ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
హరితహారంలో మొక్కలు నాటిన వాటిపై కాకిలెక్కలు చ్పెప్దొదని హెచ్చరిక
తాండూరు రూరల్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంపై కాకిలెక్కలు చెప్పవద్దని ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్‌హాల్లో ఎంపీడీఓ జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బందితో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని నీరుగారిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్ని మొక్కలు నాటారో వివరాలు వెల్లడించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను కోరారు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆమె ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం అంటే మీకు తమాషాగా ఉందా..? అని హెచ్చరించారు. నెలరోజుల నుంచి కార్యక్రమంపై చెబుతూనే ఉన్నా.. మీ పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. గ్రామాల్లో ఎన్ని గుంతలు తవ్వారు? ఎన్ని మొక్కలు నాటారు..? అనే విషయాలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మండలం మొత్తంపై నివేదిక ఇవ్వాలని ఏపీఓ శారదను కోరారు. ఆమె కూడా తప్పుడు నివేదిక ఇవ్వడంతో స్టోరీలు చెప్పొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తప్పుడు లెక్కలే చెబుతున్నారని ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశారు.
ఉపాధి పనులను విస్మరిస్తే ఊరుకునేది లేదు
బషీరాబాద్: గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని డ్వామా పీడీ హరిత ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు, సిబ్బందితో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా హరితహారం కార్యక్రమంపై సిబ్బందితో సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. పాఠశాలల్లో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారని అడిగి తెలుసుకున్నారు. వన నర్సరీల్లో నుంచి తరలించిన మొక్కలను నాటారా? లేదా? అనే విషయమై విచారణ జరుగుతుందన్నారు. హరితహారం మొక్కలు నాటినట్లు తప్పుడు నివేదికలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నాటిన మొక్కలను పరిరక్షించేలా అధికారులు, సిబ్బంది చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, ఎంపీడీఓ ప్రమీల, ఏపీఓ జనార్ధన్, అటవీశాఖ బీట్ అధికారి జర్నప్ప, ఏపీఎం చినశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.