ‘ఉపాధి’ హక్కులు కల్పించాలి
చేనేత కార్మికులను కొద్దిపాటి నైపుణ్యం కలిగిన భూమిలేని వ్యవసాయ కార్మికులుగా గుర్తించి జాతీయ ఉపాధి హామీ హక్కులు కల్పించాలని సీపీఐ నేత డి.రాజా డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సదస్సులో వక్తల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: చేనేత కార్మికులను కొద్దిపాటి నైపుణ్యం కలిగిన భూమిలేని వ్యవసాయ కార్మికులుగా గుర్తించి జాతీయ ఉపాధి హామీ హక్కులు కల్పించాలని సీపీఐ నేత డి.రాజా డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఏర్పాటు చేసిన సదస్సులో ఈ మేరకు డిమాండ్ల చార్టర్‌ను విడుదల చేశారు.
చేనేత పరిశ్రమ పలు ఇక్కట్లు ఎదుర్కుంటోందని, చేనేత కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం సాయం అందించాల్సిన అవసరం ఉందని రాజా పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. చేనేత కార్మికులను మధ్యవర్తులు దోపిడీ చేస్తున్నారని, చేనేత కార్మికుల నుంచి వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేసే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ విప్లవ్ ఠాకూర్ చెప్పారు.
చేనేత కార్మికుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ సూచించారు. గత కొన్నేళ్లుగా చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉపాధి హామీ కింద 100 రోజుల ఉపాధి కల్పించాలన్నారు. చేనేత సంఘాలకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల కార్మికులకు లబ్ధి చేకూరడం లేదని మాజీ ఎంపీ రామచంద్ర కుంతియా పేర్కొన్నారు. సబ్సిడీ కంటే ఉద్యోగ భద్రత, ఉపాధి, సామాజిక భద్రత అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.